ఆ తొలి కోవిడ్ సెంట‌ర్‌లో జీరోకు చేరిన రోగుల సంఖ్య‌

ABN , First Publish Date - 2020-07-16T11:35:18+05:30 IST

రాజ‌ధాని ఢిల్లీలో ఈ నెలాఖ‌రు నాటికి 5.5 ల‌క్ష‌ల కరోనా బాధితులు ఉంటార‌ని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు రికవరీ రేటు...

ఆ తొలి కోవిడ్ సెంట‌ర్‌లో జీరోకు చేరిన రోగుల సంఖ్య‌

న్యూఢిల్లీ: రాజ‌ధాని ఢిల్లీలో ఈ నెలాఖ‌రు నాటికి 5.5 ల‌క్ష‌ల కరోనా బాధితులు ఉంటార‌ని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు రికవరీ రేటు 80 శాతానికి మించి ఉంటోంది. మ‌రోవైపు రాజధానిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. జూన్ ఆరంభంలో ఢిల్లీలోని ఇండోర్ స్టేడియంల‌ను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చాలనే ప్రణాళికపై ప్రభుత్వం చర్చించింది. గత 25 రోజుల్లో ప‌లు హైటెక్ కోవిడ్ కేంద్రాలు ఢిల్లీలో ఏర్పాట‌య్యాయి. ఢిల్లీలో తొలుత షెహనాయ్ బ్యాంకెట్ హాల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చారు. 100 పడకల షెహ‌నాయ్ కోవిడ్ సెంటర్‌లో ఒకేసారి గరిష్టంగా 60 మంది రోగులు చేరారు. అయితే జూలై 15 నాటికి ఒక్క రోగి కూడా ఇక్కడ‌ లేరు. షెహనాయ్ బ్యాంకెట్‌ హాల్ కోవిడ్ కేర్ సెంటర్‌లో రోగుల సంఖ్య సున్నాగా మారిన సంద‌ర్భంగా ఎల్‌ఎన్‌జెపీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న రోగులలో కొంతమంది తూర్పు ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ కోవిడ్ కేర్ సెంటర్‌కు త‌ర‌లివెళ్లార‌న్నారు. వారిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌లిగిన‌ కరోనా రోగులు, చికిత్స పూర్త‌యిన‌వారు క‌రోనా నెగిటివ్ రిపోర్టు కోసం వేచిచేస్తున్నార‌న్నారు. ఈ కోవిడ్ సెంట‌ర్‌ను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రితో అనుసంధానించార‌న్నారు. అవసరమైనప్పుడు ఇక్క‌డికి రోగులను త‌ర‌లిస్తామ‌ని తెలిపారు. ఢిల్లీలో గ‌త రెండు వారాలుగా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింద‌న్నారు. ఇంతకుముందు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి రోజూ 100 నుంచి 110 మంది క‌రోనా బాధితులు వచ్చేవార‌న్నారు.  ఇప్పుడు 50 నుంచి 60 మంది రోగులు మాత్రమే రోజూ వ‌స్తున్నార‌న్నారు. దీనికితోడు క‌రోనా మరణాల రేటు కూడా త‌గ్గింద‌న్నారు. 

Updated Date - 2020-07-16T11:35:18+05:30 IST