బెయిలు మంజూరైన కాసేపటికే దీప్ సిద్ధూ అరెస్ట్

ABN , First Publish Date - 2021-04-17T22:41:11+05:30 IST

పంజాబీ నటుడు దీప్ సిద్ధూకు బెయిలు మంజూరైన కాసేపటికే

బెయిలు మంజూరైన కాసేపటికే దీప్ సిద్ధూ అరెస్ట్

న్యూఢిల్లీ : పంజాబీ నటుడు దీప్ సిద్ధూకు బెయిలు మంజూరైన కాసేపటికే ఢిల్లీ పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు. ఎర్ర కోటపై మతపరమైన జెండాను ఎగురవేసినట్లు ఆరోపిస్తూ భారత పురావస్తు శాఖ దాఖలు చేసిన కేసులో శనివారం ఆయనను అరెస్టు చేశారు. ఎర్ర కోట వద్ద గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో అంతకుముందు ఆయనకు బెయిలు మంజూరైంది. 


ఎర్ర కోటను భారత పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రైతు సంఘాలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో జరిగిన హింసాకాండలో ఎర్ర కోట కాంప్లెక్స్ ఆఫీస్ ధ్వంసమైంది. ఈ సంఘటనను వివరిస్తూ పురావస్తు శాఖ ఓ కేసును దాఖలు చేసింది. నిరసనకారులను దీప్ సిద్ధు రెచ్చగొట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయనను ఫిబ్రవరి 9న అరెస్టు చేశారు. స్పెషల్ జడ్జి నీలోఫర్ అబిద పర్వీన్ ఆయనకు బెయిలు మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తుతోపాటు రూ.30 వేల చొప్పున ఇద్దరి జామీన్లను సమర్పించాలని ఆదేశించారు. అవసరమైనపుడు పోలీసుల దర్యాప్తులో పాల్గొనాలని కోర్టు ఆయనను ఆదేశించింది. 


ఢిల్లీ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ, దీప్ సిద్ధూ హింసను సృష్టించాలనే ఉద్దేశంతోనే నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే జాతీయ జెండాను అవమానించారని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకంగా సమావేశమయ్యే విధంగా ప్రజలను రెచ్చగొట్టిన ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపారు. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నవంబరు నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతు సంఘాలు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాయి. వేలాది మంది రైతులు ఘాజీపూర్ నుంచి ఐటీవో వద్దకు చేరుకున్నారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. రైతులు ట్రాక్టర్లను నడుపుకుంటూ ఎర్ర కోటకు చేరుకున్నారు. 


ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో రైతులు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళ వద్ద నుంచి రెండు మ్యాగజైన్లను, 20 కార్‌ట్రిడ్జ్‌లను లాక్కున్నారని, వాహనాలను ధ్వంసం చేశారని, ఎర్ర కోటపై జాతీయ జెండాను అవమానించి, మతపరమైన జెండాను ఎగురవేశారని ఆరోపించారు. 


Updated Date - 2021-04-17T22:41:11+05:30 IST