Delhiలో డీఎంకే కార్యాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-03T13:14:44+05:30 IST

ఢిల్లీ దీనదయాళ్‌ మార్గ్‌లో డీఎంకే కార్యాలయం ‘అన్నా-కలైంజర్‌ అరివాలయం’ను ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం సాయంత్రం ప్రారంభించారు.

Delhiలో డీఎంకే కార్యాలయం ప్రారంభం

                      - సోనియా సహా ప్రతిపక్ష నేతల హాజరు


చెన్నై: ఢిల్లీ దీనదయాళ్‌ మార్గ్‌లో డీఎంకే కార్యాలయం ‘అన్నా-కలైంజర్‌ అరివాలయం’ను ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం సాయంత్రం ప్రారంభించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు, ఎంపీల సమక్షంలో ఈ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మూడంతస్థులు కలిగిన ’అన్నా-కలైంజర్‌ అరివాలయం’ కార్యాలయ భవనం ప్రవేశ ద్వారం వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారాన్ని దాటుకుని వెళ్లగానే విశాలమైన సమావేశ హాలు ఉంది. పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర పార్టీ ప్రముఖులు బసచేయడానికి గదులు కూడా ఉన్నాయి. డీఎంకే దివంగత నేత అన్బళగన్‌ పేరుతో గ్రంథాలయం, సమావేశాలు జరుపుకునేందుకు మురసొలిమారన్‌ అరంగం పేరుతో ప్రత్యేక హాలు ఉంది. ఇలా సకల సదుపాయాలతో కూడిన ఈ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా సహా ఢిల్లీలోని అన్ని పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించారు. ఆ మేరకు ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తమిళనాడు హౌస్‌ నుండి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో సత్యామార్గ్‌, ధీరమూర్తి మార్గ్‌, అక్బర్‌రోడ్డు, ఐటీ ఆఫీసు రోడ్డు అంటూ నాలుగు చోట్ల పార్టీ ప్రముఖులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పార్టీశ్రేణుల స్వాగత సత్కారాల అనంతరం ఆయన దీనదయాళ్‌మార్గ్‌లోని కొత్త పార్టీ కార్యాలయపు భవన ప్రాంతానికి చేరుకున్నారు. సాయంత్రం ఐదుగంటలకు ఆయన ప్రతిపక్ష నేతల సమక్షంలో ప్రవేశద్వారం వద్ద నిలిచి రిమోట్‌ కంట్రోల్‌ పరికరం ద్వారా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ముందున్న 45 అడుగుల ఎత్తు స్తంభంపై డీఎంకే పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీనేత అఖిలేష్‌ యాదవ్‌, ముస్లింలీగ్‌ నేత నవాజ్‌ గనీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం, ఆంగ్ల దినపత్రిక హిందూ పూర్వ సంపాదకుడు ఎన్‌.రామ్‌, డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌, ఎండీఎంకే నేత వైగో, టీడీపీ నేత గల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో సోనియా సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులను స్టాలిన్‌ శాలువలతో సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు. ఆ తర్వాత సోనియా గాంధీ, ఇతర పార్టీల నేతలతో కలిసి జ్యోతిప్రజ్వలనం చేశారు. కార్యాలయంలో రెండో అంతస్థులో అన్బళగన్‌ స్మారక గ్రంథాలయాన్ని సోనియాగాంధీ ప్రారంభించారు. ‘మురసొలి అరంగం’ను స్టాలిన్‌ ప్రారంభించారు. ఇక అన్నాదురై విగ్రహాన్ని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, కరుణానిధి విగ్రహాన్ని ఎంపీ టీఆర్‌ బాలు ఆవిష్కరించారు.


పుస్తకాల ఆవిష్కరణ...

ఈ కార్యక్రమంలో భాగంగా రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. ఏఎస్‌ పన్నీర్‌సెల్వం రచించిన ‘కరుణానిధి ఎ లైఫ్‌’ అనే ఆంగ్ల పుస్తకాన్ని హిందూ ఎన్‌.రామ్‌ ఆవిష్కరించగా,  తొలి ప్రతిని సోనియాగాంధీ స్వీకరించారు. ప్రొఫెసర్‌ జయరంజన్‌ రచించిన ‘ఎ ద్రవిడియన్‌ జర్నీ’ ఆంగ్ల పుస్తకాన్ని స్టాలిన్‌ ఆవిష్కరించి తొలి ప్రతిని సోనియాకు అందజేశారు.

Updated Date - 2022-04-03T13:14:44+05:30 IST