తగ్గుతున్న పరీక్షలు... పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2021-04-13T06:12:53+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సగటు రోజురోజుకూ పెరుగుతోంది.

తగ్గుతున్న పరీక్షలు... పెరుగుతున్న కేసులు

ప్రతి వంద మందిలో 13.21ు శాతం మందికి పాజిటివ్‌

ఈ నెల ప్రారంభంలో 9శాతం 

వైద్యులు, అధికారుల ఆందోళన

పరీక్షల సంఖ్యను భారీగా పెంచడం ద్వారానే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


జిల్లాలో కరోనా కేసుల సగటు రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో వందకు నాలుగైదు శాతం ఉండగా, ప్రస్తుతం 13 శాతానికి చేరింది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభం నుంచి శరవేగంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ నెల ఎనిమిదో తేదీన 3,192 మందికి పరీక్షలు నిర్వహించగా 290 మంది (9.08 శాతం), తొమ్మిదో తేదీన 4,478 మందికి పరీక్షలు నిర్వహించగా 344 (7.68 శాతం), పదో తేదీన 4,188 మందికి పరీక్షలు నిర్వహించగా 391 (9.33 శాతం), 11న  3,600 మందికి పరీక్షలు చేయగా 405 (9.67 శాతం), 12న 3,056 మందికి పరీక్షించగా గరిష్ట స్థాయిలో 404 మంది (13.21 శాతం)కి పాజిటివ్‌ వచ్చింది.  పాజిటివ్‌ల శాతం పెరగడం ఆందోళకరమని వైద్యులు, అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా మరింత అప్రమ్తతంగా ఉండాలని చెబుతున్నారు. 


తగ్గిన పరీక్షలు


ఒకపక్క రోజువారీ నమోదయ్యే కేసులు పెరుగుతుంటే..మరోపక్క రోజువారీ పరీక్షల సంఖ్య భారీగా తగ్గింది. గతంలో ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది వేల మందికి జిల్లాలో పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం నాలుగు వేల లోపే పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితులను సకాలంలో గుర్తించాలంటే పరీక్షల సంఖ్యను పెంచాలని, లేదంటే మరింత మంది వైరస్‌ బారినపడే ప్రమాదం వున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉందంటున్నారు.


హై రిస్క్‌ గ్రూపులో ఉన్న వారికి ప్రాధాన్యం


ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల్లో సింహ భాగం హైరిస్క్‌ జాబితాలో వున్న 31 వర్గాలకు ప్రాధాన్యం ఇుస్తున్నారు. అంటే, ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, చదివే విద్యార్థులు, సిబ్బంది వంటి వివిధ కేటగిరీలకు చెందిన సిబ్బందికి రోజువారీ పరీక్షలను ఎక్కువగా నిర్వహిస్తున్నారు. వైరస్‌ బారినపడేందుకు ఎక్కువ అవకాశమున్న వారికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మిగిలిన వారికి వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చునని, అందువల్లే ఈ ఫార్ములాను పాటిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించి, సకాలంలో ఫలితాలు ఇవ్వలేకపోవడం వల్ల ఇబ్బందే తప్ప ప్రయోజనం ఉండదంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 95 శాతం ఆర్టీపీసీఆర్‌, ఐదు శాతం  ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైన సర్జరీలు చేయాల్సిన సమయంలో మాత్రమే యాంటీ జెన్‌ చేస్తున్నారు. 


పరీక్షల కోసం పాట్లు


జిల్లా అధికారులు పరీక్షల సంఖ్యను భారీగా తగ్గించడంతో..కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతూ పరీక్ష చేయించుకోవాలను వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికి వెళుతున్నా...కిట్లు లేవన్న సమాధానం చాలామందికి వినిపిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ప్రైవేటు ఆస్పత్రులలో పరీక్షలు చేయించుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు. 


వరుసగా రెండో రోజూ 404 కేసులు నమోదు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 400కుపైబడి కేసులు నమోదయ్యాయి. సోమవారం 404 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 65,674కు చేరింది. ఇందులో 62,269 మంది కోలుకున్నారు. మరో 2,846 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ సోమవారం ఒకరు మృతిచెందారు. దీంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 559కు చేరింది. పద్మనాభం మండలం రేవిడి పీహెచ్‌సీ పరిధిలో 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఏనుగులపాలెం గ్రామానికి చెందినవారు 15 మంది ఉన్నారు. 


విమ్స్‌లో వ్యాక్సిన్‌ నిల్‌


విమ్స్‌లో వ్యాక్సిన్‌ పూర్తిగా నిండుకుందని విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యవరప్రసాద్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ఈ నెల 15 నుంచి తిరిగి వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందన్నారు. విమ్స్‌లో కొవిడ్‌ బాధితుల కోసం 100 పడకలు సిద్ధం చేశామన్నారు.  

Updated Date - 2021-04-13T06:12:53+05:30 IST