స్వదేశీ ‘రక్షణ’

ABN , First Publish Date - 2020-08-10T07:05:24+05:30 IST

దేశీయ రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 101 రక్షణ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ట్విటర్‌లో ప్రకటించారు...

స్వదేశీ ‘రక్షణ’

  • 101 రక్షణ దిగుమతులపై నిషేధం
  • ఇక నుంచి భారత్‌లోనే వాటి తయారీ
  • దేశీయ ఉత్పత్తికి ఈ నిర్ణయం దన్ను
  • ఏడేళ్లలో రూ.4 లక్షల కోట్ల కాంట్రాక్టులు
  • ఆత్మ నిర్భర్‌ భారత్‌కు ఊతం: రాజ్‌నాథ్‌
  • హడావుడి తప్ప ఇంకేమీ లేదు: కాంగ్రెస్‌
  • తాజా నిర్ణయంతో ప్రైవేటుకు ప్రోత్సాహం


న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశీయ రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 101 రక్షణ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ట్విటర్‌లో ప్రకటించారు. ఈ ఏడాది నుంచి 2024కల్లా వీటి నిషేధాన్ని క్రమంగా అమలుచేయనున్నారు. ఈ నిషేధంతో.. దేశీయ రక్షణ రంగ సంస్థలకు వచ్చే ఏడేళ్లలో సుమారు రూ. 4లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు లభ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. వాటిలో సైన్యం, వాయుసేన అవసరాలకు చెరో రూ. 1.3లక్షల కోట్లు, నౌకాదళ రక్షణావసరాలకు 1.4లక్షల కోట్లను అంచనా వేస్తున్నామన్నారు. ఈ నిర్ణయం ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతమిస్తుందని రాజ్‌నాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


రక్షణ అవసరాలకు భారత్‌ అత్యధికంగా విదేశాలపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. గడచిన ఎనిమిదేళ్లలో అత్యధికంగా రక్షణ పరికరాలు దిగుమతులు చేసుకున్న తొలి మూడు దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. వచ్చే ఐదేళ్లలో సైనికావసరాలకు భారత్‌ రూ. 9.7లక్షల కోట్లను వెచ్చించనుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం దేశీయ ఉత్పత్తికి దన్నుగా నిలుస్తుందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. ‘‘రక్షణ శాఖలో స్వయం సమృద్ధివైపు ఇది మరో పెద్ద అడుగు. భారత రక్షణ రంగానికి కూడా సువర్ణావకాశం. జాబితాలో ఉన్న పరికరాలను భారత సంస్థలు దేశీయంగా అభివృద్ధి చేసి రెండు చేతులా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి’’ అని పేర్కొన్నారు. 2020-21కి గాను రక్షణ రంగ బడ్జెట్‌ను స్వదేశీ, విదేశీ కేటాయింపులుగా విభజించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.52 వేల కోట్ల దేశీయ మూలధన సేకరణ అంచనాతో ప్రత్యేక బడ్జెట్‌ రూపొందించినట్లు వెల్లడించారు. త్రివిధ దళాలు, రక్షణ రంగ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ), రక్షణ రంగ అనుబంధ సంస్థలు, ప్రైవేటు సంస్థలతో చర్చించిన తర్వాతే 101 పరికరాల జాబితాను తయారుచేసినట్లు రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 


దేశీయంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు లబ్ధి

తాజా నిర్ణయం డీఆర్‌డీఓ పాటు ప్రైవేటు సంస్థలకు కూడా లాభించనుంది. రక్షణ రంగ పరికరాల తయారీలో ఇతర అగ్రదేశాలతో పోలిస్తే భారత్‌ కాస్త వెనుకబడే ఉంది. ఇకపై ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలు పాగా వేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. రక్షణ శాఖ విడుదల చేసిన జాబితాలో కొన్ని పరికరాలు స్వదేశీ తయారీవి ఉండటం గమనార్హం. ఉదాహరణకు అస్త్ర-ఎంకే ఐ బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులు దేశీయంగా తయారవుతున్నాయి. జీశాట్‌-7సీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహమూ స్వదేశీ తయారీనే. వీటిని దిగుమతుల జాబితాలో చేర్చడం, ఎందుకు చేర్చారన్నది స్పష్టతనివ్వకపోవడం వలన కొన్ని ఉత్పత్తుల విషయంలో గందరగోళం నెలకొంది. 


ప్రకటనలో హడావుడి తప్ప ఏమీ లేదు: కాంగ్రెస్‌

రాజ్‌నాథ్‌ ప్రకటనలో హడావుడి తప్ప విషయమేమీ లేదంటూ కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ‘ఆత్మ నిర్భర భారత్‌’ ఒక నినాదం మాత్రమేనని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ విమర్శించారు. ‘‘వాదనలకు, వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్‌ నినాదాన్ని ప్రకటిస్తారు.  అది ఎప్పుడు, ఎలా, ఏ విధంగా సాధిస్తారన్నదానిపై నోరు విప్పరు. నినాదాలు చేయడం ఈ ప్రభుత్వానికి చాలా ఇష్టం. రక్షణ మంత్రి ప్రకటన హాస్యాస్పాదంగా ఉంది’ అని సింఘ్వీ విమర్శిం చారు. నిషేధంపై ప్రకటనలు చేసే బదులు, కేవలం తన కార్యదర్శులకు రక్షణ మంత్రి ఆదేశాలు పంపితే సరిపోయేదని కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం విమర్శించారు. ‘రక్షణ దిగుమతుల్ని వాడుకునేది రక్షణ శాఖ మాత్రమే. వాటిపై ఆంక్షలు విధిస్తే రక్షణ శాఖ తనపై ఆంక్షలు విధించుకున్నట్లే. ఇది పూర్తిగా అమలయ్యేందుకు నాలుగేళ్లు పడుతుంది. ఆ తర్వాత దేశంలోనే తయారవుతాయి అంతే ఈ ప్రకటన’’ అని పేర్కొన్నారు. 

2020 డిసెంబరులోపు దిగుమతి నిషేధం

  1. 150ఎంఎం శతఘ్నులు
  2. ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణులు
  3. షిప్‌బోర్న్‌ క్రూయిజ్‌ క్షిపణుల
  4. మల్టీబారెల్‌ రాకెట్‌ లాంచర్‌
  5. షిప్‌బార్న్‌ క్లోజ్‌ ఇన్‌ ఆయుధాలు
  6. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు
  7. బాలిస్టిక్‌ హెల్మెట్లు 
  8. తేలికపాటి యుద్ధ విమానాలు(ఎల్‌సీఏ) 
  9. తేలికపాటి యుద్ధ హెలీకాప్టర్లు
  10. తేలికపాటి రవాణా విమానాలు


2023 డిసెంబరులోపు దిగుమతి నిషేధం

  1. అస్త్ర-ఎంకే ఐ బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులు(బీవీఆర్‌ ఏఏఎం)
  2. కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-7సీ
  3. బేసిక్‌ ట్రెయినర్‌ విమానం(బీటీఏ)
  4. 2024 డిసెంబరులోపు దిగుమతి నిషేధం
  5. చిన్న తరహా జెట్‌ ఇంజన్లు
  6. 2025 డిసెంబరులోపు దిగుమతి నిషేధం
  7. దీర్ఘ శ్రేణి- ల్యాండ్‌ అటాక్‌ క్రూయిజ్‌ క్షిపణులు

Updated Date - 2020-08-10T07:05:24+05:30 IST