‘ఏడు చేపల’ అసలు కథ!

ABN , First Publish Date - 2020-05-29T03:44:34+05:30 IST

పెద్ద పెద్ద వాళ్లు సైతం లౌకిక వ్యామోహాల్లో పడిపోవడం, ఇంద్రియ వ్యామోహాల్లో పడిపోవడం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్ఞానులుగా పేరొందినవాళ్లు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారు కూడా వ్యామోహాల్లో...

‘ఏడు చేపల’ అసలు కథ!

పెద్ద పెద్ద వాళ్లు సైతం లౌకిక వ్యామోహాల్లో పడిపోవడం, ఇంద్రియ వ్యామోహాల్లో పడిపోవడం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్ఞానులుగా పేరొందినవాళ్లు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారు కూడా వ్యామోహాల్లో పడి కొట్టుకుపోవడం చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సంస్కారవంతులుగా పేరొందిన వాళ్లు కూడా ఎందుకు పడిపోతారు? దానికి కీలకం ఏమిటో, ఎక్కడ నిగ్రహించుకోవాలో భగవంతుడు చెబుతున్నాడు.



దేవేంద్రలోక గురువు అయిన బృహస్పతి పీఠాన్ని తిరస్కరించి, రత్నాలు పొదిగిన బంగారు చింతామణి పీఠాన్ని కూడా తిరస్కరించి, తల్లి ఒడిని అంత కంటే గొప్పదిగా భావించగలిగితే... ప్రపంచం మొత్తం మనకు కరతలామలకమై ఉంటుంది. ఇది తెలియాలంటే భగవద్గీత మూడో అధ్యాయంలోని 34వ శ్లోకాన్ని, భావంతో సహా అర్థం చేసుకోగలగాలి. 


  • ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ!
  • తయోర్న వశమాగచ్ఛేత్‌  తౌహ్యస్య పరిపంథినౌ


‘‘రాగద్వేషౌ వ్యవస్థితౌ’’ అంటే రాగద్వేషాలు మాయకు కారణం! ప్రకృతి రాగద్వేషాలను కలిగిస్తుంది కానీ అందులో నువ్వు పడేలా ప్రేరేపించదు. ఒక పువ్వును చూశాం. ఆ పువ్వు వాసన చూశాం. తరువాత కోసేశాం. ఆ పువ్వు కోయమని అడగలేదే? నీ మనస్సే ఆ పువ్వును కోసేలా చేసింది! మనస్సు  వల్లే రాగద్వేషాలు వస్తాయి. మనస్సు, మనఃసంకల్పాలు ఎండిపోయే వరకు రాగద్వేషాలు పోవు. మరి మనస్సు ఎండిపోయేదెలా? మనస్సు వాటి వశం కాకుండా ఉంటే చాలు! రాగద్వేషాలు లేకుండా చేయొద్దు. మనస్సు వాటి వశం కాకుండా చూసుకోవాలి. 


మనస్సు ఎండిపోయేలా చేసుకోవడానికి ఒక చక్కటి కథ చెబుతాను. అందరికీ తెలిసిన కథే ఇది. ఈ కథలో లోతైన అంతరార్థం ఉంది. ‘‘అనగా అనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకు ఏడుగురు కొడుకులు. వాళ్లు ఒకరోజు వేటకెళ్లారు. వేటకు వెళ్లి ఏడుగురూ ఏడు చేపలు తెచ్చి ఎండ బెట్టారు. అందులో ఆరు చేపలు ఎండాయి. ఒక చేప ఎండలేదు. ‘‘చేపా చేపా! ఎందుకు ఎండలేదు?’’ అని అడిగారు. ‘‘గడ్డిమేట అడ్డమొచ్చింది’’ అంది. ‘‘గడ్డిమేటా, గడ్డిమేటా! ఎందుకు అడ్డం వచ్చావు?’’ అని అడిగారు. ‘‘ఆవు మేయలేదు’’ అంది. ‘‘ఆవా, ఆవా! ఎందుకు మేయలేదు?’’ అని అడిగారు. ‘‘గొల్లవాడు మేపలేదు’’ అంది. ‘‘గొల్లవాడా గొల్లవాడా! ఎందుకు మేపలేదు?’’ అని అడిగారు. ‘‘అమ్మ అన్నం పెట్టలేదు’’ అన్నాడు. ‘‘అమ్మా అమ్మా! ఎందుకు అన్నం పెట్టలేదు?’’ అని అడిగారు.  ‘‘పిల్లవాడు ఏడ్చాడు’’ అంది. ‘‘పిల్లవాడా పిల్లవాడా! ఎందుకు ఏడ్చావు?’’ అని అడిగారు. ‘‘చీమ కుట్టింది’’ అన్నాడు. ‘‘చీమా చీమా! ఎందుకు కుట్టావు?’’ అని అడిగారు. ‘‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా’’ అంది.’’ చిన్న పిల్లాడిని పడుకోబెట్టడానికో, కాలక్షేపానికో ఈ కథ చెబుతూ ఉంటారు. కానీ నిజానికి ఈ కథ భగవద్గీతలోని శ్లోకానికి వ్యాఖ్యానం కూడా!




ఈ కథలో ఒక లోపం ఉంది. అదేమిటంటే, ‘రాజు కొడుకులు వేటకు వెళ్లి చేపలు తెచ్చారు’ అని! రాజు కొడుకులు వేటకు వెళితే పులినో, సింహాన్నో తెస్తారు. కనీసం లేడిని అయినా చంపి తెస్తారు. కానీ చేపలు తేవడమేంటి? ఇక్కడే మనం ఆలోచించాలి. తెచ్చినవి చేపలు కాదు. మరేమిటి? అందులోనూ ఆరు ఎండాయి. ఒకటి ఎండలేదు. ఎండిన ఆరే - అరిషడ్గర్వాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు). ఎండని చేప సంకల్పం! అంటే మనస్సు! ఇప్పుడు కథలోకి వెళ్లండి. ‘‘మనసా మనసా! ఎందుకు ఎండలేదు?’’ ‘‘అజ్ఞానం అడ్డంగా ఉంది.’’ అజ్ఞానం గడ్డిమేట లాంటిది. ‘‘అజ్ఞానమా అజ్ఞానమా! ఎందుకు అడ్డొచ్చావు?’’ ‘‘జ్ఞానం రాలేదు.’’ ‘‘జ్ఞానమా జ్ఞానమా! ఎందుకు రాలేదు?’’ ‘‘ఏ సద్గురువూ నాకు సదోపదేశం చేయలేదు.’’ ‘‘సద్గురువు ఎవరండీ?’’ ‘‘ఆ కృష్ణపరమాత్మ!’’ కథలో గొల్లవాడు కృష్ణుడే. గొల్లవాడు మేపలేదు అంటే కృష్ణపరమాత్మ నీకు ఉపదేశం చేయలేదు. ఇప్పుడు మళ్లీ కథలోకి వెళదాం. ‘‘గురువా గురువా! నాకు ఎందుకు ఉపదేశం చేయలేదు?’’ అంటే ‘‘అమ్మవారి కటాక్షం నీకు ఇంకా కలగలేదు.’’ అమ్మ అన్నం పెడితే కానీ గొల్లవాడు వెళ్లడు. అమ్మవారి కటాక్షం లభిస్తే కానీ నీకు గురూపదేశం దొరకదు. ‘‘అమ్మా అమ్మా! నీ కటాక్షం ఎందుకు లభించలేదు?’’ అంటే.. ‘‘ఇంకో భక్తుడు వెర్రి తాపత్రయం పడుతున్నాడు అక్కడికి వెళ్లాను’’ అంది. అమ్మ ఆకలితో ఏడ్చే పిల్లాడి కన్నా ముందు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియని పిల్లాడి దగ్గరికే వెళుతుంది. తల్లిని కరిగించేంత ఏడిస్తేనే అమ్మవారి కటాక్షం లభిస్తుంది. ఇప్పుడు కథలో... ‘‘ఓ భక్తుడా భక్తుడా! నీకు ఎందుకు అంత వెర్రి తాపత్రయం?’’ అని అడిగితే ‘‘సంసారమనే చీమ కుట్టింది’’ అన్నాడు. చివరగా సంసారం ఏమంటోంది? సంసారమంటే బంగారు పుట్ట కాదు, మట్టి పుట్ట. కథలో  ప్రకారం ‘‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?’’ అంది చీమ. నువ్వు జీవితం, సంసారమనే పుట్టలో వేలు పెట్టావు.  పుట్టలో వేలుపెడితే నెమ్మదిగా బయటకు తీసుకోవాలి. అలా కాకుండా ఇంకో వేలు పెట్టి, అదీ కాదని చేయి మొత్తం పెట్టి కెలక్కూడదు. అంటే ‘ఓవర్‌ యాక్షన్‌’ చేయకూడదు. జీవితంలో అతి వద్దు. మన మనస్సు ఎండాలంటే ఈ ‘అజ్ఞానం... అనే గడ్డిమేట గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి.

-గరికిపాటి నరసింహారావు



Updated Date - 2020-05-29T03:44:34+05:30 IST