పంజాబ్ ఓటర్లకు కేజ్రీవాల్ తాయిలాలు

ABN , First Publish Date - 2021-12-07T23:36:10+05:30 IST

రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు

పంజాబ్ ఓటర్లకు కేజ్రీవాల్ తాయిలాలు

న్యూఢిల్లీ : రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ భారీ వాగ్దానాలు చేశారు. మంగళవారం ఆయన పంజాబ్‌లోని హోషియార్ పూర్‌లో మాట్లాడుతూ, షెడ్యూల్డు కులాలవారికి తాను ఐదు వాగ్దానాలు చేస్తున్నానని చెప్పారు. బాలలకు ఉచిత విద్య, ఐఏఎస్, ఐఐటీ, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉచిత శిక్షణ, కళాశాల విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య, ఉచిత వైద్య సేవలు అందజేస్తామని, 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. 


పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ షెడ్యూల్డు కులాలకు చెందినవారని, తనకు ఓటు వేయాలని ఆయన ఎస్సీలను కోరుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. తాను ఎస్సీ కులాలకు చెందినవాడిని కాదని, అయితే ‘‘నేను మీ కుటుంబం నుంచి వచ్చాను’’ అని చెప్పారు. తాను ఎస్సీలకు సహాయపడటానికి ముందుకు వచ్చానని, చన్నీ మాత్రం ఓట్లను పొందేందుకు మాత్రమే ఎస్సీ కార్డును ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. 


Updated Date - 2021-12-07T23:36:10+05:30 IST