తగ్గుముఖం పట్టిన పేదరికం

ABN , First Publish Date - 2022-04-19T06:52:18+05:30 IST

‘పేదరికాన్ని నిర్మూలించాలంటే పేదలను బలోపేతం చేయాలి’ అన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధానం. పేదలకు సాధికారత కల్పించడం, వారి కనీస అవసరాలు తీర్చడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి చేరేలా చేయడం...

తగ్గుముఖం పట్టిన పేదరికం

‘పేదరికాన్ని నిర్మూలించాలంటే పేదలను బలోపేతం చేయాలి’ అన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధానం. పేదలకు సాధికారత కల్పించడం, వారి కనీస అవసరాలు తీర్చడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి చేరేలా చేయడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలమని ఆయన సునిశ్చితాభిప్రాయం. కొద్దిరోజుల క్రితం దుబాయిలో జరిగిన ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ సదస్సు’లో మోదీ మాట్లాడుతూ తాను కటిక పేదరికం నుంచి ప్రధానమంత్రి స్థాయికి వచ్చిన విషయాన్ని వెల్లడించారు. ‘నేను పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడిని కాదు. పుస్తకాల్లో పేదరికం గురించి చదివి తెలుసుకున్నవాడిని కాను. పేదరికాన్ని అనుభవిస్తూ జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కి వచ్చినవాడిని, రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై చాయ్ అమ్ముతూ ఎదిగినవాడిని’ అని ఆయన చెప్పారు. అంతేకాదు, ‘కొద్ది రోజుల్లో భారతదేశం పేదరికాన్ని నిర్మూలించడంలో విజయం సాధించి తీరుతుంది, పేదలకు సాధికారత కల్పించడం ద్వారా పేదరికంపై పోరాడాలనుకున్న వ్యక్తిని’ అని మోదీ అన్నారు. ఒక పేదవాడికి తానే తన పేదరికాన్ని అంతం చేసుకోగలనని తెలిస్తే ఎలా ఉంటుంది? ఎవరినీ యాచించనవసరం లేకుండా సమాజంలో గౌరవంగా బతికేందుకు వీలైన పరిస్థితులు కల్పించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించలేమా? అని ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలినాళ్లలోనే మోదీ తనను తాను ప్రశ్నించుకున్నారు. అందుకు అనుగుణంగానే పథకాలు రూపొందించారు. ‘భారతదేశంలో మార్పు వస్తే మొత్తం ప్రపంచంలో పేదరికం అంకెలు మారిపోతాయి’ అని మోదీ ఆనాడే అన్నారు.


ప్రధాని చెప్పిన విధంగానే భారతదేశంలో మార్పు అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించిన గణాంక వివరాల్లో ప్రతిఫలించడం ప్రారంభమైంది, భారత్‌లో కటిక దరిద్రమనేది పూర్తిగా తొలగిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. వినియోగం విషయంలో పేదలకూ, ధనికులకూ మధ్య ఉన్న వ్యత్యాసం కూడా గత 40 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి చేరుకున్నదని ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం 2019 నాటికి 10.2 శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు విధాన పరిశోధన పత్రం కూడా వెల్లడించింది. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం తీవ్రంగా తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు చెప్పింది. 2011లో గ్రామీణ పేదరికం 26.3 శాతం కాగా, అది 2019 నాటికి 11.6 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో పేదరికం 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది.


మోదీ చేపట్టిన విధానాలు దేశంలో మౌలిక స్థాయినుంచి మార్పులకు దారితీస్తున్నాయని ఈ గణాంక వివరాలు చెబుతున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం మోదీ హయాంలో చిన్న భూకమతాలు ఉన్న రైతులకు అత్యధిక ఆదాయం లభిస్తోంది. సన్నకారు రైతుల వార్షిక ఆదాయం 10 శాతం మేరకు పెరిగిందని, 2013లోనూ, 2019లోనూ రెండుసార్లు తాము చేసిన సర్వే ప్రకారం తేలిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. మరోవైపు కరోనా మహమ్మారి కాలంలో భారతదేశంలో కటిక దరిద్రం తాండవించకుండా ఉండేందుకు ప్రధాన కారణం ఆహార భద్రతా ప్రాజెక్టు ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ అని ఐఎంఎఫ్ ప్రకటించింది. అటు చిన్న రైతులు, ఇటు పేదలు కడగండ్ల పాలు కాకుండా చూడడమే కర్తవ్యంగా మోదీ సర్కార్ పనిచేస్తున్నదని దీన్ని బట్టి అర్థమవుతుంది.


ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ఇప్పటి వరకూ ఆరు దశలుగా అమలయింది. 1003 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసింది. దేశంలో వలస కార్మికులు ఎక్కడకు వెళ్లినా అక్కడ రేషన్ తీసుకునే సదుపాయం కూడా మోదీ ప్రభుత్వం కల్పించింది. ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డు’ క్రింద దేశంలో 5 లక్షల రేషన్ షాపుల్లో ఎక్కడైనా శ్రమజీవులు ఉచితంగా తమ రేషన్ తీసుకోవచ్చు. దాదాపు 61 కోట్ల మేరకు ఈ రకంగా వేర్వేరు రేషన్ షాపుల్లో వారు ఆహార ధాన్యాలను స్వీకరించినట్లు గణాంక వివరాలు చెబుతున్నాయి. దేశంలో 80 కోట్లమందికి పైగా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారు. దాదాపు రూ. 70 వేల కోట్ల మేరకు ఇందుకు ప్రభుత్వం ఖర్చు చేసింది.


ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలే కాదు, ఆక్స్‌ఫామ్ సంస్థ, యుఎన్‌డిపి కలిసి నిర్వహించే బహుముఖీన పేదరిక నివేదిక కూడా ప్రతి ఏడాదీ కోట్లాది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందుతున్నట్లు చెబుతోంది. పేదరికం నుంచి విముక్తి లభించాలంటే, ఆహార ధాన్యాలు అందించడం మాత్రం ఒక్కటే మోదీ ప్రభుత్వం చేయలేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, అందుకోసం స్వచ్ఛమైన వంట గ్యాస్, పారిశుధ్య పథకాలు, త్రాగునీటి సౌకర్యం, తక్కువ ధరలకు ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా, పక్కా ఇళ్లు నిర్మించడం విధానాలు చేపట్టాలని మోదీ ప్రభుత్వం భావించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్, జన్ ధన్ యోజన, గ్రామీణ సడక్ యోజన, జలజీవన్ మిషన్, సౌభాగ్య వంటి పథకాల మాత్రమే కాదు, ఆయుష్మాన్ యోజన, జనఔషధి యోజన ద్వారా వైద్య చికిత్స అందుబాటులో తీసుకు రావడం కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ పథకాలన్నీ కోట్లాది మంది దేశ ప్రజలకు ఏదో రకమైన ప్రయోజనం అందించేందుకు ఉద్దేశించినవే, ఉదాహరణకు 50 కోట్లమందికి ఉచిత ఆరోగ్య సంరక్షణ లభిస్తోంది. 45 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాల ద్వారా నిధులు బదిలీ అవుతున్నాయి. వీరిలో సగం మంది మహిళలే. రూ.60వేల కోట్లతో కోట్లాది మందికి పక్కా ఇళ్లను నిర్మిస్తున్నారు. 30 కోట్ల మంది లబ్ధిదారులకు ఉజ్వల పథకం క్రింద స్వచ్ఛమైన వంట గ్యాసు లభిస్తోంది. ఆవాస యోజన క్రింద 3 కోట్లకు పైగా ఇళ్లను నిర్మిస్తున్నారు. రూ. 60వేల కోట్ల వ్యయంతో 7,82,530 కిమీ మేరకు గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన క్రింద 3లక్షల కోట్లకు పైగా స్వయం సహాయ బృందాలకు రుణాలు మంజూరు చేశారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పేరిట వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు రూ. 33వేల కోట్ల మేరకు కేటాయించారు. వివిధ సంక్షేమ పథకాల కోసం భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2018–19 నుంచి 2021–22 వరకు దాదాపు రూ.7లక్షల కోట్ల మేరకు కేటాయించడమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలను తెలియజేస్తోంది.


పేదప్రజలు, అణగారిన వర్గాల సంక్షేమం పట్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పూర్తి కర్తవ్యదీక్షతో బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. కనుకనే బిజెపి ఇవాళ దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు పరచడమే కాదు, అవినీతిని నిర్మూలించేందుకు, ఖర్చు పెట్టే ప్రతి పైసా సద్వినియోగం చేసేందుకు సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-04-19T06:52:18+05:30 IST