ఆఫ్సా పూర్తిగా ఎత్తివేయాలని కోరుతున్న సైన్యం: రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2022-04-23T22:46:15+05:30 IST

సాయుధ బలగాలకు విశేషాధికారాలు కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని ..

ఆఫ్సా పూర్తిగా ఎత్తివేయాలని కోరుతున్న సైన్యం: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: సాయుధ బలగాలకు విశేషాధికారాలు కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని (ఆఫ్సా) ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్ నుంచి పూర్తిగా తొలగించే ఆలోచనలో కేంద్రం ఉందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నారు. ఈశాన్యం, జమ్మూకశ్మీర్ నుంచి అఫ్సాను పూర్తిగా తొలగించాలని రక్షణ బలగాలు కోరుతున్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  శనివారంనాడు తెలిపారు. ఈ వివాదాస్పద చట్టాన్ని ఈశాన్య ప్రాంతాలైన నాగాలాండ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లలో ఇటీవల పాక్షికంగా తొలగించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు 1990లో జమ్మూకశ్మీర్‌లో ఆఫ్సా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 1958 సాయుధ బలగాల (ప్రత్యేక హక్కుల) చట్టం (అఫ్సా) కింద ఏదైనా ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తే అక్కడ ఆఫ్సాను అమలు చేస్తారు.


కాగా, ఇది రాక్షస చట్టమని, దీనిని పూర్తిగా తొలగించాల్సిందేనని ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ నిరసనలు, డిమాండ్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ తాజా ప్రకటనతో ఈశాన్యం, జమ్మూకశ్మీర్‌లో 'ఆఫ్సా' చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

Updated Date - 2022-04-23T22:46:15+05:30 IST