ఆలస్యం.. అమృతం.. విషం

ABN , First Publish Date - 2022-05-18T08:16:13+05:30 IST

ఆలస్యం చేస్తే అమృతమైనా విషంగా మారుతుందనేది సామెత. తెలంగాణ రైతన్నల ప్రస్తుత పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది.

ఆలస్యం.. అమృతం.. విషం

  • ధాన్యం కొనుగోలులో జాప్యానికి వాన గండం.. 
  • నత్తనడకన సాగుతున్న ధాన్యం సేకరణ
  • అకాల వర్షాలు, ‘నైరుతి’ ప్రకటనలతో అన్నదాతల్లో ఆందోళన


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆలస్యం చేస్తే అమృతమైనా విషంగా మారుతుందనేది సామెత. తెలంగాణ రైతన్నల ప్రస్తుత పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆలస్యమే ఇందుకు కారణం. ఆలస్యంగానైనా సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు ఆనందాన్ని ఇచ్చినా.. ముంచుకొస్తున్న వర్షాలు వారిలో గుబులు రేపుతున్నాయి. అకాల వర్షాలకు తోడు జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల రాక, తొలకరి వర్షాలు పడే అవకాశంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానలకు ధాన్యం తడిస్తే తమ పరిస్థితేంటి అని భయంగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్రంలో ఈసారి హైడ్రామా నడిచింది. బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని, ముడిబియ్యమే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేయడంతో వరి సాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ప్రారంభంలోనే సూచించింది. దీంతో కేవలం 35.85 లక్షల ఎకరాల్లోనే రైతులు వరి సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 20 లక్షల ఎకరాలు తక్కువ.


కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని, ఒక్క ధాన్యం గింజ కూడా కొనబోమని చెప్పిన సీఎం కేసీఆర్‌.. కేంద్రంపై పోరాటానికి దిగారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నాలు చేయించారు. అనేక పరిణామాల అనంతరం ఏప్రిల్‌ 15 తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు కేబినెట్‌ భేటీలో నిర్ణయించి ప్రకటన చేశారు. 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభం కావాలి. కానీ రెండు వారాలు ఆలస్యంగా నిర్ణయం తీసుకోవటం, ప్రొక్యూర్మెంట్‌ గాడిన పడటానికి మరో వారం రోజులు పట్టడంతో.. మూడు వారాలు వెనకపడినట్లు అయ్యింది. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు(నెల రోజుల వ్యవధిలో) కేవలం 20.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నే సేకరించారు. 


అకాల వర్షాలు.. అరకొర ఏర్పాట్లు!

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటే దాదాపు రెండు నెలల ముందు నుంచే సన్నాహాలు మొదలుపెట్టాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఽకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదనే అతి నమ్మకంతో పౌరసఫరాల సంస్థ, మార్కెటింగ్‌ శాఖ, రాష్ట్ర- జిల్లా యంత్రాంగాలు ఎలాంటి ప్రణాళికలు తయారు చేయలేదు. అరకొర వ సతులతో నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వరద తాకిడికి ధాన్యం కొట్టుకుపోయింది. వడ్లు తడిసి రంగు మారాయి. జూన్‌ ఒకటో తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకితే.. ఆ తర్వాత వారం రోజుల్లో తెలంగాణలోకి వస్తాయని ఐఎండీ ప్రకటించింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.  నైరుతి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు కురిస్తే ధాన్యం పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు.  


సేకరించేది 40-42లక్షల మెట్రిక్‌ టన్నులే?

రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. 40-42 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకే కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పీపీసీలు ఏర్పాటు చేయక ముందు రైస్‌మిల్లర్లు సుమారు 25-30 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అదేక్రమంలో ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా కొందరు వ్యాపారులు రాష్ట్రానికి వచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. ఇలా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యం 10 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. సు మారు 40 లక్షల టన్నుల ధాన్యం ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తే.. 40 లక్షల నుంచి 42 లక్షల టన్నుల వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరేలా లేదు.

Updated Date - 2022-05-18T08:16:13+05:30 IST