‘కుటుంబ పార్టీ’ ముద్ర వెనక లోతైన కుతంత్రం!

ABN , First Publish Date - 2022-07-16T07:04:27+05:30 IST

అంబేడ్కర్‌తోపాటు, నెహ్రూ, బాబు రాజేంద్రప్రసాద్‌ లాంటి ఉదారవాదులు సమాఖ్య భావనకు మద్దతుగా నిలిచారు. ఆరెస్సెస్‌–బీజేపీలు...

‘కుటుంబ పార్టీ’ ముద్ర వెనక లోతైన కుతంత్రం!

అంబేడ్కర్‌తోపాటు, నెహ్రూ, బాబు రాజేంద్రప్రసాద్‌ లాంటి ఉదారవాదులు సమాఖ్య భావనకు మద్దతుగా నిలిచారు. ఆరెస్సెస్‌–బీజేపీలు సమాఖ్య వ్యవస్థను మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో అధ్యక్షత తరహా పాలన, ద్విపార్టీ విధానం కావాలనే ఎజెండాతో పనిచేస్తుంది బీజేపీ. కానీ సమాఖ్య వ్యవస్థ వల్ల, బహుళ పార్టీ విధానాల వల్ల వివిధ రాష్ట్రాల్లోని మార్జినల్‌ పీపుల్‌కు స్వయంపాలన లభిస్తుంది. అట్లా జరిగితే రాష్ట్రాలపై తమ ఆధిపత్యం తగ్గుతుందని వీరి కడుపుమంట.


కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలతో ప్రగతి పథంలో పయనిస్తున్నది. ఇలాంటి సందర్భంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం మిడతల దండు వలే దండయాత్ర చేస్తున్నది. వేయి పడగల విషనాగై తెలంగాణలోని ప్రజాప్రభుత్వాన్ని కూల్చుతామని బుసకొడుతున్నది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించకుండా వారి అభివృద్ధి సంక్షేమ ఎజెండాను విస్మరించి, భాగోద్వేగభరితమైన విద్వేషపూరితమైన మూకవాద ఎజెండాతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీపై కుటుంబ, వారసత్వ పార్టీ అని ముద్రవేస్తున్నది. కేసీఆర్ నుంచి తెలంగాణను విడదీసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ అకుంఠిత పోరాట దీక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కారణం. ఆయన ప్రజల ముందు నడిచారు, ప్రజలను నడిపించారు. తద్వారా వారికి తెలంగాణ ప్రజలతో అవినాభావ సంబంధం ఏర్పడ్డది. గత ఎనిమిదేళ్ళ అభివృద్ధి, సంక్షేమ పాలన ద్వారా ఆ బంధం మరింత బలపడ్డది. అది తల్లికి బిడ్డకు గల పేగుబంధమంత బలమైనది. ఎవరూ విడదీయలేనిది. అయితే టీఆర్‌ఎస్‌పై ‘కుటుంబ పార్టీ’గా అన్న ముద్ర వేయటం ద్వారా బీజేపీ కేసీఆర్‌కు, తెలంగాణకు మధ్య గల బంధాన్ని తుంచివేయాలని కుయుక్తులు పన్నుతున్నది.


టీఆర్‌ఎస్ పార్టీ విషయంలోనే కాదు, అనేక ప్రాంతీయ పార్టీల, వాటి అధినాయకత్వాల విషయంలో ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నది. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నేత, సామాజిక విప్లవకారుడు, బడుగుబలహీన వర్గాల గొంతుక అయిన లాలూప్రసాద్‌ యాదవ్‌ను కుల, కుటుంబ, వారసత్వ నాయకునిగా కుదించి, అవినీతిపరునిగా ముద్రవేసి, అక్రమ కేసులు బనాయించి, సీబీఐ ఈడీల సాయంతో జైలుపాలు చేసింది. నితీష్‌ కుమార్‌ లాగా లాలూ కూడా బీజేపీతో అంటకాగి ఉంటే, మోదీ ప్రభుత్వానికి సామంతునిగా జీ హుజూర్‌ అని ఉంటే, ఈ రోజు లాలూ బిహార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగేవారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘మహారాష్ట్ర మరాఠాల కోసమే’ అనే నినాదంతో మరాఠాల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న శివసేన పార్టీని నిలువునా చీల్చి, తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నది. అలా మొన్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిని స్వాధీనం చేసుకొని, రేపు హైదరాబాదును చెరబట్టాలని, తమ అనుంగు వ్యాపార మిత్రులైన అంబానీ, అదానీలకు పప్పు బెల్లం లాగ పంచి పెట్టాలని చూస్తున్నది. గవర్నర్లను, సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్‌ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రయోగించి రాష్ట్రాలలోని ప్రజాప్రభుత్వాలను కూల్చి, దొడ్డిదారిన అధికారంలోకి రావటం బీజేపీకి ఒక సంప్రదాయంగా మారింది.

భారతదేశం అనేక కులాల, మతాల, ప్రాంతాల, భాషల, సంస్కృతుల సమ్మేళనం. అందుకే రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య విధానానికి మొగ్గు చూపారు. దేశంలో సమాఖ్య విధానం, బహుళ పార్టీ విధానం ఉండడం వలన చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ప్రాంతీయ పార్టీల ఏర్పాటు వెనక ప్రాంత, భాష, సాంస్కృతిక అస్తిత్వాలతోపాటు అంతర్లీనంగా ప్రాంతీయ కులాలుగాగా పిలువబడే శూద్ర, ఆదిశూద్ర కులాల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు ఉన్నాయి.


తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ; తమిళనాడులో ద్రవిడ జాతీయవాదంతో డీఎంకె, ఎఐడీఎంకె; ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం; సోషలిస్టు నినాదంతో, బలహీన వర్గాల అధికార భాగస్వామ్యం లక్ష్యంగా ఎస్‌పీ (యూపి), ఆర్‌జేడీ, జెడియు (బిహార్‌), జేడీఎస్‌ (కర్ణాటక); బహుజనవాదంతో బీఎస్‌పీ; మరాఠాల ఆత్మగౌరవ నినాదంతో శివసేన ఉద్భవించాయి. మైనార్టీ ప్రజల అస్తిత్వ పోరాట రూపాలుగా నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ (జమ్మూ కాశ్మీర్‌), ఎఐఎంఐఎం, శిరోమణి అకాలీదళ్‌ (పంజాబ్‌) అవతరించాయి. ఈ పార్టీల పుట్టుకను మనం శూద్ర, ఆదిశూద్ర, మైనారిటీ, ఆదివాసీ ప్రజల ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా, ఆయా వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపాలుగా చూడాలి.

దేశంలో బ్రాహ్మణవాదానికి, శూద్ర ప్రజాస్వామిక వాదానికి మధ్య నిరంతర ఘర్షణ చరిత్ర పొడవునా కొనసాగిందని అంబేడ్కర్‌ తన ‘రెవెల్యూషన్‌ అండ్‌ కౌంటర్‌ రెవల్యూషన్‌’ గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. అందుకే బ్రిటీష్‌ తదనంతర స్వతంత్ర భారతంలో మార్జినల్‌ కమ్యూనిటీస్‌ (పీడిత ప్రజలకు) రాజ్యాంగబద్ధ హక్కులు ఉండాలని, అంబేడ్కర్ కాంక్షించారు. అందుకోసం సమాఖ్య భారతాన్ని వారు సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా ఉంటే కొన్ని వర్గాలకే అధికారం పరిమితం అవుతుందని, దానివల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిపూర్ణత సాధించదని, రాష్ట్రాలకు కేంద్రంతో సమానంగా హక్కులు, అధికారాలు లభించాలని.. ఆ విధంగా వారు సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేశారు. భారత సమాఖ్య స్వభావాన్ని గురించి అంబేడ్కర్‌, రాజ్యాంగ నిర్మాణ సభలో మాట్లాడుతూ ‘భారత రాజ్యాంగం చాలావరకు సమాఖ్య లక్షణాలు కలిగి ఉంది. రాష్ట్రాలు తమ అధికారాలను కేంద్రం నుంచి పొందలేవు. అవి వాటికవి స్వతంత్రమైనవి’ అన్నారు. అంబేడ్కర్‌తోపాటు, నెహ్రూ, బాబు రాజేంద్రప్రసాద్‌ లాంటి ఉదారవాదులు సమాఖ్య భావనకు మద్దతుగా నిలిచారు. ఆరెస్సెస్‌–బీజేపీలు సమాఖ్య వ్యవస్థను మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో అధ్యక్షత తరహా పాలన, ద్విపార్టీ విధానం కావాలనే ఎజెండాతో పనిచేస్తుంది బీజేపీ. కానీ సమాఖ్య వ్యవస్థ వల్ల, బహుళ పార్టీ విధానాల వల్ల వివిధ రాష్ట్రాల్లోని మార్జినల్‌ పీపుల్‌కు స్వయంపాలన లభిస్తుంది. అట్లా జరిగితే రాష్ట్రాలపై తమ ఆధిపత్యం తగ్గుతుందని వీరి కడుపుమంట. అందుకే ఆయా రాష్ట్రాలలో తమ రాజ్య విస్తరణ కాంక్షకు అడ్డుగోడలుగా నిలుస్తున్న ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలుగా ముద్రవేస్తున్నాయి.


భారతదేశంలో గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లు వేసిన ప్రజాస్వామిక పునాదులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. బీజేపీ వారు ఎన్ని కుయుక్తులు పన్నినా, ప్రజలు ప్రతి సందర్భంలోనూ వారిని తిప్పికొడుతున్నారు. అది ఎన్‌ఆర్‌సీ, సీఏఏ విషయంలోనైనా, రైతులపై నల్ల చట్టాల విషయంలోనైనా ఋజువయ్యింది. కేసీఆర్ చెబుతున్నట్లుగా దేశం ఖచ్చితంగా స్పందిస్తుంది, ప్రతిఘటిస్తుంది, విజయం సాధిస్తుంది. దేశం ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య రాజ్యాంగాన్ని కాపాడుకుటుంది. దేశంలో రాజ్యాంగవాదం వర్ధిల్లుతుంది.

l డి. రాజారాం యాదవ్‌ (టీఆర్‌ఎస్‌)

Updated Date - 2022-07-16T07:04:27+05:30 IST