టిఫిన్ తాతను వరించిన అదృష్టం! మరి అట్ల అవ్వకు ఎప్పుడో..!

ABN , First Publish Date - 2020-10-19T17:39:35+05:30 IST

సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న అవ్వ

టిఫిన్ తాతను వరించిన అదృష్టం! మరి అట్ల అవ్వకు ఎప్పుడో..!

ఆగ్రా: ఢిల్లీలోని బాబా ఢాబా.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా ప్రచారంలోకి వచ్చిన టిఫిన్ సెంటర్. ఎనభైయ్యో పడిలో ఉన్న ఓ వృద్ధుడు ఈ టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తుంటారు. అయితే..కరోనా కారణంగా కస్టమర్ల తన టిఫిన్ సెంటర్‌కు రాకపోవడంతో ఆయన గుండె చెరువైంది. ముదిమి వయసులో ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఆయన వలవలా ఏడ్చేశారు.


అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియా బాట పట్టడంతో నెటిజన్లు చెలించిపోయారు. మీకు మేమున్నామంటూ.. టిఫిన్ సెంటర్ ముందు క్యూకట్టారు. తాత చేతి వంటి రుచి చూసి ఆయన కళ్లల్లో ఆనందం నింపారు. దీంతో ఆయనకు కాలం కలిసొచ్చింది! భవిష్యత్తుపై భరోసా లభించడంతో ఆయన మనసు కుదుట పడింది.  


అయితే.. అచ్చు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న ఓ అట్ల అవ్వ కూడా కస్టమర్ల కోసం ఇప్పటికీ దీనంగా ఎదురుచూస్తోంది. ఎనభై ఏళ్ల వయసున్న ఆ అవ్వ ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కాలేజీ పక్కన ఉన్న ఫుట్‌పై చిన్న టెంట్ వేసుకుని రొట్టే అమ్ముతుంటుంది. అలా వచ్చే కాస్త ఆదాయంతోనే పొట్ట పోసుకుంటుంది. ఎవ్వరినీ వదలని కరోనా ఆమెపై కూడా తన ప్రతాపం చూపించింది. ప్రజల్లో కరోనా భయం వ్యాపించడంతో కస్టమర్లు రావడం తగ్గిపోయింది. దీంతో ఆమె జీవితం మరింత దుర్భరంగా మారింది.  


‘నాకు ఇద్దరు కొడుకులున్నారు. కానీ వారు నా బాగోగులు చూసుకోరు. అందుకే ఇలా ఫుట్‌పాత్‌పై రొట్టెలు అమ్ముకుంటున్నా. ప్రస్తుత మున్న చోటు నుంచి నన్ను ఎవరు ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలీని పరిస్థితి. మరోవైపు.. ఇదివరకటిలా వ్యాపారం నడవట్లేదు అంటూ ఆ వయోభారంతో సతమతమవుతున్న ఆమె తన ఆవేదన వెళ్లబోసుకుంది. వాస్తవానికి ఆమె దీన గాధ కూడా సోషల్ మీడియా బాట పట్టింది. విషయం కూడా బాగానే వైరల్ అయింది. కానీ..కాలం మాత్రం ఇంకా కలసిరాలేదు. ఆమె వ్యాపారం ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో.. సహాయం కోసం ఆమె ఇప్పటికీ ఎదురుచూస్తోంది. 

Updated Date - 2020-10-19T17:39:35+05:30 IST