Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెన్నై నిలిచేనా?

జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

నేడు తొలి క్వాలిఫయర్‌

గెలిచిన జట్టు ఫైనల్‌కు

 రాత్రి 7.30 - స్టార్‌ స్పోర్ట్స్‌లో

 భారత్‌లో ఆరంభమైన లీగ్‌ దశ మ్యాచ్‌లకు యూఏఈలో తెర పడింది. ఇక నేటి నుంచి అసలు సిసలైన సమరం ఆరంభం కాబోతోంది. టాప్‌-2లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య ఆదివారం తొలి క్వాలిఫయర్‌ జరుగబోతోంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరుస ఓటములతో ఉన్న ధోనీ సేన ఈ కీలక మ్యాచ్‌లో పైచేయి సాధిస్తుందా? లేక డాషింగ్‌ ఢిల్లీ అద్భుత విజయంతో తుది పోరుకు చేరుతుందా? అనేది వేచిచూడాల్సిందే..

దుబాయ్‌: యూఏఈలోనే జరిగిన గతేడాది సీజన్‌ సీఎ్‌సకేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కనీసం ప్లేఆ్‌ఫ్సకు చేరకుండానే నిష్క్రమించింది. కానీ ఈసారి తమ లోపాలను సరిదిద్దుకుంటూ అందరికన్నా ముందే బెర్త్‌ ఖాయం చేసుకోగలిగింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి ఎదురుకావడం ఆ జట్టుకు ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు ఆదివారం దుబాయ్‌లో జరిగే తొలి క్వాలిఫయర్‌లోనూ పరాజయం పాలైతే ఆ జట్టు కోలుకోవడం కష్టమే. అటు ఢిల్లీ చూస్తే వరుస విజయాలతో జోష్‌లో ఉంది. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ బెంగళూరుపై దాదాపు విజయం అంచుల వరకూ వచ్చింది. భరత్‌ సిక్సర్‌తో అంతా తారుమారైంది. అయినా పాయింట్ల పట్టికలో స్పష్టమైన ఆధిక్యంతో టాప్‌లోనే నిలిచింది. పెద్దగా స్టార్లు లేకపోయినా డీసీ సమష్టి ఆటతీరుతో రాణిస్తుండడం కలిసివచ్చే విషయం. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి నేరుగా తుదిపోరుకు చేరాలనుకుంటోంది. ఈ సీజన్‌లో చెన్నైతో తలపడిన రెండుసార్లూ ఢిల్లీనే గెలిచింది.


ఓపెనర్ల అండతో..:

సీఎస్‌కే ప్రధాన బలం వారి ఓపెనర్లే. రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసి అందించే  శుభారంభాలతో ఆ జట్టు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలుగుతోంది. కానీ వారు విఫలమైతే మిడిలార్డర్‌ పెద్దగా రాణించలేకపోతోంది. ఈ లోపాన్ని అధిగమించలేకపోతే అటు అద్భుతంగా కనిపిస్తున్న ఢిల్లీ బౌలింగ్‌ దళంతో వారికి కష్టాలు తప్పవు. ఫామ్‌లో లేని సురేశ్‌ రైనా ఫిట్‌నె్‌సపై స్పష్టత రావాల్సి ఉంది. లేకుంటే రాబిన్‌ ఊతప్పను బరిలోకి దించుతారు. మొయిన్‌ అలీ, ధోనీ బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. రాయుడు, జడేజా, బ్రావో ఫర్వాలేదనిపిస్తున్నారు. అలాగే తమ స్కోరును కాపాడుకునే విషయంలో బౌలర్లు కూడా విఫలమవుతున్నారు. పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ మాత్రమే అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. 


ఫేవరెట్‌గా బరిలోకి..:

బ్యాటింగ్‌.. బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. ఇప్పటికే చెన్నైని రెండుసార్లు ఓడించడం వారికి కలిసివచ్చే విషయం. అలాగే లీగ్‌ దశలో ఆడిన14 మ్యాచ్‌ల్లో పది విజయాలు సాధించి ఉత్సాహంతో ఉంది. అటు ఓపెనర్లు పృథ్వీ షా, ధవన్‌ కూడా మెరుపు ఆరంభాన్నిస్తున్నారు. చివర్లో పంత్‌, హెట్‌మయెర్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు. అయితే మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ రాణించాల్సి ఉంది. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ గాయం నుంచి కోలుకుంటే ఇక ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో పేస్‌త్రయం అవేశ్‌, రబాడ, నోకియా ముప్పేట దాడికి సిద్ధంగా ఉన్నారు. స్పిన్నర్‌ అక్షర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ పరుగులు కట్టడి చేయగలుగుతున్నాడు.


జట్లు (అంచనా)

చెన్నై: రుతురాజ్‌, డుప్లెసి, రాయుడు, మొయిన్‌ అలీ, రైనా/ఊతప్ప, జడేజా, ధోనీ (కెప్టెన్‌), బ్రావో, హాజెల్‌వుడ్‌, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌.

ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్‌ ధవన్‌, శ్రేయాస్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), రిపల్‌/స్టొయినిస్‌, హెట్‌మయెర్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, రబాడ, నోకియా, అవేశ్‌ ఖాన్‌.

పిచ్‌-వాతావరణం

 వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. గత కొన్ని మ్యాచ్‌లనుంచి పిచ్‌ మందకొడిగా మారింది. ఇక్కడ ఎక్కువగా స్వల్ప స్కోర్లే నమోదవుతున్నాయి. మంచు కారణంగా ఛేజింగ్‌ జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. సీమర్లకు అనుకూలం.

Advertisement
Advertisement