Abn logo
May 11 2021 @ 17:05PM

కోర్టు ఫీజు చెల్లించలేదని హైకోర్టు విచారణ వాయిదా

న్యూఢిల్లీ : కోర్టు ఫీజు చెల్లించలేదనే కారణంతో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారం వాయిదా వేసింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థిని ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఫీజు చెల్లించేందుకు అవసరమైనవన్నీ సక్రమంగానే పని చేస్తున్నాయని, మొదట ఫీజు చెల్లించాలని హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. దేశ రాజధాని నగరంలోని సుల్తాన్‌పురిలో ఉన్న క్వారంటైన్ సెంటర్‌లో సరైన సదుపాయాలు లేవని, అపరిశుభ్రంగా ఉందని ఈ పిటిషన్ ఆరోపిస్తోంది.


పిటిషనర్ తరపు న్యాయవాది కన్వల్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, కోర్టు ఫీజు చెల్లించేందుకు అవసరమైన లింక్ పని చేయడం లేదని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్ మాట్లాడుతూ,  పిటిషనర్లు కోర్టు ఫీజు చెల్లించడం లేదనే విషయాన్ని తాను గడచిన 15 రోజుల నుంచి గమనిస్తున్నానని, పిటిషన్‌ను టైప్ చేయించడానికి ఇంకా ఎక్కువ సొమ్ము చెల్లిస్తారని అన్నారు. కోర్టు ఫీజు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. మంగళవారం ఉదయం తాను అన్నీ తనిఖీ చేశానని, అన్నీ బాగానే పని చేస్తున్నాయని చెప్పారు. మొదట కోర్టు ఫీజు చెల్లించాలని, ఆ తర్వాత తాము విచారణ జరుపుతామని చెప్పారు. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేశారు. 


పిటిషనర్ తన పిటిషన్‌లో, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధరణ అయిందని తెలిపారు. అక్కడ క్వారంటైన్ ఫెసిలిటీ లేకపోవడంతో తనను సుల్తాన్ పురి ఐసొలేషన్ సెంటర్‌కు పంపించారని పేర్కొన్నారు. అక్కడ తాను మూడు రోజులపాటు ఉన్నానన్నారు. అక్కడి రోగులకు ప్రమాదం కలిగించే పరిస్థితులు ఉన్నాయన్నారు. మరుగుదొడ్లు, దుప్పట్లు శుభ్రంగా లేవన్నారు. వైద్యులు, నర్సులు కూడా లేరని తెలిపారు. శానిటైజ్ చేయడం లేదని, పరిశుభ్రతను పాటించడం లేదని పేర్కొన్నారు. 


Advertisement