బిల్లుల మంజూరులో జాప్యం

ABN , First Publish Date - 2022-05-22T06:49:40+05:30 IST

ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తామని ఎన్నికలలో పోటీ చేసిన వైసీపీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం అందుకు అనుగుణమైన చర్యలు వేగవంతం చేశామంటూ భారీగా ప్రచారం చేసుకుంటోంది.

బిల్లుల మంజూరులో జాప్యం
మధ్యలోనే నిలిచిన సచివాలయ నిర్మాణం

ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సిమెంట్‌ కొరత

పూర్తికాని సచివాలయాలు, ఆర్‌బీకేలు 

మార్కాపురం, మే 21: ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తామని ఎన్నికలలో పోటీ చేసిన వైసీపీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం అందుకు అనుగుణమైన చర్యలు వేగవంతం చేశామంటూ భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయితే ఆచరణలో మాత్రం ప్రభుత్వాధి నేతలు చెప్పిన దానికి విరద్ధంగా జరుగుతోంది. ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం సచివాలయ పరిధిలో ఒక సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లీనిక్‌, పాలకేంద్రాలను నిర్మించ తలపెట్టింది. దాదాపు ఈ తతంగం ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా అవి పూర్తయిన దాఖలాలు లేవు.

77 భవనాలకు రూ.18.45 కోట్లు కేటాయింపు

మార్కాపురం మండలంలోని సచివాలయాలు 20, రైతుభరోసా కేంద్రాలు 20, హెల్త్‌ క్లీనిక్‌కు 17, పాల కేంద్రాలు 20 మంజూరు చేశారు. అందులో ఒక సచివా లయ నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున 20 భవనాలకు రూ.8 కోట్లు, రైతుభరోసా కేంద్రానికి రూ.21.80 లక్షల చొప్పున 20 ఆర్‌బీకేలకు రూ.4.36 కో ట్లు, హెల్త్‌ క్లీనిక్‌కు రూ.17.50లక్షల చొ ప్పున రూ.2.97 కోట్లు, పాల కేంద్రానికి 15.64 లక్షల చొప్పున 20 కేంద్రాలకు 3.12 కోట్ల నిధులు కేటాయించారు. 

నిధుల మంజూరులో జాప్యం

ప్రభుత్వం గ్రామస్థాయిలో ప్రభుత్వ భవనాల నిర్మాణా లకు నిధులు కేటాయించిన్నప్పటికీ అయిన పనులకు నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. దీంతో భవనాల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మార్కాపురం మండలంలో 20 సచివాలయాలకు గాను కేవలం నాయుడుపల్లి పంచాయతీలోని సచివాలయం భవనం మాత్రమే పూర్తయింది. బోడపాడు, నికరంపల్లి పంచాయతీలలో నిర్మాణ పనులు అసలు ప్రారంభం కాలేదు. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఇప్పటికీ, పూర్తయిన పనులకు సంబంధించి సుమారు రూ3.50 కోట్ల మేర బిల్లులను ప్రభుత్వానికి సమర్పించగా రూ.2 కోట్లు మంజూరయ్యాయి. మరో రూ.1.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

రైతు భరోసా కేంద్రాలకు

రైతుభరోసా కేంద్రాల పరిస్థితి కూడా సచివాలయాల పరిస్థితి మాదిరిగానే ఉంది. బోడపాడు, చింతగుంట్ల, గోగులదిన్నె, నికరంపల్లి, రాయవరం-2, వేములకోట-1, వేములకోట-2 పంచాయతీలలో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన చోట్ల నిధుల మంజూరులో జాప్యంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటికీ, పూర్తయిన పనులకు సంబంధించి సుమారు రూ.1.50 కోట్ల మేర బిల్లులను ప్రభుత్వానికి సమర్పించగా రూ.25 లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. మరో రూ.1.25 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

హెల్త్‌ క్లీనిక్‌లు : మండలంలోని భూపతిపల్లి, బోడపాడు, చింతగుంట్ల, నాయుడుపల్లి, నికరంపల్లి, రామచంద్రా పురం, రాయవరం-2 పంచాయతీలలో హెల్త్‌ క్లీనిక్‌లు ప్రారంభం కాలేదు. బోడపాడులో స్థల సమస్య కారణంగా పనులు ప్రారంభం కాలేదు. నికరంపల్లిలో గ్రామానికి 1.3 కిలో మీటర్ల దూరంలో నిర్మించాలని నిర్ణయించడంతో ప్రజలు తిరస్కరించారు. మిగిలిన చోట్ల నిధుల మంజూరు లేని కారణంగా పనులు నిలిచిపోయాయి. ఇప్పటికీ, సుమారు రూ.50 లక్షల మేర పనులు జరగ్గా ఒక్క రూపాయికూడా విడుదల కాలేదు.

పాలకేంద్రాలు : మండలంలో మంజూరైన 20 పాల కేంద్రాలలో మాల్యవంతునిపాడు, వేములకోట-2 మినహా ఏ ఒక్క పంచాయతీలోనూ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికి సుమారు రూ.15 లక్షల మేర పనులు జరగ్గా ఒక్క రూపాయికూడా విడుదల కాలేదు.

ముందుకు రాని కాంట్రాక్టర్లు

గతంలో ప్రభుత్వ పనులను పూర్తి చేసిన కాంట్రా క్టర్లకు బిల్లుల మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం పనులను చేయడానికి ఏ కాంట్రాక్టర్‌ ముందుకు రావడం లేదు. సచివాలయాలు, ఆర్‌బీకే, హెల్త్‌ క్లినిక్‌లు, పాల కేంద్రాలు అధికార పార్టీ నాయకులకు నామినేషన్‌ ప్రాతిపదికన పనులు కేటాయించినప్పటికీ బిల్లులు రావన్న భయంతో పనులను మధ్యలోనే నిలిపివేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను బస్తా రూ.235లకు ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. అయితే జూన్‌ నెల నుంచి కాంట్రాక్టర్లకు సిమెంట్‌ సరఫరా నిలిచిపోయింది. అధికారులు సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి మాకు పాత బకాయిలు రావాల్సి ఉంది, అవి వస్తేనే సరఫరా చేస్తామన్న సమాధానం వస్తుంది.


Updated Date - 2022-05-22T06:49:40+05:30 IST