మహిళల గోప్యతకు భంగం కలిగించరాదు

ABN , First Publish Date - 2020-07-01T08:43:53+05:30 IST

మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని, వారి గోప్యతకు భంగం కలిగించకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి ఉంచిన మార్ఫింగ్‌ ఫొటోలు తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని బీజేపీ నేత...

మహిళల గోప్యతకు భంగం కలిగించరాదు

  • శశికళ పుష్ప అభ్యంతరకర ఫొటోలు తొలగించండి
  • ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 30: మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని, వారి గోప్యతకు భంగం కలిగించకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి ఉంచిన మార్ఫింగ్‌ ఫొటోలు తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యురాలు శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌, జస్టిస్‌ తల్వంత్‌ సింగ్‌లతో కూడి న ధర్మాసనం మంగళవారం ఈ మేరకు స్పష్టం చేసింది. ఫొటోలు తొలగించాలని వేసిన పిటిషన్‌ ను సింగిల్‌ జడ్జి ధర్మాసనం తోసిపుచ్చడాన్ని ఆమె ద్విసభ్య ధర్మాసనంలో సవాలు చేశారు.  అభ్యంతరకరంగా ఉన్న ఆమె ఫొటోలను వెంటనే తొలగించాలని ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌ సంస్థలను ఆదేశించింది. అయితే, ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో తాము అప్‌లోడ్‌ చేయలేదని, తాము మాధ్యమం మాత్రమేనని ఆ సంస్థల తరఫు న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, అరుణ్‌ కత్పాలియా తెలిపారు. ఫొటోలు అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిపై కేసు పెట్టకుండా, మాధ్యమంగా ఉన్న సంస్థలను మాత్రమే ఇంప్లీడ్‌ చేయడం సరికాదని అభ్యంతరం తెలిపారు. దీంతో అభ్యంతరకరంగా ఉన్న సమాచారాన్ని ఎలా తొలగించాలో చర్చించుకోవాలని ఆయా పార్టీల న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.  

Updated Date - 2020-07-01T08:43:53+05:30 IST