దీక్షిత్ హత్యకేసులో సాగర్ ఫిర్యాదు.. సీఐకి మేజిస్ట్రేట్ నోటీసులు

ABN , First Publish Date - 2020-10-24T22:19:53+05:30 IST

దీక్షిత్ హత్యకేసులో సాగర్ ఫిర్యాదు.. సీఐకి మేజిస్ట్రేట్ నోటీసులు

దీక్షిత్ హత్యకేసులో సాగర్ ఫిర్యాదు.. సీఐకి మేజిస్ట్రేట్ నోటీసులు

మహబూబాబాద్: దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసులో సీఐకి మెజిస్ట్రేట్ నోటీసులిచ్చారు. పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని మెజిస్ట్రేట్‌కు ప్రధాన నిందితుడు సాగర్ ఫిర్యాదు చేశారు. దీక్షిత్ హత్యకేసులో సూత్రధారి, పాత్రధారి మంద సాగర్‌ ఒక్కడేనని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ‘‘దీక్షిత్‌ని కిడ్నాప్‌ చేసిన సాగర్ దారుణంగా హతమార్చారు. ఎత్తుకెళ్లిన రెండు గంటల్లోనే.. ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టొద్దనే ఉద్దేశంతో పెట్రోల్‌ పోసి తగుల బెట్టాడు. ఈ నెల 18న దీక్షిత్‌రెడ్డిని తన బైక్‌పై తీసుకెళ్లిన సాగర్‌.. పట్టణంలో ఎక్కడా సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. కేసముద్రం మండలం అన్నారం గ్రామ శివారులోని దానమయ్య గుట్టకు తీసుకెళ్లాడు. చీకటి పడుతుండడంతో దీక్షిత్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లమంటూ ఏడ్చాడు. దీంతో దొరికిపోతానని సాగర్‌ భయపడ్డాడు. దీక్షిత్‌కు నిద్రమాత్రలు ఇచ్చాడు. ఆ బాలుడు నిద్రలోకి జారుకోగానే.. రుమాలుతో అతడి చేతులను కట్టేశాడు. బాలుడి టీషర్టు తీసి, దాంతోనే మెడకు ఉరి బిగించి, చంపాడు’’ అని ఎస్పీ తెలిపారు. 


ఇలా చిక్కాడు..

బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు మూడుకొట్ల సెంటర్‌లో డబ్బులు, బంగారం ఉంచిన బైక్‌పై పోలీసుల నిఘా పెట్టడాన్ని కనిపెడుతూ వచ్చిన ఆగంతకుడు.. చివరికి మరోమారు ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా బాలుడి తండ్రిని ఆ డబ్బు తీసుకుని తాళ్లపూసపల్లి రోడ్డులోని స్టోన్‌ క్రషర్‌ సమీపానికి రమ్మని ఆదేశించారు. తాను బాలుడిని హత్యచేసి తగులబెట్టిన ప్రాంతానికే రప్పించి అనూహ్యంగా పోలీసులు వేసిన పక్కా స్కెచ్‌లో చిక్కాడు. ఈ ప్రాంతంలో మాటువేసి ఉన్న పోలీసులు కిడ్నాపర్‌ మంద సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసి చంపినట్లు సాగర్‌ ఒప్పుకున్నాడని, ఈజీ మనీకి అలవాటుపడి జల్సాల కోసం కిడ్నాప్‌ ద్వారా భారీ మొత్తంలో సంపాదించాలన్న అత్యాశ అతడిని కిడ్నాపర్‌గా మార్చిందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

Updated Date - 2020-10-24T22:19:53+05:30 IST