చోరీ కేసులో నిందితులు అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-11-26T05:16:00+05:30 IST

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన వారిని విజయనగరం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

చోరీ కేసులో నిందితులు అరెస్ట్‌

విజయనగరం క్రైం: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన వారిని విజయనగరం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.  నిందితుల నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. గురువారం విజయనగరం సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో డీఎస్పీ అనిల్‌కుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. నెల్లిమర్ల మండలం బొప్పడాం గ్రామానికి చెందిన అంబళ్ల వరహాలమ్మ ఈ నెల 19న నెల్లిమర్లకు బజారుకు వచ్చింది. షాపింగ్‌ పూర్తి చేసుకుని మధ్యాహ్నం మూడు గంటలకు తిరుగు ప్రయాణమైంది. ఈ మేరకు రామతీర్థం జంక్షన్‌కు చేరుకుని ఓ ఆటోలో కూర్చొంది. ఇంతలో మరో వ్యక్తి ఆటో ఎక్కి బొప్పడాం వెళ్తున్నట్టు చెప్పాడు.  కాగా సతివాడ గ్రామం దాటిన తరువాత డ్రైవర్‌ ఆటోను మధుపాడ గ్రామం వద్దకు మళ్లించాడు. జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి..  ఆమె  మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును అపహరించి   పరార య్యారు. అదేరోజు సాయంత్రం సదరు మహిళ నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యా దు చేసింది. సీఐ మంగవేణి, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఆటో నెంబరును ట్రేస్‌అవుట్‌ చేశారు. సదరు ఆటోలో విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లికి చెందిన శంబంగి శ్రీను, జామి గ్రామానికి చెందిన జలగడుగుల జానకీబాబులు ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు గురువారం వారిని అదుపులోకి తీసు కుని  విచారించగా నేరం  అంగీకరించారని,  నిందితుల నుంచి బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు.  కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్టు  తెలిపారు. కేసును చాకచక్యంగా  ఛేదించిన సీఐ మంగవేణి, ఎస్‌ఐ రవీంద్రరాజు, పీసీలు సురేష్‌, సూర్య, హెచ్‌జీ మోసా శ్రీనులను అభినందించారు.  

Updated Date - 2021-11-26T05:16:00+05:30 IST