Abn logo
Mar 6 2021 @ 00:32AM

దిగజారిన హక్కులు

ఇంట్లోఈగలమోత, బయట పల్లకీమోత అన్న సామెత అందరికీ తెలుసు. బయట ఈగలమోత మొదలై, ఇంట్లో పల్లకీమోత కొనసాగుతున్నా కష్టమే. ఇంటా బయటా ఒకే రకమైన పరిగణన లభిస్తేనే, ఆ వ్యక్తికో, సంస్థకో, దేశానికో నిజమైన గౌరవం. దేశంలో ప్రజలు స్వేచ్ఛ లేక, కనీస వసతులు లేక అలో లక్ష్మణా అంటూ ఉంటే, బయట ప్రపంచంలో గొప్ప గొప్ప బిరుదులతో పిలుస్తుంటే, కడుపు మండుతుంది. అట్లాగే, దేశంలో బ్రహ్మరథం పడుతున్న ప్రభుత్వానికి లేదా వ్యక్తికి బయట ఠికానా లేకపోతే కూడా బాధ కలుగుతుంది. ఇందిరాగాంధీ కాలంలో కూడా ఇటువంటి పరిస్థితే ఉండేది. ఆమె అమెరికా మీద గర్జించేవారు.


హిందూమహాసముద్రాన్ని శాంతిమండలం చేయాలనేవారు. దక్షిణాఫ్రికా విముక్తిపోరాటాన్ని సమర్థించేవారు. దేశదేశాల్లో ప్రజాస్వామ్యపోరాటాలకు మద్దతు ఇచ్చేవారు. దేశంలో మాత్రం నియంతగా ఉండేవారు. అత్యవసర పరిస్థితి విధించారు. పాత్రికేయుల దగ్గరినుంచి ప్రతిపక్ష నాయకుల దాకా దీర్ఘకాలం నిర్బంధించారు. మొన్నమొన్నటి దాకా నరేంద్రమోదీ ప్రభుత్వానికి కూడా అదే విధమైన పరిస్థితి ఉండేది. దేశంలోనేమో అసమ్మతి మీద అణచివేత, మైనారిటీలకు లౌకికవాదులకు ఉక్కపోత, బయట మాత్రం ఇంద్రుడు చంద్రుడు తరహాలో ఒకటే పల్లకీమోత. ప్రపంచపర్యటనే ధ్యేయం అన్నట్టుగా ప్రధానమంత్రి పర్యటనలు, వెళ్లినచోటల్లా ఆయనకు ఏవో ప్రశంసలు, కిరీటాలు. ఇటువంటి వ్యవహారాల్లో ప్రజాసంబంధాల చాకచక్యం కూడా పనిచేస్తుంది. అమెరికా లోనూ, యూరప్ లోనూ కూడా మితవాద పక్షాల విజృంభణ ఉన్న కాలంలో, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ బయటి దేశమూ మాట్లాడేది కాదు. ఇప్పుడు, అమెరికాలో అధికారమార్పిడి జరిగింది. యూరప్ లోనూ కొత్త గాలులు వీస్తున్నాయి.


అంతర్జాతీయ వేదికల మీద భారతప్రభ తగ్గుముఖం పట్టే సమయం ఆసన్నమయింది. ఇది భారతీయులు సంతోషించే పరిణామం కాదు. ఈ దేశంలో అప్రజాస్వామ్య ధోరణుల్ని, అణచివేతలను ప్రశ్నించే, ఎదిరించే అవకాశం దేశీయ పక్షాలకు, ఉద్యమకార్యకర్తలకు తగినంతగా ఉంటే, బయటివారి జోక్యం మీద ఆసక్తి కలిగేది కాదు. కానీ ప్రజల హక్కుల కోసం పనిచేస్తూ వస్తున్న మేధావుల మీద, రచయితల మీద, కార్యకర్తల మీద ఊపిరాడని నిర్బంధం ఒకవైపు, సామాజిక చైతన్యం అలవరచుకుంటూ నూతన పద్ధతులలో రాజకీయ భావాల ప్రకటన చేయాలనుకునే యువకులను భయభ్రాంతులను చేసే దుర్మార్గం మరొకవైపు- ఈ దేశ ప్రజాస్వామ్యానికి చెరుపు చేస్తున్నాయి. ఎవరన్నా, ఇక్కడి మొరలను వింటే బాగుండును అనుకునే పరిస్థితి వాటిల్లింది. 


‘ఫ్రీడం హౌస్’ వారి 2021 నివేదికలో భారత ప్రతిపత్తిని స్వేచ్ఛల దేశం నుంచి పాక్షికంగా మాత్రమే స్వేచ్ఛలున్న దేశంగా మార్చారు. అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు పొందుతూ పనిచేసే ‘ఫ్రీడంహౌస్’ అనే ప్రభుత్వేతర సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ప్రజాస్వామ్యం అమలులో ఉన్న తీరును మదింపు వేస్తుంది. భారతదేశపు ప్రతిపత్తిని తగ్గించడానికి ఆ సంస్థ కారణాలను కూడా వివరించింది. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో పౌరహక్కులు అడుగంటిపోతున్నాయని, ముస్లిములపై దాడులు పెరిగిపోయాయని, అసమ్మతిని అణచివేయడానికి రాజద్రోహ చట్టాలను వినియోగిస్తున్నారని ఆ నివేదిక విమర్శించింది. 211 ప్రపంచదేశాలను మదింపు వేసిన ఈ నివేదికలో భారత్ స్థానం 83 నుంచి 88కి పడిపోయింది. 


భారతదేశంలో పరిస్థితులను, ముఖ్యంగా పశుమాంసం వివాదం, హేతువాదుల లౌకికవాదుల హత్యలు, పౌరసత్వ చట్టం ఉద్యమంపై ప్రభుత్వ వైఖరి, ఢిల్లీ హింసాకాండ, బీమాకోరేగావ్ అభియోగాలు దీర్ఘనిర్బంధాలు మొదలైనవాటిని నిశితంగా గమనించేవారికి ఫ్రీడంహౌస్ నివేదికలోని అంశాలు ఎంతవరకు నిజమో సులువుగానే అర్థమవుతాయి. భారతప్రభుత్వం మాత్రం నివేదికలోని అభియోగాలను తీవ్రంగా ఖండించింది. కానీ, ఆ ఖండనలో బలం కానీ, నైతికత కానీ ధ్వనించలేదు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు విదేశీనిధులను నిలిపివేసినందున, కోపంతో ఇట్లా రేటింగ్‌ను తగ్గించారన్నట్లు ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని మతాలవారికి సమాన పరిగణన ఉన్నదని, అసమ్మతికి అన్నివిధాల ఆస్కారమున్నదని, కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయంటే ప్రజాస్వామ్యం పనిచేస్తున్నట్టేనని- ప్రభుత్వం వాదించింది. 


ఒక స్వచ్ఛంద సంస్థ ఏదో నివేదిక ఇచ్చినంత మాత్రాన భారత ప్రభుత్వానికి వెంటనే వచ్చే నష్టమేమీ లేదు. కానీ, పరిస్థితి మునుపటివలె ఉండబోదన్న హెచ్చరికను ప్రభుత్వం గమనించాలి. దేశంలో నియంతృత్వ పెత్తందారీ విధానాలు అమలుచేస్తే కనుక అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శను ఎదుర్కొనవలసి ఉంటుంది. తీవ్ర జాతీయ భావాల సాయంతో బయటి విమర్శలన్నిటిని శత్రు విమర్శలుగా ప్రచారం చేయవచ్చును కానీ, దాని ద్వారా బలమైన శత్రువులను తయారుచేసుకున్నట్టు అవుతుంది. ఇంత అప్రదిష్ట పాలయ్యే బదులు కాసింత ప్రజాస్వామ్యాన్ని సాధన చేస్తే బాగుంటుంది కదా?

Advertisement
Advertisement
Advertisement