రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-05-25T05:50:46+05:30 IST

రాష్ట్రంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు
మినీ మహానాడులో మాట్లాడుతున్న ముత్తుముల

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల

టీడీపీ ఆద్వర్యంలో బాదుడే బాదుడు

గిద్దలూరు, మే 24 : రాష్ట్రంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. లక్ష్మీ మిల్క్‌ డెయిరీ ఆవరణలో మంగళవారం రాత్రి మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, మైనారిటీ, దళితులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను మరచి చివరకు దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారి కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా చితికిపోయారన్నారు. వారి అభ్యున్నతికి పాటుపడడం మరచి వైసీపీ ప్రభుత్వం పన్నులు, చార్జీల పేరుతో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుల నడ్డి విరిచే విధంగా విద్యుత్‌ చార్జీలు పెంచారని, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారని, నిత్యవసర వస్తువుల ధరలు అదుపులో లేవని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా మళ్లీ ఎన్నుకుంటే తప్పరాష్ట్రానికి భవిష్యత్తు లేదని ఆయన జోష్యం చెప్పారు. ఒంగోలులో జరిగే మహానాడుకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీడీపీ  పట్టణ అధ్యక్షులు సయ్యద్‌ షాన్షావలి, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల టీడీపీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, కె.యోగానంద్‌, బోనేని వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్య, పెద్దమస్తాన్‌, గోపాల్‌రెడ్డి, జీవనేశ్వర్‌రెడ్డి, తదితరులు మాట్లాడారు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

గిద్దలూరు : పట్టణంలోని 16వ వార్డులో టీడీపీ నాయకులు సోమవారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలు, బస్సు చార్జీలు, నిత్యవసర వస్తువులకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి పేదప్రజలపై ఏదో ఒక ఆర్థిక భారం మోపుతూ నడ్డి విరిచిందని టీడీపీ నాయకులు విమర్శించారు. మూడేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. టీడీపీ హయాంలోనే పేదప్రజలకు న్యాయం జరిగిందని, మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణంలో జరిగిన అభివృద్దిని ప్రజలకు గుర్తు చేశారు. కార్యక్రమంలో  టీడీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్‌, మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్‌ అహమ్మద్‌భాషా, టీడీపీ నాయకులు బద్రి భాషా, పందిటి రజనీబాబు, బొజ్జా రంగనాథ్‌, ఉలాపు బాలచెన్నయ్య, పందిళ్లపల్లి శ్రీనివాసులు, ఎం.శ్రీనివాసులు, గర్రె సాయినాథ్‌, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T05:50:46+05:30 IST