చిత్తశుద్ధి లేని వాదనలు

ABN , First Publish Date - 2020-03-17T06:12:38+05:30 IST

బ్యాంకు రుణాలు భారీగా ఎగవేసిన మొదటి యాభైమంది బడాబాబులెవరో తెలుసుకోవాలని రాహుల్‌గాంధీకి అనిపించింది. ‘భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది...

చిత్తశుద్ధి లేని వాదనలు

బ్యాంకు రుణాలు భారీగా ఎగవేసిన మొదటి యాభైమంది బడాబాబులెవరో తెలుసుకోవాలని రాహుల్‌గాంధీకి అనిపించింది. ‘భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది, బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలిపోతున్నది. మరిన్ని బ్యాంకులు మూతబడే దిశలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకు సొమ్మును కొందరు పెద్దలు దోచుకోవడమే. ప్రధానమంత్రి ఏవేవో హామీలు ఇస్తుంటారు. కానీ, నా ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం రాలేదు’ అని రాహుల్‌ ఆగ్రహించారు. బ్యాంకు రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారి జాబితా బయటపెట్టాలని సోమవారం పార్లమెంటులో ఆయన ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అక్కడ ఉండికూడా సహాయమంత్రి సమాధానం చెప్పినందుకు రాహుల్‌కు మరింత కోపం వచ్చింది. పైగా స్పీకర్‌ ఒకే అనుబంధ ప్రశ్నను అనుమతించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ముగించేసినందుకు ఆవేదన కలిగింది. సభలో గందరగోళం రేగడంతో కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. బ్యాంకుల నిరర్థక ఆస్తుల సమస్య మన నాయకులను ఏమాత్రం బాధించడం లేదనీ, అది వారికి ఓ రాజకీయాస్త్రం మాత్రమేనని సభలో రభస నిదర్శనం.


కాంగ్రెస్‌ తన హయాంలో బ్యాంకులను ముంచేసి, ఇప్పుడు ఎన్డీయేని తప్పుబట్టడానికి సిద్ధపడుతున్నదని ఆర్థికశాఖ సహాయమంత్రి ఆరోపణ. మోదీ ప్రభుత్వం దాదాపు ఐదులక్షలకోట్ల రుణాలను ముక్కుపిండి మరీ వసూలు చేసిందన్నారు ఆయన. యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి తమ ప్రభుత్వం ఎలా కాపాడుకొచ్చిందో వివరిస్తూ, కాంగ్రెస్‌ పాలకులు బ్యాంకులను చిత్తంవచ్చినట్టు వదిలేయడమే కాక, చివరకు వాటితో బలవంతంగా పెయింటింగ్స్‌ కూడా కొనిపించారన్నారు. ప్రియాంకవాద్రా పెయింటింగ్‌ ఒకదానిని యస్‌బ్యాంకు అధినేత రాణాకపూర్‌ భారీ ధరకు కొన్నారన్న ఆరోపణను ఆయన ఇలా పరోక్షంగా ప్రస్తావించడంతో రచ్చరేగడం, చర్చ ముగియడం సహజం. భారీ ఎగవేతదారులు ఎవరో చెప్పాలని ప్రభుత్వానికి నిజంగా ఉండివుంటే ఈ కొంటెమాటలతో అది విపక్షాన్ని రెచ్చగొట్టేది కాదు. తెలుసుకోవాలని ఉండివుంటే రాహుల్‌ ఇలా రెచ్చిపోయి వాకౌట్‌ చేసేవారూ కాదు. ప్రభుత్వ రంగబ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నది. 2020 మార్చినాటికి ఎన్పీఏలు 8శాతానికి తగ్గిపోతాయని క్రిసిల్‌ కూడా లెక్కలు వేస్తున్నది. సంతోషించాల్సిన విషయం ఇది. కానీ, రిజర్వుబ్యాంకునుంచి సమాచారహక్కు ద్వారా సేకరించిన వివరాలు ఓ దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని చెప్పాయి. 2014నుంచి ఇప్పటివరకూ బ్యాంకులు అక్షరాలా ఆరులక్షల అరవైవేల కోట్ల రుణాలను రద్దుచేశాయట. మొండి బాకీలు, నిరర్థక ఆస్తులు ఇత్యాది ఏ పేర్లతో పిలిచినా ఈ వసూలు కాని రుణాల విషయంలో బ్యాంకులు చివరకు చేస్తున్నదల్లా వాటిని ఖాతాపుస్తకాల్లో చెరిపేయడమే. ఈ విధంగా బ్యాంకులు తమ మొత్తం మొండిబాకీల్లో రద్దుచేసి పారేసింది దాదాపు సగభాగం. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే రెండున్నర లక్షల కోట్లవరకూ రద్దయ్యాయి. 2013 మొదలు 2019వరకూ ఈ మొండిబాకీలు విపరీతంగా హెచ్చాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రెండులక్షలకోట్లున్న నిరర్థక ఆస్తులు మొన్నటి ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 12లక్షల కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకులు రద్దు చేసుకుంటున్న మొత్తం కూడా ఇదేకాలంలో పెరుగుతూ, వాటిని మోసం చేసినవారి సంఖ్య కూడా హెచ్చింది.


బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఏటా పెరిగిపోతున్నందున, తదనుగుణమైన స్థాయిలో వాటిని రద్దుచేయడం జరిగిపోతున్నది. తాము తెచ్చిన కొత్తచట్టాలతో రుణాల వసూలు భారీగానే సాగుతున్నదని ప్రభుత్వం చెబుతున్న మాటా నిజమే కావచ్చును కానీ, పెద్దల పాలవుతున్న సొమ్ముతో పోల్చితే బ్యాంకులు తిరిగి రాబట్టుకోగలుగుతున్నది మాత్రం అతిస్వల్పం. నిజాయితీ పరుల పక్షాన నిలబడతామని, ఆశ్రిత పెట్టుబడిదారులతో కఠినంగా ఉంటామని ప్రధాని తరచు చెబుతుంటారు. కానీ, పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకులను ఎంత పీల్చిపిప్పిచేశాయో ఈ డేటా చెబుతున్నది. బ్యాంకింగ్‌ రంగంపై ఆర్బీఐ నియంత్రణ ఏ స్థాయిలో ఉన్నదో యెస్‌ బ్యాంకు నిర్వాకం మనకు తెలియచెబుతున్నది. కూలుతున్న ఈ ప్రైవేటు బ్యాంకును కాపాడటం కోసం ప్రభుత్వరంగ బ్యాంకు రంగంలోకి దిగవలసి వచ్చింది. బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించినంత వరకూ ఏవో తాత్కాలిక ఉపశమనాలే తప్ప రోగనివారణ చర్యలు కనిపించడం లేదు.

Updated Date - 2020-03-17T06:12:38+05:30 IST