‘ఉపాధి’ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

ABN , First Publish Date - 2022-05-21T05:58:34+05:30 IST

గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది.

‘ఉపాధి’ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

- రూ.12కోట్ల విలువైన సిమెంట్‌ రోడ్ల పనులు పూర్తి

- బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

- ఆందోళనలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ఆఘమేఘాల మీద సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి పనులు చేసిన వారికి ఒక్క రూపాయి చెల్లించలేదు. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెలాఖరులోపే పనులు చేసినప్పటికీ ఇంకా బిల్లులు విడుదల కాకపోవడంతో చెల్లింపులు అవుతాయా, కాదా అని కలవర పడుతున్నారు. మార్చి నెలాఖరులోపు పనులు చేయకుంటే నిధులు వాపస్‌ వెళుతాయని భావించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అప్పులు తీసుకవచ్చి పనులు పూర్తిచేశారు. ఇప్పుడు బిల్లుల కోసం పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

జిల్లాలో 413 పనుల గుర్తింపు..

జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి చేపట్టిన గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల ద్వారా జనరేట్‌ అయ్యే 40శాతం మెటీరియల్‌ కంపోనెంట్‌ పనుల కింద సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. ప్రతి ఏటా ప్రభుత్వం మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులను మార్చి మొదటి వారంలోనే మంజూరుచేసి నెలాఖరు వరకు పూర్తిచేసి ఆ పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను సమర్పించాలని నిబంధన విధిస్తున్నారు. ఆ గడువులోపు ఉపాధిహామీ పథకం వెబ్‌సైట్‌లో ఎఫ్‌టీఓలు జనరేట్‌ చేస్తేనే బిల్లులు వస్తాయని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 కోట్ల 90 లక్షల రూపాయల విలువైన 413 పనులను గుర్తించారు. ఇందులో 37.240 కిలోమీటర్ల దూరంగల 15 కోట్ల 71 లక్షల 20 వేల రూపాయల విలువైన 333 సిమెంట్‌ రోడ్ల పనులను చేపట్టారు. 259 రోడ్ల పనులు పూర్తికాగా, 74 పనులు ప్రగతిలో ఉన్నాయి. సుల్తానాబాద్‌ మండలంలో 38, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 43, ఎలిగేడు మండలంలో 12, పెద్దపల్లి మండలంలో 50, జూలపల్లి మండలంలో 21, మంథని మండలంలో 14, ముత్తారం మండలంలో 24, రామగిరి మండలంలో 7, ధర్మారం మండలంలో 13, పాలకుర్తి మండలంలో 13, ఓదెల మండలంలో 17, కమాన్‌పూర్‌ మండలంలో 8, అంతర్గాం మండలంలో ఒక పని పూర్తయ్యింది. గడువులోపు పూర్తయిన పనులకు సంబంధించి 11 కోట్ల 75 లక్షల 20 వేల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉన్నది. వాస్తవానికి జిల్లాలో చేపట్టిన పనుల్లో జనరేట్‌ అయిన మెటీరియల్‌ కంపోనెంట్‌కు మించి ఉన్నాయి. మెటీరియల్‌ కంపోనెంట్‌ జనరేట్‌ అయిన వాటికి బిల్లులు రాకపోవడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతిప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు.

బిల్లుల కోసం ఎదురుచూపులు..

ప్రతి ఏటా ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టే మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులకు మార్చి నెలలోనే మంజూరు ఇచ్చి పూర్తిచేయాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజాప్రతిప్రతినిధులు పనులను గుర్తించి ఇంజినీరింగ్‌ అధికారులతో అంచనాలు రూపొందించి మంజూరైన తర్వాత పనులు చేస్తున్నారు. పనులు పూర్తిచేసేందుకు కనీసం రెండు మాసాలు కూడా గడువు ఇవ్వకపోవడంతో అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, మురికి కాలువల పనులనే చేపడుతున్నారు. అప్పులు చేసి ఆ పనికి కావాల్సిన సిమెంట్‌, ఇసుక, కంకర, ఐరన్‌ ఒకేసారి తీసుకవచ్చి వారం, పది రోజుల్లో పనులను పూర్తిచేస్తున్నారు. గడువులోపు పని పూర్తిచేయకుంటే ఆ పనికి బిల్లులు రావాలంటే ఏడాది పాటు వేచిచూడాల్సిందే. ఆఘమేఘాల మీద పనులను పూర్తిచేసినా కూడా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. 5 లక్షల రూపాయల వరకు చేపట్టే పనులను నేరుగా పంచాయతీ తీర్మానాలు చేసుకుని చేపట్టాల్సి ఉంటుంది. అంతకు మించితే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అంతకుమించి వ్యయమయ్యే పనులు ఉంటే రెండు బిట్లుగా విభజించి నామినేషన్‌ పద్ధతిన పనులు చేపడుతుంటారు. సుమారు 15 కోట్ల విలువైన పనులన్నింటినీ నామినేషన్‌ పద్ధతిలోనే చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన సిమెంట్‌ రోడ్లు, మురికి కాలువల బిల్లులను సత్వరమే చెల్లించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-21T05:58:34+05:30 IST