మామిడీలా

ABN , First Publish Date - 2021-05-05T05:19:04+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది మామిడి రైతును అటు వాతావరణంతో పాటు, ఇటు కరోనా దెబ్బతీశాయి. సకాలంలో వర్షాలు లేకపోవడంతో పాటు, మంచు కారణంగా మామిడి దిగుబడి ఈ ఏడాది సగానికి తగ్గిపోయింది.

మామిడీలా
కాపు పెద్దగా లేని మామిడి తోటలు

వాతావరణం అనుకూలించకపోవడంతో తగ్గిన దిగుబడి

కరోనా కారణంగా...ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో పడిపోయిన ధర

స్థానిక మార్కెట్లపైనే ఆధారం

అమ్మకాలు నిరాశాజనకం

రైతులకు నష్టం


చోడవరం, మే 3: జిల్లాలో ఈ ఏడాది మామిడి రైతును అటు వాతావరణంతో పాటు, ఇటు కరోనా దెబ్బతీశాయి. సకాలంలో వర్షాలు లేకపోవడంతో పాటు, మంచు కారణంగా మామిడి దిగుబడి ఈ ఏడాది సగానికి తగ్గిపోయింది. తీరా కాపుకొచ్చిన తరువాత, కరోనా కారణంగా ఎగుమతులు లేకపోవడంతో ధర పడిపోయింది. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా జిల్లాలో మామిడి దిగుబడి అంత ఆశాజనకంగా ఏమీ లేదు. జిల్లాలో 35,625 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అంతా బాగుంటే లక్షా 50 వేల టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది వాతావరణం మామిడి రైతుకు కలిసిరాలేదు. నవంబరు, డిసెంబరు నెలల్లో రావలసిన పూత చాలా ఆలస్యం అయ్యింది. ఆ తరువాత పూత వచ్చినప్పటికీ, ఆ సమయంలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కాయ కట్టకుండానే రాలిపోయింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సైతం కొనసాగిన మంచు కూడా పూత రాలిపోవడానికి కారణం అయిందని రైతులు అంటున్నారు. మొత్తం మీద వర్షాభావ పరిస్థితులు, పూత ఆలస్యంగా రావడం, వచ్చిన పూత నిలబడకపోవడం దిగుబడి పడిపోవడానికి కారణమని రైతులు అంటున్నారు.


తగ్గిపోనున్న దిగుబడి

జిల్లాలో ఎలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నం, అడ్డూరు తదితర ప్రాంతాల్లో భారీగా మామిడి తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఏటా వివిధ రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అవుతుంటుంది. వాతావరణం అనుకూలిస్తే హెక్టారు మామిడి తోటకు 10 నుంచి 12 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది దిగుబడి సగానికి పడిపోయిందని అంటున్నారు. జిల్లాలో లక్షా 50 వేల టన్నుల మామిడి దిగుబడి రావాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తే కనీసం 70 నుంచి 80 వేల టన్నులు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.


తగ్గిన ధర

మార్కెట్‌లో వారం క్రితం వరకూ టన్ను రూ.40 వేలు పలికిన మామిడి ధర, ప్రస్తుతం 20 వేలకు పడిపోయిందని వ్యాపారులు అంటున్నారు. సీజన్‌ ప్రారంభంలోనే ధర తగ్గడానికి కారణం ఎగుమతులు నిలిచిపోవడమేనని అంటున్నారు. జిల్లా నుంచి ఏటా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అవుతుంటుంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా మార్కెట్‌లు మూతపడడం, ఒడిశాలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలలో సైతం కరోనా వల్ల ప్రజలు స్వేచ్ఛగా మార్కెట్‌కు వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో మామిడికి గిరాకీ తగ్గిపోయింది. ఇదే సమయంలో లోకల్‌ మార్కెట్లయిన అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం ప్రాంతాల్లో సైతం అమ్మకాలు పెద్దగా లేకపోవడం ధర పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది స్థానికంగానే విక్రయించుకోవలసిన పరిస్థితి నెలకొనడంతో మామిడి ధర పతనం కొనసాగుతుందని ఈ పరిమాణం రైతులకు, తోటలు లీజుకు తీసుకున్న వ్యాపారులకు కోలుకోలేని దెబ్బగా చెబుతున్నారు.



నేటి నుంచి బెల్లం మార్కెట్‌ బంద్‌

అనకాపల్లి టౌన్‌, మే 4: అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో బుధవారం నుంచి బెల్లం లావాదేవీలు నిలిపివేస్తున్నట్టు వర్తక సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) తెలిపారు. కరోనా కారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి వుంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్‌సీజన్‌ అయినప్పటికీ జిల్లా నలుమూలల నుంచీ ప్రతిరోజూ రైతులు సుమారు 5 నుంచి 6 వేల బెల్లం దిమ్మలు మార్కెట్‌కు తీసుకువస్తున్నారని, దూరప్రాంతాల నుంచి వారు బెల్లం తీసుకువచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలు దాటిపోతుందని, యార్డుకు వచ్చిన బెల్లాన్ని రంగుల వారీగా పేర్చి వేలం వేసేందుకు సమయం చాలదని, ఈ నేపథ్యంలో మార్కెట్‌లో లావాదేవీలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి యార్డుకు బెల్లం తీసుకురావద్దని కోరారు. 


Updated Date - 2021-05-05T05:19:04+05:30 IST