దీపావళికి 16,540 ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2021-10-12T17:26:36+05:30 IST

దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 16,450 బస్సులు నడపాలని రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయించింది. ఈ వివరాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాజకన్నప్పన్‌ సోమవారం మీడియాకు

దీపావళికి 16,540 ప్రత్యేక బస్సులు

                - మంత్రి రాజ కన్నప్పన్‌


ప్యారీస్‌(చెన్నై): దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 16,450 బస్సులు నడపాలని రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయించింది. ఈ వివరాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాజకన్నప్పన్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు. దీపావళి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లివచ్చే వారి కోసం ప్రతి ఏటా రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ఏడాది నవంబరు 4న దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు నవంబరు 1 నుంచి 3వ తేది వరకు చెన్నై నుంచి రోజుకు 2,100 బస్సులు సహా మొత్తం 3,506 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపారు. మూడు రోజులకు కలిపి నగరం నుంచి 9,806 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 6,734 ప్రత్యేక బస్సుల చొప్పున మొత్తం 16,540 బస్సులు నడిపేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పండుగ అనంతరం తిరిగొచ్చే వారి కోసం నవంబరు 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులకు మొత్తం 17,719 బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.


తాత్కాలిక బస్‌స్టేషన్లు

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని చెన్నై నగరంలో తాత్కాలికంగా ఆరు బస్‌స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాధవరం కొత్త బస్టాండ్‌, కేకే నగర్‌ బస్‌స్టేషన్‌, తాంబరం మేప్స్‌ బస్టాండ్‌, తాంబరం రైల్వేస్టేషన్‌ బస్టాండ్‌, పూందమల్లి బస్టాండ్‌, కోయంబేడు బస్‌స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతాలకు ప్రజలు వెళ్లేందుకు వీలుగా చెన్నై మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ తరఫున 24 గంటలు లింక్‌ బస్సుసౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు కోయంబేడు బస్‌ టెర్మినల్‌లో 10 రిజర్వేషన్‌ కౌంటర్లు, తాంబరం మేప్స్‌ బస్టాండ్‌ 2 కౌంటర్లు పనిచేస్తాయని తెలిపారు. పండుగ రోజుల్లో నడిపే బస్సు వివరాలను 9445014450, 9445014436 నెంబర్ల ద్వారా సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 1,500 ఆమ్నీ బస్సులు నడిపేందుకు అనుమతులిచ్చామని, ఈ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని మంత్రి హెచ్చ రించారు. అధిక బస్‌ ఛార్జీలకు సంబంధించిన ఫిర్యాదులను 044-24749002, 1800 425 6151 అనే నెంబర్లలో తెలియజేయవచ్చు.


ఆయుధ పూజ సందర్భంగా...

ఆయుధ పూజను పురస్కరించుకొని నగరం నుంచి మంగళ, బుధ వారాల్లో 800 ప్రత్యేక బస్సులు కోయంబేడు సహా ఆరు తాత్కాలిక బస్‌ స్టేషన్ల నుంచి నడుపనున్నట్లు మంత్రి తెలిపారు. కార్లు, ఇతర వాహనాల్లో సొంతూళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకోకుండా తాంబరం, పెరుంగ ళత్తూర్‌ జాతీయ రహదారుల మీదుగా వెళ్లరాదని, వారు తిరుక్కలికుండ్రం, చెంగల్పట్టు, శ్రీపెరుంబుదూర్‌ మీదుగా  వెళ్లాలని మంత్రి తెలిపారు.


Updated Date - 2021-10-12T17:26:36+05:30 IST