ఇసుక మేటలు

ABN , First Publish Date - 2022-05-06T06:41:31+05:30 IST

కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ భాగాన పూడిక పెరుగుతోందా?

ఇసుక మేటలు
కృష్ణానదిలో డ్రెడ్జింగ్‌ పనులు

కృష్ణానదిలో తగ్గిన నీటి సామర్థ్యం 

బ్యారేజ్‌ సామర్థ్యం 3.07 టీఎంసీలు

పూడికతో తగ్గిపోయిన 0.04 టీఎంసీలు

కొనసాగుతున్న డ్రెడ్జింగ్‌

5 లక్షల మెట్రిక్‌ టన్నుల పూడికతీత

మరోసారి బ్యాథమెటికల్‌ సర్వే


కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ భాగాన పూడిక పెరుగుతోందా? దీని కారణంగా బ్యారేజ్‌ వద్ద నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందా? అంటే జలవనరుల శాఖ అధికారులు అవుననే అంగీకరిస్తున్నారు. కృష్ణా నీటి విషయంలో ఇప్పటికే వివాదాల సుడులు తిరుగుతుండగా, బ్యారేజ్‌ వద్ద నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవిలో కొంత నీరు ఆవిరై పోతుంది. ఇది కాకుండా ఎగువ భాగంలో పూడిక పేరుకు పోవడంతో నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతోంది. దీంతో నదిలో పూడికతీత పనులను మొదలుపెట్టారు.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : కృష్ణానదిపై 1957లో ప్రకాశం బ్యారేజ్‌ని నిర్మించారు. దీని నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలు. నీటిని ఉంచాల్సిన మట్టం 12 అడుగులు. అది 12 అడుగులు దాటినప్పుడు అదనపు నీటిని దిగువకు విడుదలు చేస్తారు. భారీగా వరదలు వచ్చినప్పుడు దాదాపు అన్ని గేట్ల ద్వారా నీటిని సముద్రంలోకి వదులుతారు. వరదలు లేనప్పుడు గేట్లు కిందికి దించి ఉంచుతారు. కాలం ఏదైనప్పటికీ బ్యారేజ్‌ వద్ద 3.07 టీఎంసీల నీరు కచ్చితంగా నిల్వ ఉండాలి. ఇప్పుడు ఆ సామర్థ్యం తగ్గింది. 3.07 టీఎంసీల్లో 0.04 టీఎంసీల నీరు తగ్గినట్టు అధికారులు గుర్తించారు. కొద్దినెలల క్రితం నిర్వహించిన బ్యాథమెటికల్‌ సర్వేలో ఈ విషయం నిర్ధారణ అయింది. బ్యారేజ్‌కి ఎగువన 16 కిలోమీటర్ల వరకు ఈ బ్యాథమెటికల్‌ సర్వేను చేయించారు. ఈ సర్వే ప్రకారం గుర్తించిన ప్రదేశాల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని వెంకటపాలెం, ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద నదీ ప్రాంతాల్లో డ్రెడ్జింగ్‌ జరుగుతోంది. బ్యారేజ్‌ గేట్ల వద్ద పూడిక భారీగా పేరుకు పోయినప్పటికీ దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో తీయడం కష్టమని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి బ్యారేజ్‌కు 500 మీటర్లకు దూరంలో ఎలాంటి డ్రెడ్జింగ్‌ పనులు నిర్వహించకూడదు. దీనివల్ల బ్యారేజ్‌ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ నిబంధనకు లోబడే పూడికతీత పనులు చేస్తున్నారు. 


సర్వే ఇలా..

నదులు, సముద్రంలో బ్యాథమెటికల్‌ సర్వేలు చేయడానికి ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నాయి. ఈ ఏజెన్సీల ఇంజనీర్లు ప్రత్యేక పడవలపై నదిలో తిరుగుతారు. ఇందులో అలా్ట్రసౌండ్‌ పరికరం ఉంటుంది. దాన్ని ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తారు. ఏడు శాటిలైట్లకు ఈ అలా్ట్రసౌండ్‌ పరికరాన్ని అనుసంధానం చేస్తారు. దాని ద్వారా ధ్వని తరంగాలను నదీగర్భంలోకి పంపుతారు. ఇలా నదీగర్భంలోకి వెళ్లిన తరంగాలు అడుగున ఉన్న పూడిక మేటలను ఢీకొని తిరిగి పైకి వస్తాయి. ఈ గ్రాఫ్‌ మొత్తం ల్యాప్‌టాప్‌లో కనిపిస్తుంది. ధ్వని తరంగాలు పైకి వచ్చిన ప్రదేశంలో ఎంత పరిమాణంలో ఇనుక, పూడిక మేటలు ఉన్నాయో గ్రాఫ్‌లో గుర్తించి, ఆయా ప్రదేశాల్లో డ్రెడ్జింగ్‌ చేస్తారు. వరదల వల్ల నది స్వరూపం ఏ దిశ నుంచి ఏ దిశకు ఎలా మారుతుందో ఇందులోనే తెలుసుకుంటారు. జలాశయాల లోతు, అంతర్భాగ పరిస్థితులను అధ్యయనం చేసేదే బాథిమెటికల్‌ సర్వే. సముద్ర గర్భాల్లోనూ ఈ సర్వేను నిర్వహిస్తారు. నౌకల గమనానికి అవరోధాలు ఉన్నా, ఈ సర్వే ద్వారానే గుర్తించి నౌకాయాన మార్గాన్ని నిర్దేశిస్తారు. 


5 లక్షల మెట్రిక్‌ టన్నుల పూడికతీత

కృష్ణానదిలో బ్యాథమెటికల్‌ సర్వే 16 కిలోమీటర్ల వరకు జరిగినా, పూడికతీత మాత్రం వెంకటాయపాలెం, ఫెర్రీ ప్రదేశాల్లో సాగుతోంది. ఇప్పటివరకు బ్యారేజ్‌కి ఎగువ భాగం నుంచి మొత్తం ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల పూడికను తీసినట్టు అధికారులు చెబుతున్నారు. పూడికతీత ద్వారా వచ్చిన ఇసుకను భూగర్భ, గనుల శాఖకు అప్పగిస్తున్నారు. ఈ ఇసుక విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ శాఖ జలవనరుల శాఖకు చెల్లిస్తుంది. బ్యారేజ్‌కి ఎగువన గుంటూరు జిల్లాలో లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లో డీసిల్టేషన్‌ కేంద్రాలు ఉన్నాయి. లింగాయపాలెం కేంద్రం 12.800 కిలోమీటరు వద్ద, రాయపూడి కేంద్రం 13.200 కిలోమీటరు వద్ద కృష్ణా కుడి కరకట్ట వైపున ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పూడికతీత జరిగితే ఇంకా భారీగా ఇసుక మేటలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ పనులు కొద్దిరోజులపాటు జరుగుతాయి. ఆ తర్వాత మరోసారి బ్యాథమెటికల్‌ సర్వే చేయిస్తారు. అప్పుడు బ్యారేజ్‌ వద్ద నీటి నిల్వను పరీక్షిస్తారు. పూర్తిస్థాయి సామర్థ్యం 3.07 టీఎంసీలు ఉంటే డ్రెడ్జింగ్‌ను ఆపేస్తారు. లేనిపక్షంలో మరోసారి డ్రెడ్జింగ్‌ చేయిస్తారు. 

Read more