డీప్‌ ఫేక్స్‌ ఏది నిజం... ఏది అబద్ధం!

ABN , First Publish Date - 2020-08-08T06:00:14+05:30 IST

డీప్‌ ఫేక్స్‌ అనే టెక్నాలజీ వల్ల ఏది అసలు వీడియో, ఏది నకిలీ వీడియో అన్నది తేల్చుకోవడం కష్టంగా మారుతోంది. అసలు ఈ డీప్‌ ఫేక్స్‌ టెక్నాలజీ అంటే ఏమిటి? దానివల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి...

డీప్‌ ఫేక్స్‌  ఏది నిజం... ఏది అబద్ధం!

ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో ఓ మహిళ అప్‌లోడ్‌ చేసిన వీడియోను డౌన్‌లోడ్‌ చేసి ఆమె అశ్లీల చిత్రంలో నటించినట్లు ఏ మాత్రం అనుమానం రాకుండా వీడియో తయారు చేశారు.


ఒక నేరపూరితమైన కార్యక్రమంలో ఓ రాజకీయ నాయకుడు ఉన్నట్లు వీడియో మార్ఫింగ్‌ చేసి జనాల్లోకి వదిలారు. అందులో అచ్చు గుద్దినట్లు ఆ రాజకీయ నాయకుడే  కనిపించడంతో చాలామంది దాన్ని గుడ్డిగా నమ్మేశారు.. వాట్సప్‌, ఫేస్‌బుక్‌లలో అది వైరల్‌ అయిపోయింది.


ఫలానా రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ఫలానా మతం వాళ్లపై దాడులు చేస్తున్నారు అంటూ ఓ వీడియో వైరల్‌ అయింది. రెండో ఆలోచన లేకుండా దాన్ని నమ్మారు. ఫలితంగా అల్లర్లు మొదలయ్యాయి. దేశ సమగ్రత దెబ్బతింది.


ఈ మూడు సంఘటనలలో నేరస్థులు డీప్‌ ఫేక్స్‌ అనే టెక్నాలజీ ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వల్ల ఏది అసలు వీడియో, ఏది నకిలీ వీడియో అన్నది తేల్చుకోవడం కష్టంగా మారుతోంది. అసలు ఈ డీప్‌ ఫేక్స్‌ టెక్నాలజీ అంటే ఏమిటి? దానివల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. 


ఏబీఎన్‌ నిర్వహించే డిబేట్‌లో వెంకటకృష్ణ పాల్గొంటారు. అదే డిబేట్‌ను నేను చేపడితే ఎలా ఉంటుందో పైన ఉన్న చిత్రంలో చూడొచ్చు. ఏ మాత్రం అనుమానం కలగకుండా డీప్‌ ఫేక్స్‌ టెక్నాలజీ ద్వారా వెంకటకృష్ణ రూపురేఖలపై నా ముఖం అమర్చడం జరిగింది. మునుముందు ఇలాంటివి ఎన్నో సమాజం చూడబోతోంది. 


డీప్‌ ఫేక్స్‌ అంటే ఏమిటి?

ఇటీవలి కాలంలో మనం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ అనే పదాలను ఎక్కువగా వింటున్నాం. అందులో మెషీన్‌ లెర్నింగ్‌ని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ‘డీప్‌ ఫేక్స్‌’. ఒక మామూలు ఫోటో మార్ఫింగ్‌ చేయాలంటే ఫొటోషాప్‌ వంటి వాటిపై ఎంత అవగాహన ఉన్న వ్యక్తికైనా కనీసం అరగంట సమయం పడుతుంది. అలాంటిది సెకనుకి 25, 30 ఫ్రేముల చొప్పున ఉండే ఒక గంట వీడియోని మామూలు పద్ధతిలో మార్ఫింగ్‌ చెయ్యడం అసాధ్యం. కనీసం ఆర్నెల్లు సమయం పడుతుంది. అయినా కూడా నిక్కచ్ఛిగా రాదు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ‘డీప్‌ ఫేక్స్‌’ వాడుతుంటారు. దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు.


ఎలా పనిచేస్తుంది?

డీప్‌ ఫేక్స్‌ కోసం కొన్ని నిర్దిష్టమైన సాఫ్ట్‌వేర్లు వాడుతూ ఉంటారు. ఈ ప్రక్రియ మొత్తం ఎక్స్‌ట్రాక్షన్‌, సార్టింగ్‌, ట్రైనింగ్‌, కన్వర్టింగ్‌ అని పలు భాగాలుగా సాగుతుంది. ఇక్కడ వెంకటకృష్ణ వీడియోలో నేను న్యూస్‌ చదివినట్లు చూపించాలి అనుకుంటే.. వెంకటకృష్ణవి, నావి చిన్నవి గానీ, పెద్దవి గానీ వేర్వేరుగా రెండు వీడియో క్లిప్‌లు కావాలి. లేదా భారీ మొత్తంలో ఇద్దరి ఫోటోలు ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ఆ రెండు వీడియో క్లిప్‌ల నుంచి వేర్వేరు ఫోల్డర్లలో ముఖకవళిలకు సంబంధించిన ఫ్రేమ్‌లను వెలికి తీయాలి. వాటిలో అనవసరమైన ఫ్రేమ్‌లను తర్వాత తొలగించాలి. కావలసిన వాటిని అలాగే ఉంచాలి. 

ఇప్పుడు ఇద్దరి ఫేస్‌ల   ఫొటోలు కలిగిన డేటాసెట్స్‌ సిద్ధమయ్యాయి. సగటున ఒక ఐదు నిమిషాల వీడియో నుంచి 5 నుంచి 12 వేల ముఖాల వరకూ వెలికి తీయొచ్చు. ఒక డీప్‌ ఫేక్‌ వీడియో తయారు చేయాలంటే ఎవరి ముఖాన్నయితే మార్ఫింగ్‌ చేస్తున్నారో వారివి రెండు వేల ఫొటోలు ఉంటే చాలు, మెరుగైన ఫోటోలు వస్తాయి. ఇంకా ఎక్కువ ఫొటోలు ఉంటే (అంటే ఆ వ్యక్తికి చెందిన మరింత ఎక్కువ నిడివి కలిగిన వీడియో లభిస్తే) ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి.


కీలకమైన ట్రైనింగ్‌

పైన చెప్పుకున్నట్లు వీడియో నుంచి ఇద్దరు వ్యక్తుల ఫొటోలను వెలికి తీస్తే చాలు.. ఇక ఆ తర్వాత కష్టపడాల్సిన పని ఏమీ ఉండదు. ‘డీప్‌ ఫేక్స్‌’ కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లో ట్రైనింగ్‌ అని ఓ విభాగం ఉంటుంది. దానికి ఈ ఇద్దరు వ్యక్తుల ఫొటోలు ఉన్న ఫోల్డర్లని డేటాసెట్స్‌గా ఇచ్చి ట్రైనింగ్‌ మొదలు పెట్టడమే. ఇప్పుడు ఆ సాఫ్ట్‌వేర్‌ తనంతట తాను పని చేసుకుంటూ పోతుంది. ఇద్దరి వ్యక్తుల ముఖకవళికలను నిశితంగా స్టడీ చేస్తూ కళ్లు, ముక్కు, పెదాలు.. ఇద్దరికీ ఏయే ప్రదేశాల్లో ఉన్నాయి, ఏ రంగులో ఏ పిక్సెల్‌ ఉంది వంటి సమాచారమంతా విశ్లేషిస్తూ ఒకరి ముఖంపై మరొకరి ముఖాన్ని సూపర్‌ ఇంపోజ్‌ చేస్తూ ఏ మాత్రం అనుమానం రానంత సమర్థంగా ఫలితాలు సాధించవచ్చు. ఈ ఫలితాలన్నీ ట్రైనింగ్‌ మోడల్‌ పేరుతో భద్రపరచబడతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. కంప్యూటర్‌ ప్రాసెసర్‌, ర్యామ్‌, గ్రాఫిక్‌ కార్డులను బట్టి ఈ ట్రైనింగ్‌ పూర్తయ్యే వేగం ఒక రోజు నుంచి రెండు మూడు నెలల వరకు కూడా పడుతుంది. మధ్యలో కంప్యూటర్‌ ఆఫ్‌ చేసినా, మళ్లీ అక్కడి నుంచి ట్రైనింగ్‌ మొదలుపెట్టవచ్చు. ట్రైనింగ్‌ ఎంత ఎక్కువగా చేస్తే అంత మెరుగైన ఫలితాలు లభిస్తాయి. మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ఆధారంగా ఇది జరుగుతుంది.


చివరి దశ.. వీడియో సిద్ధం!

ట్రైనింగ్‌ పూర్తి అయిన తర్వాత మిగిలిన చివరి దశ వీడియోని కన్వర్ట్‌ చెయ్యడం! దీనికోసం ఒరిజినల్‌ వీడియో ఫైల్‌ ఎంపిక చేసుకొని, ఇంతకు ముందు ట్రైనింగ్‌ మోడల్‌ ఏ ఫోల్డర్‌లో సేవ్‌ అయిందో ఆ ఫోల్డర్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.. వీడియో పరిమాణాన్ని బట్టి పది నిమిషాల నుంచి అరగంట లోపు ఫైనల్‌ వీడియో సిద్ధం అవుతుంది. వీడియో మార్ఫ్‌ చేశారు అన్న అనుమానం ఏమాత్రం రాదు.


ఎలా ప్రమాదకరం?

ఇటీవలి కాలంలో చాలా మంది తమ టిక్‌ టాక్‌ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వాటిలో పెడుతున్నారు. అలాగే యూట్యూబ్‌ ఛానళ్లు, ఇతర వీడియో కంటెంట్‌ తయారు చేస్తున్నారు. ఒక మహిళకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్‌ సంపాదించి ఏమాత్రం కష్టపడకుండా ఆమె ఓ పోర్న్‌ మూవీలో నటించినట్లు నేరస్థులు వీడియోలు తయారు చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి కేసులు కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. అనేకమంది బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్లకి సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియోలను కూడా విచ్చలవిడిగా ఇంటర్నెట్లో పెడుతున్నారు. అలాగే రాజకీయ నాయకుల వీడియోలను మార్ఫ్‌ చేసి జనాలను తప్పుదోవ పట్టించే ప్రమాదం లేకపోలేదు. 


మార్ఫింగ్‌ వీడియోలను గుర్తించవచ్చా?

ఒక వీడియోని మార్ఫ్‌ చేశారు అన్నది   గుర్తించడం కష్టమే. కానీ, సైబర్‌ ఫోరెన్సిక్‌ విభాగంలో ఫ్రేమ్‌ల హిస్టోగ్రామ్‌లను కొన్ని ప్రత్యేకమైన టూల్స్‌ సహాయంతో విశ్లేషించడం ద్వారా పోలీసులు నకిలీ వీడియోను సులభంగా గుర్తిస్తారు. అయితే ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఉదాహరణకు ఒక కాలేజీ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోని ఓ పోకిరీ సేకరించి అశ్లీలమైన మార్ఫింగ్‌ వీడియో తయారు చేశాడు అనుకుందాం. ఆ వీడియో నిజమా కాదా! అన్నది  నిరూపితం అయ్యేలోపే ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోతుంది.



- నల్లమోతు శ్రీధర్‌


Updated Date - 2020-08-08T06:00:14+05:30 IST