బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

ABN , First Publish Date - 2022-08-19T05:40:15+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇక వండించి వడ్డించడం తమ వల్ల కాదంటూ మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఏడు నెలలుగా గౌరవవేతనం, బిల్లులు ఇవ్వడం లేదని అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెడితే తమ కడుపులు మాడ్చుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన చెందుతున్నారు.

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
బీబీపేటలో మధ్యాహ్న భోజన బిల్లుల కోసం రోడ్డెక్కిన నిర్వాహకులు

- అప్పులు తెచ్చి వండిపెట్టాల్సి వస్తుందంటున్న మధ్యాహ్న భోజన కార్మికులు

- నెలలుగా రాని బిల్లులు, వేతనాలు

- పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి

- పాఠశాలల్లోని విద్యార్థులకు సరైన స్థాయిలో అందని పోషకాహారం


కామారెడ్డి, ఆగస్టు 18: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇక వండించి వడ్డించడం తమ వల్ల కాదంటూ మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఏడు నెలలుగా గౌరవవేతనం, బిల్లులు ఇవ్వడం లేదని అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెడితే తమ కడుపులు మాడ్చుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన చెందుతున్నారు. బిల్లులు అడిగినప్పుడల్లా ట్రెజరీలో పెండింగ్‌ అనో ప్రభుత్వం నుంచి రావట్లేదనో అధికారులు చెబుతుండడంతో విసిగిపోయి రోడ్డెక్కాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. మరికొన్నిచోట్ల మధ్యాహ్నభోజన నిర్వహణను సైతం కార్మికులు వదిలేయడంతో మూడు, నాలుగు పాఠశాలలను ఒక్కరే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పోని వీరికైనా సరైన సమయంలో బిల్లులు అందుతున్నాయా అంటే అదీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో డబ్బులు లేక ఉన్నదాంతో సరిపెడుతుండడంతో విద్యార్థులకు సరైన పోషకాహార ం సైతం అందడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బిల్లుల కోసం నిరీక్షణ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం సివిల్‌ సప్లయ్‌ శాఖ ద్వారా ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తోంది. మిగిలిన పప్పు, ఆకు కూరలు, కోడిగుడ్లు మొదలైన ఖర్చులు నిర్వాహకులే పెట్టుకోవాలి. ఆ తర్వాత బిల్లులు ప్రభుత్వం నుంచి అందుతాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పని దినాల్లో మధ్యాహ్నభోజనం పెట్టాలి. ఇందుకోసం 1 నుంచి 5వ తరగతి వరకు వంట చార్జీల కింద ప్రతీ విద్యార్థికి రూ.4.97 పైసలు, 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రూ.7.45 చొప్పున చెల్లిస్తారు. విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు పెట్టాల్సి ఉంటుంది. 1 నుంచి 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం, 9,10 తరగతులకు రాష్ట్రప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అయితే కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న మధ్యాహ్న భోజన కార్మికుల్లో కొంతమంది పని వదిలేసి ఇతర పనుల్లో చేరగా మరికొందరు ఈ వృత్తినే నమ్ముకుని అప్పులు తెచ్చి మరీ విద్యార్థులకు వండిపెడుతున్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని వాపోతున్నారు. తమ కష్టం అప్పుల వారికి కట్టేందుకే సరిపోయేలా ఉందని కార్మికులు నిరసనలకు దిగుతున్నారు.

ఇలాగే కొనసాగితే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందని పరిస్థితి

మధ్యాహ్న భోజన బిల్లుల్లో జాప్యం ఇలాగే కొనసాగితే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. కామారెడ్డి పట్టణంలోని పలు పాఠశాలలకు గతంలో బిల్లులు ఆలస్యం కావడంతో శుభకార్యాలకు వంటలు చేసే వ్యక్తితో మాట్లాడి అప్పటి మందం విద్యార్థులకు భోజనాలు అందేలా విద్యాశాఽఖ అధికారులు చర్యలు చేపట్టారు. కానీ అతనికి సైతం నెలల తరబడి బిల్లులు అందకపోవడంతో అధికారుల చుట్టు తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నాడు. ఇక మిగిలిన నిర్వాహకులు సైతం ఇతర ఉపాధి పనులకు పోకుండా కరోనా సమయంలో భారీగా నష్టం చేకూరినా పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఇదే వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు తీసుకువచ్చి వంటలు చేస్తూ పిల్లల కడుపులు నింపుతే తమ కడుపులు ఎండే పరిస్థితులు వచ్చేట్లు ఉన్నాయంటూ ఈ పని మానుకుంటేనే నయం అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందే పరిస్థితులు కనపడడం లేదని తెలుస్తోంది.

Updated Date - 2022-08-19T05:40:15+05:30 IST