అందని అంచనాలు

ABN , First Publish Date - 2020-10-20T05:46:14+05:30 IST

మహారాష్ట్రలోని భీమా నది నుంచి వస్తుందన్న వరదపై అంచనాలు తలకిందులవుతున్నాయి.

అందని అంచనాలు

జూరాలకు తగ్గుతున్న వరద


గద్వాల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : మహారాష్ట్రలోని భీమా నది నుంచి వస్తుందన్న వరదపై అంచనాలు తలకిందులవుతున్నాయి. దాదాపు ఎనిమిది లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తుందని శనివారం సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) పంపించిన సమాచారంతో, జూరాలకు భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతుందని ప్రాజెక్టు అధికారులు అంచనాలు వేశారు. ఈ మేరకు అప్రమత్తమై మూడు రోజులుగా ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. కానీ, ఇంత వరకు వరద రాలేదు. శని, ఆదివారాల్లో వచ్చిన వరదలకంటే సోమవారం మరింత తగ్గి 3.85 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. అయితే, 250 కిలోమీటర్ల దూరం నుంచి వరద ఇంత వరకు రాపోవడం ఏమిటనే అనే విషయంపై అధికారులు అరా తీస్తున్నారు. వరద నీరు వస్తుందని జూరాలలో ఉన్న నీటిని మొత్తానికి మొత్తంగా శ్రీశైలానికి వదిలారు. ప్రాజెక్టు నిండటం సమస్య కాకపోయినా, వరద ఎందుకు రాలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


వరద తగ్గుముఖం

వారం రోజలుగా జూరాల ప్రాజెక్టుకు నాలుగు లక్షల నుంచి దాదాపు ఐదు లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. సోమవారం మాత్రం 3.85 లక్షలకు పడిపోయింది. 49 గేట్ల నుంచి నీటి విడుదల చేయగా, సోమవారం 20 గేట్లకు తగ్గించారు. నారాయణపూర్‌ నుంచి లక్ష క్యూసెక్కులు, భీమా నుంచి 2.85 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోందని ప్రాజెక్టు ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు కూడా వరద తగ్గుముఖం పట్టడంతో భీమా నుంచి మాత్రమే 2.85 లక్షల క్యూసెక్కుల వరద జూరాలకు చేరుతోంది.

Updated Date - 2020-10-20T05:46:14+05:30 IST