బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఎన్‌సీబీ ముందుకు దీపిక

ABN , First Publish Date - 2020-09-26T17:00:24+05:30 IST

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కోసం ప్రముఖ నటి దీపికా పదుకొనే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో...

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఎన్‌సీబీ ముందుకు దీపిక

ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కోసం ప్రముఖ నటి దీపికా పదుకొనే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముందు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 9:45 సమయంలో ఆమె ముంబైలోని ఎన్‌సీబీ సిట్ కార్యాలయానికి వచ్చారు. దీపికతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్, హీరోయిన్లు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లను కూడా ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్‌సీబీ అధికారులు ఈ ముగ్గురు హీరోయిన్లకు బుధవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఎన్‌సీబీ కార్యాలయం వద్ద ముంబై పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా కరిష్మా ప్రకాశ్‌ను శుక్రవారమే అధికారులు ప్రశ్నించారు. శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా అధికారులు సూచించడంతో ఆమె ఇవాళ మళ్లీ ఎన్‌సీబీ ముందుకు వచ్చారు.


కరిష్మా వాట్సాప్‌లో జరిపిన సంభాషణల్లో ‘డి’ అనే వ్యక్తితో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు ఆధారాలు లభించడంతో.. ఆ వ్యక్తి ఎవరు అనే దిశగా అధికారులు వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాను విచారించిన సందర్భంగా ఈ కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం లభించినట్టు ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి. ‘‘ఈ కేసులో కొందరు నిందితులను విచారిస్తున్న సందర్భంగా పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి..’’ అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా సారా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు తెరమీదికి వచ్చాయని ఆయన తెలిపారు. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై ప్రస్తుతం ఎన్‌సీబీ అధికారులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సహా దాదాపు డజను మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-09-26T17:00:24+05:30 IST