చిత్తశుద్ధే ప్రధానం

ABN , First Publish Date - 2020-08-14T05:30:00+05:30 IST

విశ్వాసులుగా గుర్తింపు పొందాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. ‘గొప్ప భక్తులం’ అని చాటుకోవడానికి ఆరాటపడతారు. అలాంటి చర్యల వల్ల ఫలితం ఉండదని ఏసుప్రభువు హెచ్చరించాడు...

చిత్తశుద్ధే ప్రధానం

విశ్వాసులుగా గుర్తింపు పొందాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. ‘గొప్ప భక్తులం’ అని చాటుకోవడానికి ఆరాటపడతారు. అలాంటి చర్యల వల్ల ఫలితం ఉండదని ఏసుప్రభువు హెచ్చరించాడు. ‘‘ఇతర వ్యక్తులు గుర్తించాలన్న కోరికతో వారికి కనిపించేలా మీ నీతివంతమైన పనులను ఉద్దేశపూర్వకంగా చేయకండి. ఈ విషయంలో జాగ్రత్త పడండి. లేనట్టయితే పరలోకంలో ఉన్న మీ తండ్రి నుంచి మీకు ఎలాంటి ప్రతిఫలం లభించదు. మీరు పేదలకు దానధర్మాలు చేస్తున్నప్పుడు, ఆ విషయాన్ని చాటింపు వేయడానికి బాకా ఊదకండి. కపటవేషాలు వేసేవారు ఇతరుల నుంచి గౌరవం పొందడం కోసం వీధుల్లో, సామాజిక ప్రార్థనా ప్రదేశాల్లో ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు.


మీకు నేను సత్యం చెబుతున్నాను... దానికి తగిన ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. కాబట్టి మీరు పేదలకు దానధర్మాలు చేస్తున్నప్పుడు, కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియనివ్వకండి. అప్పుడే మీ దానధర్మాలు రహస్యంగా ఉంటాయి. రహస్యంగా మీరు చేసిన పనులను పరలోకంలోని మీ తండ్రి గమనిస్తాడు. మీకు తగిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు’’ (మత్తయి సువార్త 6:1-4) అని ఆయన స్పష్టం చేశాడు. దైవానుగ్రహం పొందాలనుకున్న వ్యక్తికి చిత్తశుద్ధి ఉండాలి. భక్తి అనేది దైవానికీ, విశ్వాసికీ మధ్య ఉండే బంధం. ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని గుర్తింవలసింది దైవమే! వేరెవరికో భక్తినీ, విశ్వాసాన్నీ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధితో మంచి పనులు చేసేవారికి దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుందన్నది ఏసుప్రభువు బోధనలోని సారాంశం.


Updated Date - 2020-08-14T05:30:00+05:30 IST