ఆలస్యం... అమృతం... విషం!

ABN , First Publish Date - 2020-08-04T05:47:52+05:30 IST

కరోనా పట్ల భయం కలిగి ఉండడం అవసరమే! భయం మనల్ని అప్రమత్తంగా ఉంచుతుంది! అలాగని అంతులేని భయాందోళనలను నింపుకుంటే అనర్ధమే

ఆలస్యం... అమృతం... విషం!

కరోనా పట్ల భయం కలిగి ఉండడం అవసరమే! భయం మనల్ని అప్రమత్తంగా ఉంచుతుంది! అలాగని అంతులేని భయాందోళనలను నింపుకుంటే అనర్ధమే జరుగుతుంది! కాబట్టి అవగాహన ఏర్పరుచుకోవాలి, సత్వరం స్పందించాలి! మరీ ముఖ్యంగా కరోనా సోకిన మొదటి వారం ఎంతో కీలకం! కాబట్టి జ్వరం మొదలైన వెనువెంటనే వైద్యుల సహాయంతో కరోనా చికిత్స ప్రారంభించాలి! అప్పుడే కరోనా కలిగించే ఆరోగ్య నష్టం నుంచి తప్పించుకోగలం. కరోనాకు మొదటివారమే కీలకం. దానిని విస్మరిస్తే... ఆలస్యం అమృతం విషం... 


కరోనా గురించిన వార్తలకు కొదవ లేదు. వీటిలో అవాస్తవికమైనవే ఎక్కువ. స్నేహితులు, ఇరుగుపొరుగు, బంధువులు, అపరిచితులు... ఇలా అందరి నోటా ఇదే చర్చ జరుగుతూ ఉండడంతో పలు రకాల అభిప్రాయాలు మన చెవిన పడుతూ ఉంటాయి. కలగాపులగంగా తయారైన ఆ అంశాలన్నీ బుర్రల్లోకి ఇంకి, మనకున్న కొద్దిపాటి కరోనా జ్ఞానాన్ని కంగాళీ చేసి, మనల్ని అయోమయంలో పడేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితికి తోడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే సందేశాలు, వార్తల్లో వినిపించే మరణాల సంఖ్యలు మరింత భయాందోళనలకు లోను చేస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఈ వైరస్‌ అంత భయంకరమైనదా? దీన్నుంచి తప్పించుకునే మార్గమే లేదా? వైద్యం అందేలోగానే అంతమైపోవలసిందేనా?


మొదటి వారం కీలకం!

కరోనా ఇన్‌ఫెక్షన్‌లో ప్రతి ఒక్కరిలో కనిపించే ప్రధాన లక్షణం జ్వరం. ఈ లక్షణం బయల్పడిందంటే, అప్పటికే మన శరీరంలోకి వైరస్‌ చేరి వారం రోజులైందని గ్రహించాలి. జ్వరం ఉన్న సమయంలో వైరల్‌ లోడ్‌ విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలోనే మన నుంచి ఇతరులకు వైరస్‌ సోకే అవకాశాలూ ఎక్కువే! జ్వరం మొదలైన తర్వాత శరీరం వ్యాధితో పోరాడడం మొదలుపెడుతుంది. దాంతో వ్యాధినిరోధకశక్తితో శరీరం స్పందించే తీరు ఫలితంగా ఎర్లీ పల్మనరీ ఫేజ్‌కు చేరుకుంటాం. ఆ క్రమంలో వైరస్‌ పరిమాణం తగ్గిపోయినా, ఆరోగ్యానికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి వైరస్‌ శరీరంలోకి చేరి, జ్వరం కనిపించిన మొదటి వారంలోనే అప్రమత్తం కావాలి. స్వీయ ఐసొలేషన్‌ చేసుకుని వైద్యుల్ని సంప్రతించాలి.


పొరపాట్లు చేస్తున్నాం!

అడవిలో ఉన్నప్పుడు కుక్క వెంట్రుక కనిపించినా పులి వెంట్రుకగానే భావించి అప్రమత్తం కావాలి. అప్పుడే ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలం. ఇదే సూత్రాన్ని కరోనా విస్తృతంగా ఉన్న ప్రస్తుత సమయంలోనూ అనుసరించాలి. వానాకాలం కాబట్టి జ్వరం మామూలే అనుకుని చేతికి అందిన మాత్ర వేసుకుని ఊరుకోకూడదు. అలాగే కొవిడ్‌ పరీక్ష చేయించుకుని, నిర్ధారణ జరిగిన తర్వాతే చికిత్స మొదలుపెట్టడమూ సరికాదు. కొవిడ్‌ పరీక్ష ఫలితం రావడానికి మూడు రోజుల వ్యవధి పడుతుంది. ఆలోగా రెండవ దశ దాటి, వ్యాధి మరింత ముదిరి ఎర్లీ పల్మనరీ దశకు చేరుకోవచ్చు. కాబట్టి జ్వరం ఏ కారణంగా వచ్చినా, కరోనాతో కూడిన జ్వరంగానే భావించి, వెంటనే వైద్యులను సంప్రతించి కరోనా చికిత్స మొదలుపెట్టాలి.


అందరం చేతులు కలిపి...

కరోనా మీద పోరాటం సమష్ఠిగా సాగాలి. ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడం వైద్యుల బాధ్యతగా ఎలా భావిస్తామో, ఇన్‌ఫెక్షన్‌  సోకకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించాలి. గుంపులుగా కూడే వేడుకలు, సమావేశాలు మానేయాలి. సమూహాలుగా కూడకూడదు. ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలుగుతూ, సమష్ఠిగా పోరాటం చేసినప్పుడే కరోనా మీద విజయం సాధించగలం!


యువతలో కరోనా!

ఇటీవలి కాలంలో యువ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు కారణం కరోనా రక్షణ చర్యలను పాటించకుండా విచక్షణారహితంగా వ్యవహరించడమే! స్నేహితులతో కలిసి తిరగడం, ఆ సమయంలో మాస్క్‌ ధరించకపోవడం వల్ల యువత ఎక్కువగా కరోనాకు గురవుతోంది. యువ వయస్కుల్లో వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది కాబట్టి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే వీరి వల్ల ఇతరులు, కుటుంబసభ్యులకు కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యువత విచక్షణతో వ్యవహరించడం అవసరం.


లక్షణాలు లేని కరోనా!

జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా లక్షణాలు కనిపించని వారిలో ఆ వైరస్‌ బలహీనమైన రకానికి చెందినదిగా భావించాలి. లేదా సోకిన వ్యక్తి వ్యాధినిరోధకశక్తి సమర్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల నుంచి ఇతరులకు కరోనా సోకడం కొంత కష్టం. సోకినా అది బలహీనమైనదే కాబట్టి ఆరోగ్యాన్ని తీవ్రంగా కుంగదీయకపోవచ్చు.


శాశ్వత నష్టం!

ఎర్లీ పల్మనరీ ఫేజ్‌కు చేరుకున్న తర్వాత చికిత్సతో కరోనా నుంచి బయటపడినా, ఊపిరితిత్తులకు శాశ్వత నష్టం జరిగే వీలుంది. ఊపిరితిత్తులు సహజసిద్ధమైన మెత్తని స్వభావాన్ని కోల్పోయి గట్టిపడి, కుంచించుకుపోతాయి. ఇలా ఫైబ్రోసిస్‌, పల్మనరీ ఎంబాలిజం (ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు) లాంటి సమస్యలూ తలెత్తవచ్చు. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌ ప్రారంభంలోనే మేల్కొని, చికిత్స మొదలుపెట్టాలి.


దాడి దశలవారీగా...

‘ఆస్పత్రికి చేరుకున్న కొద్ది సేపట్లోనే ప్రాణాలొదిలాడు, ఊపిరి ఆడని స్థితిలో ఆస్పత్రికి తీసుకువెళ్తే వైద్యులు బతికించలేకపోయారు’ లాంటి వార్తలు వింటున్నాం! ఈ మరణాల్లో పెద్దలతో పాటు మధ్యవయస్కులూ ఉంటూ ఉండడంతో కరోనాకు చిన్నా పెద్దా తారతమ్యం లేదని అర్థం చేసుకుంటున్నాం. అయితే ఇన్‌ఫెక్షన్‌ అంత తీవ్రం అయ్యేవరకూ ఆ బాధితులు ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదు? జ్వరం లాంటి కరోనా తొలి లక్షణం కనిపించినప్పుడు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అనే కోణంలో ఆలోచిస్తున్నామా? నిజానికి కరోనా వైరస్‌ దశలవారీగా ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది. ఆ దశలు ఏవంటే....


ఇంక్యుబేషన్‌ పీరియడ్‌: ఇది తొలి దశ. ఈ దశలో వైరస్‌ శరీరంలోకి చేరినా లక్షణాలు బయల్పడవు. 


సింప్టమాటిక్‌ పీరియడ్‌: వైరస్‌ శరీరంలోకి చేరిన ఐదు నుంచి ఏడవ రోజు వరకూ రెండవ దశగా భావించాలి. ఈ దశలో జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాసన, రుచి తెలియకపోవడం... ఇలా కరోనా లక్షణాలు మొదలవుతాయి. అందర్లో ఈ లక్షణాలన్నీ ఉండకపోవచ్చు. కొందరిలో వేర్వేరు లక్షణాలు రెండు కలిసి ఉండవచ్చు. లక్షణాలు కనిపించిన తర్వాత ఆరు నుంచి ఏడు రోజులు ఎంతో కీలకం. ఈ దశలో చికిత్స సత్వరం మొదలవ్వాలి.


ఎర్లీ పల్మనరీ ఫేజ్‌: మూడు రోజుల పాటు కొనసాగే ఈ దశ ప్రమాదకరం. లక్షణాలు కనిపించిన ఏడవ రోజు నుంచి రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గడం మొదలవుతుంది. పల్స్‌ ఆక్సీమీటరుతో ఈ స్థితిని పరీక్షించుకోవాలి. ఈ దశను తప్పించుకోవాలంటే రెండవ దశలోనే చికిత్స ప్రారంభించాలి. పల్స్‌ ఆక్సీమీటరులో రీడింగ్‌ 94ు - 86ు కంటే తగ్గితే అలర్ట్‌ కావాలి. లేదంటే లేట్‌ పల్మనరీ ఫేజ్‌కు చేరుకుంటారు.


లేట్‌ పల్మనరీ ఫేజ్‌: ఈ దశలో ఆయాసం ఉంటుంది. ఊపిరి ఆడని స్థితి ఉంటుంది. ఈ దశలో చికిత్స క్లిష్టమైనా కోలుకునే అవకాశాలు లేకపోలేదు. ఎక్కువ శాతం బాఽధితులు ఈ దశకు చేరుకున్న తర్వాతే ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దాంతో చికిత్స కొంత క్లిష్టమవుతోంది.


- డాక్టర్‌ విరించి విరివింటి

క్లినికల్‌ కార్డియాక్‌ ఫిజీషియన్‌





Updated Date - 2020-08-04T05:47:52+05:30 IST