డిగ్రీకి తగ్గిన ఆప్షన్‌

ABN , First Publish Date - 2021-10-17T06:26:31+05:30 IST

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టిన వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియకు విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించకపోవడంతో యాజమాన్యాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

డిగ్రీకి తగ్గిన ఆప్షన్‌

నేటితో ముగియనున్న వెబ్‌ ఆప్షన్‌ గడువు

గత ఏడాదితో పోలిస్తే విద్యార్థుల సంఖ్య

భారీగా తగ్గేలా ఉందంటున్న యాజమాన్యాలు

ఇంజనీరింగ్‌ కంటే ముందు అడ్మిషన్లు నిర్వహించడం, 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలో పెట్టడం కారణం

కళాశాలల నిర్వాహకుల్లో ఆందోళన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టిన వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియకు విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించకపోవడంతో  యాజమాన్యాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2021-22 విద్యా సంవ త్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఈ నెల ఎనిమిది నుంచి 17వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్స్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వెబ్‌ ఆప్షన్‌కు గడువు ఆదివారంతో ముగియనున్నది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. నగర పరిధిలోని ఎంవీపీ కాలనీలో గల ఓ కళాశాలకు గత ఏడాది మొదటి ఫేజ్‌ గడువు పూర్తయ్యేసరికి 70 శాతం మంది ఆప్షన్‌ ఇవ్వగా, ఈ ఏడాది 40 శాతం కూడా దాటలేదని చెబుతున్నారు. అదేవిధంగా అనకాపల్లి ప్రాంతంలోని ఓ కాలేజీకి గత ఏడాది 65 శాతం మంది వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకుంటే...ఈ ఏడాది 35 శాతానికి మించలేదని అంటున్నారు. తమ కళాశాలలో చేరేందుకు వచ్చే విద్యార్థులు...ఆప్షన్‌ పెట్టుకునేలా యాజ మాన్యాలు ఏర్పాట్లు చేశాయి. ఈ క్రమంలోనే వెబ్‌ ఆప్షన్స్‌పై ఒక అంచనాకు వస్తున్నాయి. ద్వారకానగర్‌ కాంప్లెక్స్‌కు దగ్గరలోని ఓ డిగ్రీ కాలేజీని గత ఏడాది మొదటి దశ వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియలో 250 మంది ఎంపిక చేసుకున్నారు. వీరిలో 210 మందితో సదరు కాలేజీ యాజమాన్యమే ఆప్షన్‌ పెట్టించగా, మరో 40 మంది వ్యక్తిగత ఆసక్తితో పెట్టుకున్నారు. ఈ ఏడాది కాలేజీ యాజమాన్యం ద్వారా 120 మంది మాత్రమే వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకోగా, ఎంక్వయిరీ కోసం వచ్చిన విద్యార్థుల సంఖ్య 150 దాటలేదని  చెబుతున్నారు. గ్రామీణ జిల్లాలోని అనేక డిగ్రీ కళాశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

కారణాలు ఎన్నో..

గత ఏడాదితో పోలిస్తే వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నట్టు కళాశాలల యజమానులు చెబు తున్నారు. ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకుండా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించడం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అలాగే  రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా తీసుకువచ్చిన 70ః30 (మేనేజ్‌మెంట్‌ కోటా) శాతం విధానం కూడా వెబ్‌ ఆప్షన్స్‌పై ప్రభావం చూపినట్టు చెబుతున్నారు. ఆ 30 శాతం సీట్లకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందించే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. దీంతో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించడం కష్టమనే భావనతో ఎంతోమంది...డిగ్రీ వైౖపు మొగ్గు చూపడం లేదంటున్నారు. 

30 శాతం సీట్ల భర్తీపై ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి తీసుకువచ్చిన మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీపై కాలేజీ యాజమాన్యాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కళాశాలలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించి...ఫీజులను నిర్ణయించింది. ఆయా కాలేజీ వున్న కేటగిరీని బట్టి మూడు రెట్లు ఫీజు వసూలు చేస్తారు. ఉదాహరణకు ఎంవీపీ కాలనీలోని ఓ డిగ్రీ కాలేజీలో బీఎస్సీకి రూ.16,000, బీకామ్‌కు రూ.12,500, బీబీఏకు రూ.18,500, బీసీఏకు రూ.18,000 చొప్పున ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. మేనేజ్‌మెంట్‌ సీట్ల ఫీజు మూడింతలు ఉంటుంది. అంత మొత్తాన్ని చెల్లించేందుకు విద్యార్థులు ముందుకు రాకపోవచ్చు నని కాలేజీ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.  అదేవిధంగా రెండో కేటగిరీలో వున్న గ్రామీణ జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీ లో బీఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌కు రూ.14,000, బీఎస్సీ కెమిస్ర్టీకి రూ.13,000, బీకామ్‌కు రూ.11,000 చొప్పున ఫీజుగా నిర్ణయించారు. వీటికి మూడు రెట్లు అదనంగా ఫీజు చెల్లించడానికి విద్యార్థులు ఎవరూ ఇష్టపడడం లేదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2021-10-17T06:26:31+05:30 IST