Abn logo
Oct 14 2020 @ 03:55AM

చెన్నై మురిసె

Kaakateeya

వరుస పరాజయాలతో విమర్శలెదుర్కొంటున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాటింగ్‌ కష్టంగా మారిన పిచ్‌పై రాయుడు, వాట్సన్‌ నిలకడైన ఆటతో రాణించగా.. చివర్లో ధోనీ, జడేజా మెరుపు ఇన్నింగ్స్‌తో పటిష్ఠ స్కోరును సాధించింది. ఆ తర్వాత చెన్నై బౌలర్ల ధాటికి విలియమ్సన్‌ మినహా సన్‌రైజర్స్‌ జట్టులో ఎవరూ నిలవకపోవడంతో ఐదో ఓటమిని ఖరారు చేసుకుంది.


రాణించిన రాయుడు, వాట్సన్‌

 హైదరాబాద్‌ ఓటమి


దుబాయ్‌: మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో విజయంతో మురిసింది. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ (42), అంబటి రాయుడు (41) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. చివర్లో జడేజా (25 నాటౌ ట్‌), ధోనీ (21) బ్యాట్లు ఝుళిపించారు. సందీ ప్‌, ఖలీల్‌, నటరాజన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్‌ చేసి ఓడింది. కరణ్‌ శర్మ, బ్రావోకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జడేజా నిలిచాడు. 

విలియమ్సన్‌ ఒక్కడే: 168 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ (39 బంతుల్లో 7 ఫోర్లతో 57) మినహా ఎవరూ రాణించలేదు. నాలుగో ఓవర్‌లో ఓపెనర్‌ వార్నర్‌ (9), మనీశ్‌ పాండే (4) వికెట్లను కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. బెయిర్‌స్టో (23) బంతికో పరుగు చొప్పున సాధించినా పదో ఓవర్‌లో అతడిని జడేజా బౌల్డ్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 60/3 మాత్రమే. ఈ దశలో విలియమ్సన్‌ ఒంటరి పోరాటం చేశాడు. కానీ మరోవైపు ప్రియం గార్గ్‌ (16), విజయ్‌ శంకర్‌ (12) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. 17వ ఓవర్‌లో ఓ ఫోర్‌తో విలియమ్సన్‌ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మరుసటి ఓవర్‌లోనే కరణ్‌ శర్మ అతడిని పెవిలియన్‌కు చేర్చగా రషీద్‌ ఖాన్‌ మాత్రం ఆ ఓవర్‌ను 6,4,4 బాది 19 పరుగులతో ముగించాడు. కానీ అతడి ఊపు 19వ ఓవర్‌లో హిట్‌ వికెట్‌గా వెనుదిరగడంతో ముగిసింది. చివరి ఓవర్‌లో 22 పరుగులు రావాల్సి ఉండగా బ్రావో కేవలం ఒకే పరుగిచ్చి నదీమ్‌ (5) వికెట్‌ కూడా తీయడంతో చెన్నై మురిసింది.

ఆదుకున్న రాయుడు, వాట్సన్‌: టాస్‌ గెలవగానే మిగతా జట్లలాగే చెన్నై కూడా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కానీ పేసర్‌ సందీప్‌ శర్మ ఆరంభంలో సమర్థవంతంగా కట్టడి చేశాడు. అయితే చివరికొచ్చేసరికి సీఎ్‌సకే ఈ పిచ్‌పై సవాల్‌ విసిరే స్కోరునే సాధించింది. మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ డుప్లెసిని డకౌట్‌ చేసిన సందీప్‌ ఝలక్‌ ఇచ్చాడు. అయితే తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సామ్‌ కర్రాన్‌ తన పాత్రకు న్యాయం చేస్తూ నాలుగో ఓవర్‌లో 4,4,6,4తో 22 పరుగులు రాబట్టాడు. అయినా మరోసారి సందీప్‌ జట్టుకు అండగా నిలుస్తూ కళ్లు చెదిరే బంతితో సామ్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో పవర్‌ప్లేలో 44 పరుగులకు ఓపెనర్లను కోల్పోయింది. ఈ సమయంలో వాట్సన్‌, రాయుడు క్రీజులో నిలిచారు. కానీ స్పిన్నర్లు నదీమ్‌, రషీద్‌ మాయాజాలం ప్రదర్శించగా 9-11  ఓవర్లలో 13 పరుగులు మాత్రమే వచ్చాయి. 12వ ఓవర్‌లో రాయుడు.. ఆ తర్వాతి ఓవర్‌లో వాట్సన్‌ ఒక్కో సిక్సర్‌తో స్కోరును కదిలించారు. రషీద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లోనూ ఈ జోడీ ఒక్కో సిక్స్‌ బాదడంతో డెత్‌ ఓవర్లలో భారీ స్కోరు ఖాయమే అనిపించింది. కానీ సరైన సమయంలో రైజర్స్‌ పంజా విసిరింది. వరుస ఓవర్లలో వీరిద్దరు పెవిలియన్‌కు చేరడంతో మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 

చివర్లో ఫర్వాలేదు: భారీషాట్లు కనిపించకపోయినా డెత్‌ ఓవర్లలో చెన్నై మెరుగ్గానే ఆడింది. వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లు బాదిన ధోనీ (21) టచ్‌లో ఉన్నట్టు కనిపించింది. 19వ ఓవర్‌లోనూ సూపర్‌ సిక్సర్‌తో మురిపించినా అదే ఓవర్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. ఆఖరి ఓవర్‌లో బ్రావో (0) డకౌటైనా జడేజా (25 నాటౌట్‌) 6,4తో 15 పరుగులు రావడంతో ప్రత్యర్థికి సవాల్‌ విసరగల స్కోరును సాధించింది. చివరి 5 ఓవర్లలో 51 పరుగులు రాబట్టిన చెన్నై 4 వికెట్లను కోల్పోయింది. 


వైడ్‌ ఇచ్చినట్టే ఇచ్చి..

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ పాల్‌ రీఫెల్‌ నిర్ణయం వివాదాస్పదమైంది. ఆ ఓవర్‌ రెండో బంతిని అవుట్‌ స్వింగ్‌ యార్కర్‌గా వేసినా క్రీజు లైన్‌ ఆవలకు వెళ్లడంతో అంపైర్‌ వైడ్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత మరో బంతి కూడా శార్దూల్‌ అదే తరహాలో వేశాడు. ఇది కూడా స్వల్ప తేడాతో లైన్‌కు ఆవలే పడంతో అంపైర్‌ వైడ్‌గా సూచిస్తూ చేతులను సగం పైకి లేపాడో లేదో.. వెంటనే శార్దూల్‌తో పాటు కెప్టెన్‌ ధోనీ ఆగ్రహంతో అభ్యంతరం తెలిపాడు. దీంతో అంపైర్‌ రీఫెల్‌ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి తగ్గాడు. రీప్లేలో అది వైడ్‌గానే తేలడంతో అంపైర్‌ చర్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


స్కోరు బోర్డు

చెన్నై సూపర్‌ కింగ్స్‌: సామ్‌ కర్రాన్‌ (బి) సందీప్‌ శర్మ 31; డుప్లెసి (సి) బెయిర్‌స్టో (బి) సందీప్‌ శర్మ 0; వాట్సన్‌ (సి) మనీశ్‌ (బి) నటరాజన్‌ 42; రాయుడు (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ 41; ధోనీ (సి) విలియమ్సన్‌ (బి) నటరాజన్‌ 21; జడేజా (నాటౌట్‌) 25; బ్రావో (బి) ఖలీల్‌ 0; దీపక్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 167/6; వికెట్ల పతనం: 1-10, 2-35, 3-116, 4-120, 5-152, 6-152; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-19-2; ఖలీల్‌ 4-0-45-2; షాబాజ్‌ నదీమ్‌ 4-0-29-0; నటరాజన్‌ 4-0-41-2; రషీద్‌ 4-0-30-0. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్‌ (సి అండ్‌ బి) కర్రాన్‌ 9; బెయిస్టో (బి) జడేజా 23, మనీష్‌ పాండే (రనౌట్‌/బ్రావో) 4; విలియమ్సన్‌ (సి) ఠాకూర్‌ (బి) కర్ణ్‌ శర్మ 57; ప్రియమ్‌ గార్గ్‌ (సి) జడేజా (బి) కర్ణ్‌ శర్మ 16; విజయ్‌ శంకర్‌ (సి) జడేజా (బి) బ్రావో 12; రషీద్‌ ఖాన్‌ (హిట్‌ వికెట్‌) (బి) ఠాకూర్‌ 14; నదీమ్‌ (సి అండ్‌ బి) బ్రావో 5; సందీప్‌ శర్మ (నాటౌట్‌) 1; నటరాజన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 147/8; వికెట్ల పతనం: 1-23, 2-27, 3-59, 4-99, 5-117, 6-126, 7-146, 8-146; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-28-0; సామ్‌ కర్రాన్‌ 3-0-18-1; జడేజా 3-0-21-1, శార్దూల్‌ ఠాకూర్‌ 2-0-10-1; కర్ణ్‌ శర్మ 4-0-37-2; డ్వేన్‌ బ్రావో 3-0-25-2; పీయూష్‌ చావ్లా 1-0-8-0.

Advertisement
Advertisement
Advertisement