ఫ్యాకల్టీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ ఎయిమ్స్

ABN , First Publish Date - 2022-01-04T20:23:31+05:30 IST

కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో వింటర్ వెకేషన్‌ను

ఫ్యాకల్టీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ ఎయిమ్స్

న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో వింటర్ వెకేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) ప్రకటించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఫ్యాకల్టీ మెంబర్స్‌ను ఆదేశించింది. అంతకుముందు ఈ నెల 5 నుంచి 10 వరకు వింటర్ వెకేషన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇదిలావుండగా, NTAGIకి చెందిన కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా మంగళవారం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి మూడో ప్రభంజనం వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. అనేక దేశాల్లో కనిపిస్తున్నట్లుగానే మన దేశంలో కూడా గత వారం ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. తాజా కేసుల్లో దాదాపు 50 శాతం వరకు ఒమైక్రాన్ కేసులు మన దేశంలోని ప్రధాన నగరాల్లో కనిపించినట్లు  తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కనిపిస్తున్నాయన్నారు. ప్రధాన మెట్రో నగరాలు, వాటి పరిసర ప్రాంతాల్లో గుర్తించిన కొత్త కేసుల్లో సుమారు 50 శాతం వరకు ఒమైక్రాన్ కేసులేనని చెప్పారు. అయితే ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. దేశంలోని 80 శాతం మందికి పైగా ఈ వైరస్‌ సహజంగా సోకిందని, 90 శాతం మందికి పైగా కోవిడ్ వ్యాక్సిన్ కనీసం ఒక డోసు అయినా తీసుకున్నారని, 65 శాతం మందికి పైగా పూర్తి టీకాకరణ చేయించుకున్నారని తెలిపారు. 


Updated Date - 2022-01-04T20:23:31+05:30 IST