హత్యకేసు ఛేదనకు 'డీప్‌ఫేక్' వీడియో.. పోలీసుల వినూత్న ప్రయోగం

ABN , First Publish Date - 2022-06-02T17:38:03+05:30 IST

2003లో రోటర్‌డామ్‌లో తన స్నేహితులతో...

హత్యకేసు ఛేదనకు 'డీప్‌ఫేక్' వీడియో.. పోలీసుల వినూత్న ప్రయోగం

ఆమ్‌స్టర్‌డామ్: 2003లో రోటర్‌డామ్‌లో తన స్నేహితులతో స్నో బాల్ ఆడుకుంటున్న 13 ఏళ్ల సెడార్ సోరెస్ అనే బాలుడిని తుపాకీతో కాల్చి చంపిన కేసును పరిష్కరించేందుకు డచ్ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. కేసు  పరిష్కారంలో భాగంగా ఆ బాలుడు సజీవంగా ఉన్నట్లుగా కనిపించేలా ఒక వీడియోను రూపొందించారు. దీనికి ఆ బాలుని కుటుంబం అనుమతినిచ్చింది. ఆ బాలుడు ప్రేక్షకులను చూస్తూ వెళ్ళిపోతున్నప్పుడు, అతని సోదరి జానెట్ సహాయం కోసం అర్ధిస్తుంటుంది.. నా సోదరుడిని ఎవరు చంపారో నేను తెలుసుకోవాలి అని కోరుతుంది. పోలీసుశాఖలోని పరిశోధకులు.. ఈ రకమైన పరిశోధన ప్రపంచంలోనే మొదటిదని తెలిపారు. ఈ హత్యను ఎవరు చేశారో చెబితే వారికి 40,000 యూరోల బహుమతిని అందజేస్తామని ప్రకటించారు.


ఈ వీడియోలో మృతుడు సెడార్ 1.32 నిమిషాల పాటు వర్చువల్ లైఫ్‌లో కనిపిస్తాడు. ముదురు నీలి రంగు ట్రాక్‌సూట్ ధరించి  ఫుట్‌బాల్ మైదానంలో ఉంటాడు. ఇది అతనికి ఇష్టమైన క్రీడ ఈ క్రీడలో అతను ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారాలనుకున్నాడు.ఈ వీడియోలో తన సోదరుడు ఎలా చనిపోయాడో జానెట్ వివరిస్తుంది. ఈ హత్య ఎవరు చేశారో తెలుసుకునేందుకు సహకరించాలని కోరుతుంది. ఈ దృశ్యాలు రాత్రిపూట ఫ్లడ్‌లైట్ వెలుగులో స్టేడియంలో కనిపిస్తాయి. ఈ వీడియో డచ్ పోలీసు వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. కాగా పోలీసుల దగ్గర.. ఆ బాలుని మరణానికి కొద్దిసేపటి ముందు పిల్లలు తీసిన ఫోటో మాత్రమే ఉంది. ఈ వీడియో రూపకల్పన కోసం పోలీసులు సెడర్‌ను పోలి ఉండే ఒక బాల నటుడిని పిలిచారు. ఆ బాలుడు ఫుట్‌బాల్ మైదానంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నడిచాడు. ఆ బాలునికి సెడార్ అసలు ముఖం డిజిటల్‌ విధానంలో జోడించారు. 2003 ఫిబ్రవరి 1న రోటర్‌డ్యామ్ మెట్రో స్టేషన్‌లోని కార్ పార్కింగ్ దగ్గర మంచులో ఇతర పిల్లలతో సెడార్ సోర్స్ ఆడుకుంటున్నాడు. వారు ప్రయాణిస్తున్న వాహనాలపై మంచు బంతులు విసిరారు. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఈ కేసులో ఒక మహిళ తాను ఒక వ్యక్తి అక్కడ కాల్పులు జరపడాన్ని  చూశానని తెలిపింది. ఈ నేపధ్యంలో పోలీసులు జెరాల్డ్ హెచ్ అనే వ్యక్తిని అనుమానితునిగా గుర్తించారు. అప్పటికే అతనిపై పలు నేరారోపణలు ఉన్నాయి.


ఈ కేసులో ఇతను జరిపిన కాల్పుల కారణంగానే బాలుడు మృతి చెందాడని న్యాయమూర్తులు నిర్ధారించారు. 2005లో ఈ కేసు ఒక కొలిక్కిరాగా, హత్యకు ఉపయోగించిన ఆయుధం కనుగొనకపోయినప్పటికీ, జెరాల్డ్ హెచ్‌కు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే 2006లో జెరాల్డ్ హెచ్‌ పైకోర్టును ఆశ్రయించి తన అప్పీల్‌ను గెలుచుకున్నాడు. ఈ నేపధ్యంలో పలువురు సాక్షులు తమ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవడంతో జెరాల్డ్ హెచ్‌ విడుదలయ్యాడు. దీంతో కేసు తిరిగి మొదటికి వచ్చింది. అయితే అండర్ వరల్డ్ గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణలో ఈ బాలుడు మృతి చెందివుండవచ్చని పోలీసులు అనుమానించారు. ఈ నేపధ్యంలో కేసు పరిష్కారం కోసం పోలీసులు డీప్ ఫేక్ వీడియో రూపొందించారు. దీని ఆధారంగా ఆ రోజు ఘటనలను చూసినవారెవరైనా కాల్ చేసి తమకు వివరాలు అందిస్తారని పోలీసులు బావించారు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలో సాక్షుల గురించి మేము ఎదురుచూస్తున్నామని పోలీసు విభాగంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టీమ్‌లో డిటెక్టివ్ డాన్ ఎనెగర్న్ తెలిపారు.

Updated Date - 2022-06-02T17:38:03+05:30 IST