ఢిల్లీ.. జోరు తగ్గలేదు

ABN , First Publish Date - 2020-10-06T08:57:47+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చూపింది.

ఢిల్లీ..   జోరు తగ్గలేదు

స్టొయినిస్‌ 

తుఫాన్‌ ఇన్నింగ్స్‌

రబాడకు నాలుగు వికెట్లు

బెంగళూరు చిత్తు


ఎవరి అంచనాలకు అందని ఆటతీరుతో ఢిల్లీ క్యాపిటల్స్‌ దూసుకెళుతోంది. కష్టసమయంలో బ్యాట్స్‌మెన్‌ తెగింపుతో చెలరేగుతుండగా.. ఆ తర్వాత ప్రత్యర్థిని కుదురుకోనీయకుండా బౌలర్లు విజృంభిస్తున్నారు. దీంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఈ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అటు బౌలర్ల వైఫల్యంతో భారీగా పరుగులిచ్చుకున్న బెంగళూరును.. స్టార్‌ లైన్‌పతో కూడిన బ్యాట్స్‌మెన్‌ కూడా ఆదుకోలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికే ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్‌లో కూర్చోవడంతో లక్ష్య ఛేదన తలకు మించిన భారమైంది.  


దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చూపింది. స్టొయినిస్‌ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌) మెరుపు అర్ధసెంచరీకి తోడు పేసర్‌ రబాడ (4/24) వికెట్ల వేట కారణంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 59 రన్స్‌ తేడాతో విజయం సాధించింది. దీంతో ఢిల్లీ 8 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. పృథ్వీ షా (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) రాణించాడు. తొలి మ్యాచ్‌ ఆడిన సిరాజ్‌ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడింది. కోహ్లీ (39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) మాత్రమే ఓ మాదిరిగా ఆడాడు. నోకియా, అక్షర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అక్షర్‌ పటేల్‌ నిలిచాడు. 


నిలకడలేమితో..:

197 పరుగుల ఛేదనలో బెంగళూరు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. ఆరంభం నుంచే వికెట్ల పతనం సాగడంతో కోలుకోవడం కష్టమైంది. మూడో ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్‌ (4)ను అశ్విన్‌.. నాలుగో ఓవర్‌లో ఫించ్‌ (13)ను అక్షర్‌ అవుట్‌ చేశాడు. ఇక డివిల్లీర్స్‌ (9)ను నోకియా దెబ్బతీయగా, జట్టు పవర్‌ప్లేలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఐదు ఓవర్లపాటు కోహ్లీ, మొయిన్‌ అలీ (11) వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు. అయితే స్కోరులో మాత్రం వేగం కనిపించలేదు. దీనికి తోడు పోరాడుతున్న కోహ్లీని 14వ ఓవర్‌లో రబాడ అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీ ఆశలు వదులుకుంది. ఆ తర్వాత సుందర్‌ (17), దూబే (11), ఉడాన (1)ను నాలుగు బంతుల వ్యవధిలో అవుట్‌ చేసిన రబాడ బెంగళూరు పతనాన్ని శాసించాడు. దీంతో మిగతా టెయిలెండర్ల ఆట నామమాత్రమే అయ్యింది.


ఆరంభంలో పృథ్వీ షా:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభమైంది. అయితే మధ్య ఓవర్లలో మెరిసిన బెంగళూరు బౌలర్లు ఎప్పటిలాగే డెత్‌ ఓవర్లలో చేతులెత్తేశారు. ఓపెనర్‌ పృథ్వీ షా తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు బాది జోరు చూపించాడు. పేసర్లు ఉడాన, సైనీలను లక్ష్యంగా చేసుకుంటూ అతడు బౌండరీలతో హోరెత్తించాడు. మూడో ఓవర్‌లో నవ్‌దీప్‌ సైనీ వేసిన బంతిని మోకాలిపై కూర్చుని కొట్టిన సిక్సర్‌ అబ్బురపరిచింది. అంతేకాకుండా స్పిన్నర్‌ చాహల్‌ను సైతం వదిలిపెట్టకుండా ఐదో ఓవర్‌లో ఫోర్‌, సిక్సర్‌ బాదగా అటు ధవన్‌ ఓ ఫోర్‌తో 18 పరుగులు వచ్చాయి. ఈ సమయంలో స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రం పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అయినా జట్టు పవర్‌ప్లేలో 63 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత బౌలర్లు రాణిస్తూ చకచకా మూడు వికెట్లు తీశారు. షా సూపర్‌ ఆటతీరుకు పేసర్‌ సిరాజ్‌ ఏడో ఓవర్‌లో అడ్డుకట్ట వేయడంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే ధవన్‌ (32)తో పాటు దేవ్‌దత్‌ సూపర్‌ క్యాచ్‌తో కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (11) కూడా పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. అప్పటికి జట్టు స్కోరు 90/3.


చివర్లో స్టొయినిస్‌ షో:

కష్టాల్లో పడిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను స్టొయినిస్‌ కదం తొక్కించాడు. 24 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన అతను బంతి ఎక్కడ వేసినా బౌండరీ లైన్‌ దాటేలా చూశాడు. 14వ ఓవర్‌లో 6,4తో 15 రన్స్‌ రాబట్టిన స్టొయినిస్‌.. సైనీ వేసిన ఓవర్‌లో 6,4,4తో 17 పరుగులు రాబట్టాడు. అయితే ఇదే ఓవర్‌ చివరి బంతికి అతడిచ్చిన క్యాచ్‌ను చాహల్‌ అందుకోలేకపోయాడు. ఇక సైనీపై నమ్మకంతో మరో ఓవర్‌ ఇవ్వగా ఈసారి పంత్‌ 6,4.. స్టొయినిస్‌ ఫోర్‌ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్‌లో పంత్‌ను బౌల్డ్‌ చేసిన సిరాజ్‌ కాస్త ఊరటనిచ్చాడు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 89 రన్స్‌ జత చేసింది. చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీ 62 పరుగులతో వేగం కనబర్చింది.


ఈసారికి వదిలేశాడు



మన్కడింగ్‌ అంటే ఇటీవలి కాలంలో వెంటనే స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ గుర్తుకు రాకమానడు. గతేడాది ఐపీఎల్‌లో పంజాబ్‌ కెప్టెన్‌గా ఉన్న తను రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్‌ను ఇదే విధంగా అవుట్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ఢిల్లీకి ఆడుతున్న అశ్విన్‌కు మరోసారి మన్కడింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఆర్‌సీబీ ఓపెనర్‌ ఫించ్‌ క్రీజు దాటి ముందుకు వచ్చినప్పటికీ అశ్విన్‌ ‘క్రీడాస్ఫూర్తి’ని ప్రదర్శిస్తూ హెచ్చరించి వదిలేశాడు. నిజానికి ఢిల్లీ కోచ్‌గా ఉన్న పాంటింగ్‌కు మన్కడింగ్‌పై వ్యతిరేకత ఉంది. అందుకే అశ్విన్‌ కూడా ఈసారి తమ కోచ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టుంది.


స్కోరు బోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) డివిల్లీర్స్‌ (బి) సిరాజ్‌ 42, ధవన్‌ (సి) మొయిన్‌ అలీ (బి) ఉడాన 32, శ్రేయాస్‌ (సి) దేవ్‌దత్‌ (బి) మొయిన్‌ అలీ 11, పంత్‌ (బి) సిరాజ్‌ 37, స్టొయినిస్‌ (నాటౌట్‌) 53, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 196/4. వికెట్ల పతనం: 1-68, 2-82, 3-90, 4-179. బౌలింగ్‌: ఉడాన 4-0-40-1, వాషింగ్టన్‌ 4-0-20-0, సైనీ 3-0-48-0, చాహల్‌ 3-0-29-0, సిరాజ్‌ 4-0-34-2, మొయిన్‌ అలీ 2-0-21-1.


బెంగళూరు: దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (సి) స్టొయినిస్‌ (బి) అశ్విన్‌ 4, ఫించ్‌ (సి) పంత్‌ (బి) అక్షర్‌ 13, కోహ్లీ (సి) పంత్‌ (బి) రబాడ 43, డివిల్లీర్స్‌ (సి) ధవన్‌ (బి) నొకియా 9, మొయిన్‌ అలీ (సి) హెట్‌మయెర్‌ (బి) అక్షర్‌ 11, వాషింగ్టన్‌ (సి) అశ్విన్‌, (బి) రబాడ 17, శివమ్‌ దుబే (బి) రబాడ 11, ఉడాన (సి) అయ్యర్‌ (బి) రబాడ 1, నవదీప్‌ సైనీ (నాటౌట్‌) 12, సిరాజ్‌ (బి) నొకియా 5, చాహల్‌ (నాటౌట్‌)0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 137/9. వికెట్ల పతనం: 1-20, 2-27, 3-43, 4-75, 5-94, 6-115, 7-118, 8-119, 9127. బౌలింగ్‌: రబాడ 4-0-24-4, నొకియా 4-0-22-2, అశ్విన్‌ 4-0-26-1, అక్షర్‌ 4-0-18-2, హర్షల్‌ పటేల్‌ 4-0-43-0.

Updated Date - 2020-10-06T08:57:47+05:30 IST