‘పట్టు’ పోతోంది!

ABN , First Publish Date - 2022-05-03T05:24:11+05:30 IST

మల్బరీ సాగుపై పట్టు తగ్గుతోంది. రోజురోజుకూ మల్బరీ సాగుపై రైతులకు ఆసక్తి పోతోంది.

‘పట్టు’ పోతోంది!
కమ్మదనం నర్సరీలో సాగవుతున్న మల్బరీ తోట

  • తగ్గుతున్న మల్బరీ సాగు విస్తీర్ణం 
  • రైతులకు అవగాహన కల్పించే వారు కరువు
  • సెరికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో కొత్త నియామకాలు లేవు
  • పెండింగ్‌లో రూ.7.50 కోట్ల ఇన్‌సెంటివ్‌


మల్బరీ సాగుపై పట్టు తగ్గుతోంది. రోజురోజుకూ మల్బరీ సాగుపై రైతులకు ఆసక్తి పోతోంది. ఒకప్పుడు జిల్లాలో వేల ఎకరాల్లో సాగయ్యే మల్బరీ.. నేడు అతి తక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. రైతులకు సరైన ప్రోత్సాహం లేక మల్బరీ సాగు నిరాదరణకు గురవుతున్నది. నాడు అధికారులు, సిబ్బంది, కూలీలతో కళకళలాడిన మల్బరీ ఫామ్‌లు.. నేడు వెలవెలబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందించకే మల్బరీ పంట సాగుకు దూరమవుతున్నామని రైతులు చెబుతున్నారు.


షాద్‌నగర్‌రూరల్‌, మే 2 : షాద్‌నగర్‌ నియోజకవర్గంలో మల్బరీ తోటల సాగు ఆశాజనకంగా లేదు. ఏటేటా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. పంట దిగుబడి, లాభ నష్టాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేవారు లేక మల్బరీ సాగుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో మల్బరీ పంటను సాగు చేసేవారు. ప్రస్తుతం ఎవరైనా సాగు చేస్తారా..? అని ఎదురుచూడాల్సి వస్తుంది. ఉద్యానవన శాఖలో విలీనం చేసిన తర్వాత సేరికల్చర్‌ నిరాధరణకు గురైందని పలువురు చర్చించుకుంటున్నారు. వ్యవసాయశాఖలో ఏఈ కింద విస్తరణ అధికారులు ఉన్నారు. కానీ సెరికల్చర్‌లో విస్తరణ అధికారులు లేకపోవడం పట్టు సాగు నిరాదరణకు గురవుతోంది.


జిల్లాలో 250 ఎకరాలు

గతంలో వందల ఎకరాల్లో సాగయ్యే మల్బరీ తోటలు.. నేడు రెండు వందలలోపు ఎకరాలకు పడిపోయింది. జిల్లాలో 250 ఎకరాలు సాగవుతుండగా షాద్‌నగర్‌ డివిజన్‌లోనే 40మంది రైతులు 130 ఎకరాలు వరకు సాగు చేస్తున్నారు. ఒకప్పుడు రైతులు మల్బరీ తోటలు సాగుచేస్తే అసిస్టెంట్లు సదరు రైతు వద్దకు వెళ్లి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేవారు. అంతేగాకుండా గుడ్ల నుంచి పంట చేతికొచ్చేవరకు అక్కడే ఉండి మెళకువలు నేర్పించేవారు. సిబ్బంది కొరత కారణంగా రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో చాలామంది రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపడం లేదు. 


పెండింగ్‌లో రూ.7.50 కోట్ల ఇన్‌సెంటివ్‌

మల్బరీ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో కిలోకు రూ.50 ఇన్‌సెంటివ్‌ ఇచ్చేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పట్లో మంత్రి హరీ్‌షరావును కలిసి పట్టుకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరారు. దీంతో ఆయన కిలోకు రూ.75 ఇన్‌సెంటివ్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా ఆరు నెలలపాటు ఇచ్చారు. తర్వాత ఇవ్వడం ఆపేశారు. 15రోజుల కింద ఫరూఖ్‌నగర్‌ మండలం కొండన్నగూడ గ్రామశివారులో ఉమ్మడి రాష్ట్ర మల్బరీ రైతుల సమావేశం జరిగింది. ఇన్‌సెంటివ్‌ ఆరు నెలలు ఇచ్చి నిలిపి వేశారని ఆ సమావేశంలో రైతులు ఆందోళన చేశారు. అనంతరం వారం రోజులకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మల్బరీ రైతులకు పెండింగ్‌లో ఉన్న ఇన్‌సెంటివ్‌ ఇవ్వాలని కోరారు. హుజూరాబాద్‌లో ఉపఎన్నికల సమయంలో ఆ ప్రాంత మల్బరీ రైతులకు ఇన్‌సెంటివ్‌ ఇచ్చారు. కానీ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని రైతులకు ఇవ్వలేదు.


షెడ్ల నిర్మాణానికి దక్కని రాష్ట్రం వాటా

పట్టు పురుగుల పెంపకం కోసం నిర్మించే షెడ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన రాష్ట్రం వాటా అందడం లేదు. షెడ్డు నిర్మాణానికి రూ. 4 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో రూ.2 లక్షలు కేంద్ర ప్రభుత్వం, లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, లక్ష రూపాయలు రైతు వాటాగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు చెల్లిస్తున్నా.. రాష్ట్ర వాటా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 20 మంది వరకు రైతులు షెడ్లు నిర్మించుకుని రాష్ట్ర వాటా కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు కూడా షెడ్డు నిర్మాణం సమయంలో రాష్ట్రం వాటా రాకున్నా షెడ్డు నిర్మాణం పూర్తి చేసుకుంటామని ఒప్పందం చేయించుకుంటున్నారు. 2014 నుంచి రాష్ట్ర వాటా రావడం లేదని పలువురు రైతులు చెబుతున్నారు. 


శిథిలావస్థలో భవనాలు

ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడ, కమ్మదనం మల్బరీ వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించిన అధునాతన భవనాలు ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత లింగారెడ్డిగూడలో ఉన్న ఏడీ కార్యాలయాన్ని మహబూబ్‌నగర్‌కు తరలించారు. తర్వాత కార్యాలయాలు మూతపడ్డాయి. లింగారెడ్డిగూడలో ఓ భవనాన్ని ఆర్‌డీఓ కార్యాలయం కోసం వినియోగించుకుంటున్నారు. 


2014 నుంచి నియామకాలు లేవు

సెరికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో 2014 నుంచి ఉద్యోగ నియామకాలు లేవు. పదవీ విరమణ చేయగా మిగిలిన ఉద్యోగులతోనే ఆ శాఖను నెట్టుకొస్తున్నారు. షాద్‌నగర్‌ డివిజన్‌లో రెండు మల్బరీ విత్తన క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి లింగారెడ్డిగూడలో ఉండగా, మరొకటి కమ్మదనంలో ఉంది. వీటికి ఒక సెరికల్చర్‌ ఆఫీసర్‌, ఇద్దరు అసిస్టెంట్‌లు ఉండాలి. కానీ ఒక్క అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాత్రమే ఉన్నారు. ఇతనే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. రైతుల ఎంపిక నుంచి వారికి అవగాహన కల్పించే వరకు అన్ని పనులు ఆయన ఒక్కరే చేయాల్సి వస్తుంది. గతంలో షాద్‌నగర్‌ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో మల్బరీ పంట సాగయ్యేది. దీంతో పట్టణంలోని కేశంపేట రోడ్డులో రీలింగ్‌ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేకంగా అధికారి ఉండేవారు. ప్రస్తుతం రీలింగ్‌ యూనిట్‌ అధికారి ప్రమోషన్‌పై వెళ్లడంతో వికారాబాద్‌లో పని చేసేవారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మల్బరీ విత్తన క్షేత్రాల్లో దినసరి కూలీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.


మల్బరీ రైతులకు ప్రోత్సాహం అందించాలి

సకాలం సరైన విధంగా మల్బరీ పంటను సాగు చేస్తే లాభాలు బాగుంటాయి. ప్రభుత్వం సరైన విధంగా ప్రోత్సాహం అందించాలి. పెండింగ్‌లో ఉన్న ఇన్‌సెంటివ్‌లు వెంటనే చెల్లించేందుకు కృషి చేయాలి. మల్బరీ సాగుపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. 

- వెంకట్‌రెడ్డి, మల్బరీ రైతు కొండన్నగూడ


అవగాహన కల్పిస్తున్నాం

మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సిబ్బంది లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినా తమ వంతు కృషి చేస్తున్నాం.

- ముత్యాలు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌- షాద్‌నగర్‌



Read more