Abn logo
Oct 10 2020 @ 04:09AM

ఢిల్లీ తడాఖా

Kaakateeya

విశేషంగా రాణించిన బౌలర్లు 

రాజస్థాన్‌ రాయల్స్‌కు నాలుగో ఓటమి


షార్జాలో మ్యాచ్‌ అంటే ధనాధన్‌ ఆటతీరుతో.. భారీ సిక్సర్లతో పరుగుల వరద పారాల్సిందే.. ఇప్పటిదాకా జరిగింది కూడా అదే. కానీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో సీన్‌ రివర్స్‌ అయ్యింది.. ఫ్లాట్‌ పిచ్‌ కాస్తా బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో బౌలర్లు పండగ చేసుకున్నారు. భీకర ఫామ్‌లో ఉన్న ఢిల్లీ ముందుగా బ్యాటింగ్‌కు దిగి 184 పరుగులే చేయగా, సులువుగా ఛేదిస్తుందనుకున్న రాజస్థాన్‌.. డీసీ బౌలర్ల ధాటికి 138 పరుగులకే చతికిలపడింది. ఢిల్లీ జట్టులో హెట్‌మయెర్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.


5 ఈ సీజన్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐదు సార్లూ ఢిల్లీ గెలిచింది. 


షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. చిన్న మైదానంలో ఓ మాదిరి స్కోరును కాపాడిన ఢిల్లీ బౌలర్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. అటు ఇదే స్టేడియంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ఛేదన చేసిన జట్టుగా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ వీరి ధాటికి చిగురుటాకులా వణికింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 46 పరుగుల తేడాతో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఇక ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది నాలుగో పరాజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. హెట్‌మయెర్‌ (24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 45), స్టొయినిస్‌ (30 బంతుల్లో 4 సిక్సర్లతో 39) రాణించారు. ఆర్చర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. తెవాటియా (38) జైస్వాల్‌ (34), స్మిత్‌ (24) ఓ మాదిరిగా ఆడారు. అశ్విన్‌, స్టొయిని్‌సకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అశ్విన్‌ నిలిచాడు.

ఢిల్లీ బౌలర్ల హవా:  చిన్న మైదానంలో ఓ మాదిరి లక్ష్యమే అయినా రాజస్థాన్‌ పరుగులు తీసేందుకు అష్టకష్టాలు పడింది. ఎక్కువగా పేస్‌ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోస్‌ బట్లర్‌ (13) తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించి తన ఫామ్‌ను చాటుకున్నా మూడో ఓవర్‌లోనే స్పిన్నర్‌ అశ్విన్‌కు దొరికిపోయాడు. వన్‌డౌన్‌లో దిగిన స్మిత్‌ (24) రబాడ ఓవర్‌లో 6,4తో ఆకట్టుకున్నాడు. కానీ అతడూ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మరో ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ నిదానంగా ఆడడం జట్టును ఇబ్బందిపెట్టింది. ఈ మైదానంలో ఇప్పటికే రెండు అర్ధసెంచరీలు సాధించిన శాంసన్‌ (5) ఆదుకుంటాడనుకున్నా భారీ షాట్‌కు వెళ్లి లాంగాన్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో మ్యాచ్‌ పూర్తిగా ఢిల్లీ చేతుల్లోకొచ్చినట్టయింది. 13వ ఓవర్‌లో జైస్వాల్‌ను స్టొయినిస్‌ అవుట్‌ చేశాడు. 100/7 స్కోరుతో ఉన్న దశలో క్రీజులో తెవాటియా ఉన్నా చేసేదేమీ లేకపోయింది. అప్పుడప్పుడు బౌండరీలతో మెరుపులు మెరిపించిన తను ఆఖరి ఓవర్‌లో వెనుదిరిగాడు.

ఆరంభం నుంచే తడబాటు: టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ అనూహ్యంగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఇక పరుగుల మోత ఖాయమే అనుకున్నా.. బౌలర్లు సత్తా చూపడంతో పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే డెత్‌ ఓవర్లలో గతి తప్పడంతో ఢిల్లీ కాస్త కోలుకోగలిగింది.పేసర్‌ ఆర్చర్‌ తన వరుస ఓవర్లలో ఓపెనర్లు ధవన్‌ (5), పృథ్వీ షా (19) వికెట్లతో ఝలక్‌ ఇచ్చాడు. ఇక క్రీజులో ఉన్న కాసేపు నాలుగు ఫోర్లతో జోరు చూపించిన కెప్టెన్‌ శ్రేయాస్‌ (22)ను ఎక్స్‌ట్రా కవర్‌ నుంచి జైస్వాల్‌ విసిరిన త్రో వికెట్లను తాకడంతో రనౌటయ్యాడు. దీంతో 51 రన్స్‌కు మూడు వికెట్లు కోల్పోయింది. మరోవైపు స్టొయినిస్‌ మాత్రం అడపాదడపా సిక్సర్లతో ప్రమాదకరంగా కనిపించాడు. క్రీజులో పంత్‌ (5) కూడా ఉండడంతో భాగస్వామ్యాన్ని ఆశించిన ఢిల్లీకి తను కూడా రనౌట్‌ కావడం నిరాశపరిచింది. స్టొయిని్‌సను పట్టించుకోకుండా లేని పరుగు కోసం నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌ నుంచి ముందుకు వెళ్లిన పంత్‌ మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు చక్కటి బంతులతో పరుగులను కట్టడి చేసిన స్పిన్నర్‌ తెవాటియా 14వ ఓవర్‌లో కీలక స్టొయినిస్‌ వికెట్‌ తీయడంతో రాజస్థాన్‌ సంబరాల్లో మునిగింది.

కాసేపు ‘హిట్‌’మయెర్‌: స్టొయినిస్‌ నిష్క్రమణ తర్వాత హెట్‌మయెర్‌ ఎదురుదాడికి దిగాడు. 15వ ఓవర్‌లో తొలి సిక్సర్‌ బాదిన తను మరుసటి ఓవర్‌లో వరుసగా 4,6 బాది ప్రత్యర్థి జట్టులో ఆందోళన పెంచాడు. త్యాగి వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో మరింతగా చెలరేగి వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఢిల్లీకి భారీ స్కోరు ఖాయమే అనిపించింది. కానీ అదే ఓవర్‌లో మరో సిక్సర్‌ కోసం ప్రయత్నించి తెవాటియాకు క్యాచ్‌ ఇచ్చాడు. 19వ ఓవర్‌లో మాత్రం ఢిల్లీ 22 పరుగులు రాబట్టడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఆఖరి ఓవర్‌లో ఆర్చర్‌ వికెట్‌ సహా మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.


స్కోరు బోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా (సి అండ్‌ బి) ఆర్చర్‌ 19; శిఖర్‌ ధవన్‌ (సి) జైస్వాల్‌ (బి) ఆర్చర్‌ 5; శ్రేయాస్‌ (రనౌట్‌/జైస్వాల్‌) 22; పంత్‌ (రనౌట్‌/వోహ్రా/తెవాటియా) 5; స్టొయినిస్‌ (సి) స్మిత్‌ (బి) తెవాటియా 39; హెట్‌మయెర్‌ (సి) తెవాటియా (బి) త్యాగి 45; హర్షల్‌ (సి) తెవాటియా (బి) ఆర్చర్‌ 16; అక్షర్‌ (సి) బట్లర్‌ (బి) ఆండ్రూ టై 17; రబాడ (నాటౌట్‌) 2; అశ్విన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 184/8; వికెట్ల పతనం: 1-12, 2-42, 3-50, 4-79, 5-109, 6-149, 7-181, 8-183; బౌలింగ్‌: వరుణ్‌ ఆరోన్‌ 2-0-25-0; ఆర్చర్‌ 4-0-24-3; కార్తీక్‌ త్యాగి 4-0-35-1; ఆండ్రూ టై 4-0-50-1; శ్రేయాస్‌ గోపాల్‌ 2-0-23-0; తెవాటియా 4-0-20-1.

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్‌ (బి) స్టొయినిస్‌ 34; బట్లర్‌ (సి) ధవన్‌ (బి) అశ్విన్‌ 13; స్మిత్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) నోకియా 24; శాంసన్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) స్టొయినిస్‌ 5; మహిపాల్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 1; రాహుల్‌ తెవాటియా (బి) రబాడ 38; ఆండ్రూ టై (సి) రబాడ (బి) అక్షర్‌ 6; ఆర్చర్‌ (సి) శ్రేయాస్‌ అయ్యర్‌ (బి) రబాడ 2; శ్రేయాస్‌ గోపాల్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) హర్షల్‌ 2; కార్తీక్‌ త్యాగి (నాటౌట్‌) 2; వరుణ్‌ (సి) పంత్‌ (బి) రబాడ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.4 ఓవర్లలో 138 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-15, 2-56, 3-72, 4-76, 5-82, 6-90, 7-100, 8-121, 9-136; బౌలింగ్‌: రబాడ 3.4-0-35-3; నోకియా 4-0-25-1; అశ్విన్‌ 4-0-22-2; హర్షల్‌ పటేల్‌ 4-0-29-1; అక్షర్‌ పటేల్‌ 2-0-8-1; స్టొయినిస్‌ 2-0-17-2. 

Advertisement
Advertisement
Advertisement