లారీలు రావు.. వడ్లు మిల్లుకు పోవు!

ABN , First Publish Date - 2021-05-17T05:50:25+05:30 IST

దళారుల ప్రమేయం లేకుండా మద్దతుధర పొందడానికి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలిస్తున్న రైతులకు నిరాశ తప్పడంలేదు. కొనుగోలుకేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మూటలుగానే మారాయి. నర్సాపూర్‌ డివిజన్‌లోని నర్సాపూర్‌, కౌడిపల్లి, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, చిల్‌పచెడ్‌ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెలరోజులవుతున్నా ఇప్పటి వరకు పండిన పంటలో సగం కూడా తూకం వేయలేదు.

లారీలు రావు.. వడ్లు మిల్లుకు పోవు!
లారీలు రాకపోవడంతో నర్సాపూర్‌ మార్కెట్‌ యార్డులో నిల్వఉన్న ధాన్యం బస్తాలు

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న నిల్వలు 

కొత్తగా వచ్చే ధాన్యం తూకం వేయడంలో జాప్యం 

సెంటర్ల వద్ద రైతుల ఎదురుచూపులు 


నర్సాపూర్‌, మే 16: దళారుల ప్రమేయం లేకుండా మద్దతుధర పొందడానికి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలిస్తున్న రైతులకు నిరాశ తప్పడంలేదు. కొనుగోలుకేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు  నీటి మూటలుగానే మారాయి. నర్సాపూర్‌ డివిజన్‌లోని నర్సాపూర్‌, కౌడిపల్లి, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, చిల్‌పచెడ్‌ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెలరోజులవుతున్నా ఇప్పటి వరకు పండిన పంటలో సగం కూడా తూకం వేయలేదు. ఇప్పటికే 60 శాతంపైగా ధాన్యం కేంద్రాలకు చేరినా కేంద్రాలను నిర్వహించే ఐకేపీ, పీఏసీఎస్‌ సిబ్బంది తూకం వేయడంలేదు. 


మిల్లులకు పంపడంలో జాప్యం

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాల్సిన బాధ్యత నిర్వాహకులు, అధికారులపై ఉంది. కానీ అవసరానికి తగినట్టు లారీలను సమకూర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో డివిజన్‌ పరిధిలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పెద్దఎత్తున పేరుకుపోయింది. లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. వారం రోజులుగా నర్సాపూర్‌ డివిజన్‌లో ఎక్కడో ఒకచోట వర్షం వస్తుండటంతో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిచిపోతున్నది. లారీల కొరతపై రైతులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. 


నర్సాపూర్‌లోనే 6వేల బస్తాలు..

డివిజన్‌ కేంద్రమైన నర్సాపూర్‌ పట్టణంలోని మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రంలో తూకంవేసి మిల్లులకు తరలించాల్సిన ధాన్యం 6వేల బస్తాల వరకు పేరుకుపోయింది. నర్సాపూర్‌ మార్కెట్‌యార్డులో కేంద్రం ప్రారంభమై నెలరోజులవుతున్నా ఇప్పటివరకు పది లారీలు కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించడానికి ఇప్పటికిప్పుడు పదిలారీలు కావాల్సివస్తుంది. తూకంవేయని ధాన్యం ఇంకా పెద్ద ఎత్తున యార్డులో రైతులు తూకం ఎప్పుడు వేస్తారా అని వేచిచూస్తున్నారు. ఓ వైపు వర్షం...మరోవైపు సకాలంలో తూకం జరగకా రైతులు పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎవరూ పట్టిపట్టనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల కష్టాలు గుర్తించి సకాలంలో లారీలు సమకూర్చి వారి ఇబ్బందులు తొలగిస్తారి ఆశిద్దాం. 

Updated Date - 2021-05-17T05:50:25+05:30 IST