Satyendra Jain కస్టడీ మరో రెండు వారాలు పొడిగింపు

ABN , First Publish Date - 2022-06-27T22:17:49+05:30 IST

మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జ్యుడిషియల్..

Satyendra Jain కస్టడీ మరో రెండు వారాలు పొడిగింపు

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyender jain) జ్యుడిషియల్ కస్టడీని మరో రెండువారాల పాటు ఢిల్లీ కోర్టు సోమవారంనాడు పొడిగించింది. ఆసుపత్రి పాలైన సత్యేంద్ర జైన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచిచిన ఈడీ... ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరింది. దీంతో రెండువారాల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ఆదేశాలిచ్చారు.


దీనికి ముందు, విచారణ సందర్భంగా జైన్ కానీ, ఆయన తరపు న్యాయవాది కానీ  కోర్టు ముందు హాజరుకాకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. జైన్ ఆసుపత్రిలో ఉన్నారని కోర్టుకు విన్నవించడంతో, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరచాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈడీ వాదనలు విన్న కోర్టు... సత్యేంద్ర జైన్‌ జ్యుడిషయల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించింది. పీఎంఎల్ఏ‌లోని క్రిమినల్ సెక్షన్స్ కింద మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ను గత మే 30వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. కాగా, జైన్‌ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో గత వారంలో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు.

Updated Date - 2022-06-27T22:17:49+05:30 IST