దీని దుంప తెగ!

ABN , First Publish Date - 2022-01-23T07:02:36+05:30 IST

కర్రపెండలం దుంప ఆధారంగా సగ్గుబియ్యం ఉత్పత్తి చేస్తారు. ఈ దుంపతో సగ్గుబియ్యంగా మార్చే మిల్లులు మన రాష్ట్రంలో ఒక్క మన జిల్లాలోనే, అవి కూడా సామర్లకోట, పెద్దాపురం మండలాల్లోనే ఉన్నాయి.

దీని దుంప తెగ!

 కర్ర పెండలం క్రషింగ్‌ సీజన్‌కు అష్టకష్టాలు

 సగ్గుబియ్యానికి డిమాండ్‌ లేకపోవడమే కారణం

 దిగుబడికి పంట రెడీ

 28 సగ్గుబియ్యం మిల్లులకుగాను 9 మిల్లులే సమాయత్తం

రూ. 250 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు ప్రశ్నార్థకం 

సామర్లకోట, జనవరి 22 : కర్రపెండలం దుంప ఆధారంగా సగ్గుబియ్యం ఉత్పత్తి చేస్తారు. ఈ దుంపతో సగ్గుబియ్యంగా మార్చే మిల్లులు మన రాష్ట్రంలో ఒక్క మన జిల్లాలోనే, అవి కూడా సామర్లకోట, పెద్దాపురం మండలాల్లోనే ఉన్నాయి. దీంతో మెట్ట, ఏజెన్సీ మండలాల్లో సాగవుతున్న కర్రపెండలం దుంప మొత్తం సామర్లకోట, పెద్దాపురం మండలాల్లోని సగ్గుబియ్యం మిల్లులకే సరఫరా అవుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 28 సగ్గుబియ్యం మిల్లులు ఉన్నప్పటికీ, ఈ ఏడాది సుమారు 9 సగ్గుబియ్యం మిల్లులలోనే దుంప క్రషింగ్‌కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా శనివారం సాయంత్రం వరకూ సగ్గుబియ్యం మిల్లులను తిప్పేందుకు మిల్లర్ల అసో సియేషన్‌ సమావేశం కాకపోవడంతో ఈ ఏడాది అసలు క్రషింగ్‌ సీజన్‌ ఉంటుందా అనే అనుమానం కూడా వస్తోంది. సీజన్‌ ప్రారంభం కాకపోతే జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో సాగుచేసిన దుంప దిగుబడులను కొనేవారే కరువవుతారని దుంప రైతులు కలవరం చెందుతున్నారు. జూన్‌ నెల మొదటివారం నుంచి సాగు ప్రారం భించిన కర్రపెండలం దుంప సాగు ఇప్పటికే పక్వదశకు చేరడంతో రైతుల పరిస్దితి అయోమయంగా మారింది. ఒకపక్క పంటకు పెట్టిన పెట్టుబడులకు చేసిన అప్పు లకు వడ్డీల భారంతో ఉన్న తమకు దుంప దిగుబడుల విక్రయాలు లేకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే మిల్లుల చుట్టూ దుంప రైతులు తిరుగుతూ సీజన్‌ ప్రారంభం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. కరోనా కారణంగా సేలం మార్కెట్‌లో ఆంధ్రా సగ్గుబియ్యానికి ఏమాత్రం గిరాకీ లేకపోవడం, ఇక్కడి మిల్లుల నుంచి అక్కడకు వెళ్లిన సగ్గుబియ్యం సరుకు నిల్వలుగానే ఉండడంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. వాస్తవానికి ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ రోజుల అనంతరం దుంప క్రషింగ్‌ సీజన్‌ను ప్రారంభించి సుమారు మూడు నెలలపాటు దుంప కొనుగోలు చేసేవారు. అందుకు అనుగుణంగా మిల్లులను సన్నద్ధం చేసేవారు. అయితే ఇప్పటివరకూ నష్టాల బాటలో ఉన్న మిల్లర్లు తమ మిల్లులను తిప్పాలా, వద్దా అనే సందిగ్దతతో సతమతమవుతున్నారు. అటు రైతులు కూడా దుంప సాగు ప్రారంభం నుంచీ వర్షాలు, తుపాన్ల కారణంగా పంటను కాపాడుకునేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. కౌలుశిస్తు పెరగడం, సాగు ఖర్చులు గణనీయంగా పెరగడం, ఎరువులు, కూలీల చార్జీలు అంతకంతకూ పెరగడంతో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయని రైతులు వాపోతున్నారు. అధిక వర్షాల కారణంగా దుంప దిగుబడులు ఎకరాకు 25 పుట్లులోపే కాగలవని చెబుతున్నారు. దీంతో పుట్టికి రూ.1100 ఇచ్చినా ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతుల వాదన.  ఈ ధరకైనా దుంప కొనుగోలు చేస్తారా లేదా అన్నది మరో అయోమయంగా మారింది. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన కర్రపెండలం దుంప పుట్టికి (225 కిలోలు) ధర రూ.1100 వరకూ చెల్లించి నట్టు రైతులు తెలిపారు. ఈ ఏడాది దుంప సాగుకు ఆది నుంచీ అధిక వర్షాల కార ణంగా భూమిలో దుంప ఆశించిన రీతిలో ఉరమ లేదని దుంపలో పిండిశాతం కూడా తగ్గిపోయిందని, దిగుబడులు కూడా తగ్గే ప్రమాదముందని రైతులు వాపో తున్నారు. దీంతో దిగుబడి ఎకరాకు 20 నుంచి 25 పుట్లు లోపే అందే అవకాశాలు ఉన్నాయని దుంప రైతు బండే కొండలరావు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కర్ర పెండలం ద్వారా సగ్గుబియ్యం తయారీ, అద్దకం పరిశ్రమల్లో వినియోగించేందుకు స్టార్చ్‌ పౌడర్‌, పిప్పిని గేదెల దాణాకు మాత్రమే వినియోగించడమే గాక స్టార్చ్‌ పౌడర్‌తో అప్పడాలు, వడియాలు తదితర తినుబండారాల తయారీకి వినియోగిస్తారు. దీంతో ఏటా రూ.250 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిర్వహించడంతోపాటు ఎందరికో ఉపాధి కల్పించే ఈ సాగు, పరిశ్రమలపై నష్టాల భారం తప్పడం లేదు.




Updated Date - 2022-01-23T07:02:36+05:30 IST