Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 27 2021 @ 16:55PM

ఢిల్లీలో ఛాత్‌పూజకు కేజ్రీవాల్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఛాత్‌ పూజ ఉత్సవాలకు కేజ్రీవాల్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో కోవిడ్ పరిస్థితిపై ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (డీడీఎంఏ) బుధవారంనాడు సమావేశమైంది. ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతాల్లో కఠిన కోవిడ్ ఆంక్షల మధ్య ఛాత్‌పూజకు అనుమతించాలని డీడీఎంఏ సమావేశం నిర్ణయించింది. సమావేశానంతరం మీడియాతో ఢిల్లీ ఉప ముఖమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, కోవిడ్ కఠిన నిబంధనలతో ఢిల్లీలో ఛాత్ పూజకు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను అనుమతిస్తామని చెప్పారు.

కాగా, కోవిడ్ నేపథ్యంలో యమునా నది ఒడ్డు, జలాశయాలు, ఆలయాలతో సహా బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజ‌ను నిషేధిస్తున్నట్టు గత సెప్టెంబర్ 30న డీడీఎంఏ ప్రకటించింది. అక్టోబర్ 27న సమావేశమై పరిస్థితిని మరోసారి సమీక్షిస్తామని పేర్కొంది. ఈ నిషేధంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సహా బీబీజే నేతలు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని బహిరంగ ప్రదేశాల్లో ఛాత్‌పూజకు అనుమతించేలా డీడీఎంఏకు కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదన పంపాలని డిమాండ్ చేశారు. ఛాత్ పూజా సంప్రదాయం ప్రకారం, దీపావళి తర్వాత వచ్చే కీలక పండుగల్లో ఛాత్ పూజ ఒకటి. ఏటా భక్తులు సూర్య దేవుడికి వందనాలు , అర్ఘ్యాలు సమర్పించుకుంటారు. నదులు, చెరువులు, ఇతర జలవనరులకు పూజలు చేయడం ద్వారా ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలుపుతారు. ప్రత్యేకించి ఉత్తరాదిన ఈ పండుగ ఘనంగా జరుపుకొంటారు.

Advertisement
Advertisement