దీపామాలిక్‌ రిటైర్మెంట్‌

ABN , First Publish Date - 2020-05-12T10:10:50+05:30 IST

ప్రఖ్యాత పారా అథ్లెట్‌ దీపామాలిక్‌ క్రియాశీల క్రీడలకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఈమేరకు తన నిర్ణయాన్ని ఆమె సోమవారం వెల్లడించింది...

దీపామాలిక్‌ రిటైర్మెంట్‌

న్యూఢిల్లీ: ప్రఖ్యాత పారా అథ్లెట్‌ దీపామాలిక్‌ క్రియాశీల క్రీడలకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఈమేరకు తన నిర్ణయాన్ని ఆమె సోమవారం వెల్లడించింది. భారత పారాలింపిక్‌ కమిటీ (పీసీఐ) అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వివరించింది. జాతీయ క్రీడా నియమావళి ప్రకారం దేశంలోని ఏదైనా క్రీడా సమాఖ్యలో పదవి చేపట్టాలంటే క్రీడల్లో క్రియాశీలకంగా ఉండకూడదు. ‘ఎన్నికల్లో పాల్గొనేందుకు క్రీడల నుంచి వైదొలుగుతున్న విషయాన్ని గత సెప్టెంబరులోనే పీసీఐకి తెలియజేశా. పీసీఐ నూతన కమిటీ ఎన్నికకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తుండడంతో ఇంతకాలం నా రిటైర్మెంట్‌ విషయాన్ని వెల్లడించలేదు. కొత్త కమిటీకి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో నూతన కమిటీకి క్రీడా శాఖ అనుబంధ గుర్తింపు కోసం ప్రయత్నించాల్సిన నేపథ్యంలో నా రిటైర్మెంట్‌ విషయాన్ని ప్రకటిస్తున్నా’ అని 49 ఏళ్ల దీపామాలిక్‌ ట్వీట్‌ చేసింది. 


సంచలనాల తార: దీపామాలిక్‌.. పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌. 2016 రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో ఆమె రజత పతకం గెలుపొంది చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే 2018లో దుబాయ్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో ఎఫ్‌-53/54 జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం నెగ్గి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం గుర్‌గావ్‌లో సహాయ కోచ్‌గా పని చేస్తున్న దీపామాలిక్‌ 58 జాతీయ, 23 అంతర్జాతీయ పతకాలు సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న (2019), పద్మశ్రీ (2017), అర్జున (2012) అవార్డులను ఆమె అందుకుంది.


ధైర్యానికి ప్రతీక!

దీపామాలిక్‌.. ధైర్యానికి మారుపేరు. ఆత్మవిశ్వాసానికి ప్రతీక. చలాకీతనానికి చిరునామా. ఆర్మీ కుటుంబంలో జన్మించిన దీప తండ్రి బీకే నాగ్‌పాల్‌.. వెటరన్‌ ఇన్‌ఫాన్‌ట్రీ కల్నల్‌. ఆమె భర్త విక్రమ్‌ సింగ్‌ వెటరన్‌ కవేలియర్‌ కల్నల్‌. దీప దంపతులకు ఇద్దరు పిల్లలు దేవిక, అంబిక. జీవితం సాఫీగా సాగుతున్న వేళ ఊహించని మలుపు తిరిగింది. 1999లో వెన్నుముక క్యాన్సర్‌కు లోనుకావడంతో మాలిక్‌కు మూడు ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. దీప ఓ పక్క ఆసుపత్రిలో పోరాడుతుండగా..సైనికుడిగా ఆమె భర్త కార్గిల్‌లో యుద్ధం చేస్తున్న క్లిష్టపరిస్థితులు. మొత్తంగా అటు దీప ఇటు విక్రమ్‌సింగ్‌ ఆ పోరాటాల్లో విజయాలు సాధించారు. అయితే నడుము కింది భాగమంతా చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకే దీప పరిమితం కావాల్సి వచ్చింది. ఆమె ఏమాత్రం అధైర్యపడలేదు. తన వైకల్యంపై పోరాడాలని సంకల్పించింది. మరో జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. దీపకు కుటుంబం అండగా నిలిచింది.


వీల్‌చైర్‌తోనే ఏడేళ్లు కేటరింగ్‌ బిజినె్‌సను విజయవంతంగా నిర్వహించిన దీప..క్రీడల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తలచింది. అప్పటికి ఆమెకు 36 ఏళ్లు. ఈ వయస్సులో క్రీడాకారులు రిటైర్మెంట్‌కు ప్రణాళికలు రచిస్తుంటారు. కానీ మాలిక్‌ ఆ సమయంలో అథ్లెట్‌గా మారాలనుకొని ప్రత్యేకతను చాటుకుంది. అదీ కూడా ఒక క్రీడతోనే సరిపెట్టుకోలేదు. అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, మోటార్‌ రేసింగ్‌లో సంచలన ప్రదర్శనలు చేసింది. 2008లో తీవ్ర అలల నడుమ యమునా నదిలో కిలో మీటర్‌ ఈది లిమ్కా బుక్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. బైక్‌ రైడింగ్‌ అంటే ఎంతో ఇష్టమనే దీప 2009లో అత్యంత ప్రమాదకరమైన ‘రైడ్‌ ద హిమాలయన్‌’ రేస్‌లో 1700 కి.మీ.లను 8 రోజుల్లో పూర్తి చేయడం ఆమె ధైర్యసాహసాలకు ప్రతీక. ఇక అథ్లెటిక్స్‌లో దీప సాధించిన విజయాలెన్నో!


గర్వంగా ఉంది..

 అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పడం బాధగా ఉన్నా.. నాకెంతో ఇచ్చిన పారా అథ్లెటిక్స్‌కు సేవ చేయనుండడం గర్వంగా ఉంది. దేశంలో పారా అథ్లెట్ల అభివృద్ధే నా ధ్యేయం.

- దీపామాలిక్‌ 

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - 2020-05-12T10:10:50+05:30 IST