ఢిల్లీ ఆల్‌రౌండర్ ప్రతిభ.. కోల్‌కతా చిత్తు

ABN , First Publish Date - 2022-04-11T01:17:43+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్ విజృంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దుమ్మురేపి కోల్‌కతాను చిత్తు చేసి ఐపీఎల్‌లో రెండో

ఢిల్లీ ఆల్‌రౌండర్ ప్రతిభ.. కోల్‌కతా చిత్తు

ముంబై: ఢిల్లీ కేపిటల్స్ విజృంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దుమ్మురేపి కోల్‌కతాను చిత్తు చేసి ఐపీఎల్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ బంతులను ఎదుర్కోలేక 171 పరుగులకే కోల్‌కతా కుప్పకూలింది. ఫలితంగా 44 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.


 పృథ్వీ షా, వార్నర్ తొలుత దుమ్మురేపడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అనంతరం 216 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా ఏ దశలోనూ విజయం దిశగా సాగలేకపోయింది. 21 పరుగుల వద్ద వెంకటేశ్ అయ్యర్ (18) రూపంలో ఆ జట్టుకు తొలి దెబ్బ పడింది. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.


కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా కాసేపు క్రీజులో ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54, నితీశ్ రాణా 20 బంతుల్లో 3 సిక్సర్లతో 30 పరుగులు చేశారు. వారిద్దరూ అవుటయ్యాక జట్టు ఇక కోలుకోలేకపోయింది. మరోవైపు, కుల్దీప్ యాదవ్ విజృంభించి ఒకే ఓవర్‌లో కమిన్స్ (4), సునీల్ నరైన్ (4), ఉమేశ్ యాదవ్ (0)లను పెవిలియన్ పంపడంతో కోల్‌కతా ఓటమి ఖాయమైంది.


క్రీజులో ఉన్న రసెల్ కూడా బ్యాట్ ఝళిపించలేకపోయాడు. 21 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి ఠాకూర్ వేసిన చివరి ఓవర్ రెండో బంతికి 9వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. నాలుగో బంతికి రసీఖ్ సలామ్ (7) అవుటవడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 171 పరుగుల వద్ద కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. కుల్దీప్ యాదవ్ 4, ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు. 


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పృథ్వీషా (51), వార్నర్ (61) అర్ధ సెంచరీలతో విరుచుకుపడగా చివర్లో అక్షర్ పటేల్ (22), ఠాకూర్ (29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. రిషభ్ పంత్ 27 పరుగులు చేశాడు. 

Updated Date - 2022-04-11T01:17:43+05:30 IST