అడిగినవారికే విద్యుత్తు రాయితీ : Kejriwal

ABN , First Publish Date - 2022-05-05T23:58:04+05:30 IST

విద్యుత్తు రాయితీలు కావాలో, వద్దో ఎంచుకునే అవకాశాన్ని ప్రజలకు

అడిగినవారికే విద్యుత్తు రాయితీ : Kejriwal

న్యూఢిల్లీ : విద్యుత్తు రాయితీలు కావాలో, వద్దో ఎంచుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి Aravind Kejriwal చెప్పారు. అక్టోబరు 1 నుంచి కోరినవారికి మాత్రమే విద్యుత్తు రాయితీలను అందజేస్తామని తెలిపారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. 


ఢిల్లీలో నిరుపేదలకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును వినియోగించే నిరుపేదలకు యూనిట్‌కు రూ.1 చొప్పున వసూలు చేస్తామని 2015లో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ప్రకటించింది. 201 నుంచి 400 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగించేవారికి రూ.800 రాయితీ ఇస్తామని పేర్కొంది. 


ఢిల్లీ రాష్ట్ర  విద్యుత్తు శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఇటీవల కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌కు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్స్‌లో బొగ్గు కొరత ఉందని, తగినంత బొగ్గును అందుబాటులో ఉంచాలని కోరారు. దీనిపై సింగ్ స్పందిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. వివిధ ప్లాంట్ల వద్ద అందుబాటులో ఉన్న బొగ్గు గురించి వివరించారు. 


ఇదిలావుండగా, ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గం గురువారం స్టార్టప్ పాలసీని ఆమోదించింది. యువత వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థికంగా సహాయపడతామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. అనేక ఏజెన్సీలను నియమించుకుని, వివిధ రంగాల్లో నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.స్టార్టప్‌ను ప్రారంభించాలనుకునేవారు సహాయం కోసం ఈ కమిటీలను సంప్రదించవచ్చునని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా వారికి సహాయపడుతుందన్నారు. 


Read more