ఇంటర్‌లోనూ ఉసూరే! అట్టడుగున సీఎం జిల్లా!

ABN , First Publish Date - 2022-06-23T14:17:28+05:30 IST

ఇంటర్మీడియట్‌ పరీక్షలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. పదో తరగతి ఫలితాల్లో దారుణమైన ఉత్తీర్ణతా శాతం రాగా ఇంటర్‌లోనూ అదే పరిస్థితి కనిపించింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 54 శాతం, ద్వితీయ సంవత్సరం 61శాతం మంది..

ఇంటర్‌లోనూ ఉసూరే! అట్టడుగున సీఎం జిల్లా!

తగ్గిన ఉత్తీర్ణతా శాతాలు

మొదటి సంవత్సరం 54శాతం

రెండో ఏడాది ఉత్తీర్ణత 61 శాతం

ఫలితాల్లో బాలికలదే పైచేయి

టాప్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా

అట్టడుగున సీఎం జిల్లా కడప

ఎల్లుండి నుంచి రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు దరఖాస్తులు

ఆగస్టు 3 నుంచి 8 వరకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు

మాల్‌ప్రాక్టీస్‌ లేదు.. అందుకే ఫలితాలు ఇలా: బొత్స


అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. పదో తరగతి ఫలితాల్లో దారుణమైన ఉత్తీర్ణతా శాతం రాగా ఇంటర్‌లోనూ అదే పరిస్థితి కనిపించింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 54 శాతం, ద్వితీయ సంవత్సరం 61శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత ఆరేళ్ల ఫలితాలను విశ్లేషిస్తే ప్రథమ సంవత్సరంలో ఇదే అత్యల్ప ఉత్తీర్ణత కావడం గమనార్హం. ద్వితీయ సంవత్సరంలో 2020 కంటే కేవలం రెండు శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఇక, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ప్రభుత్వం బుధవారం విజయవాడలో విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్య కమిషనర్‌ ఎం. శేషగిరిబాబు వీటిని ప్రకటించారు. అనంతరం, మంత్రి బొత్స ఫలితాల వివరాలను వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ రెండు సంత్సరాలకు కలిపి మొత్తం 8,69,059 మంది పరీక్షలకు హాజరయ్యారని, వీరితో పాటు మరో 72,299 మంది ఒకేషనల్‌ కోర్సుల్లో పరీక్షలు రాశారని తెలిపారు. సంవత్సరాల వారీగా మొదటి ఏడాది 4,45,604 మంది పరీక్షలు రాస్తే వారిలో 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. రెండో సంవత్సరం 4,23,455(54%) మంది పరీక్షలు రాయగా వారిలో 2,58,449(61శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. మొత్తంగా ఒకేషనల్‌తో కలిపి 9,41,358 మంది పరీక్షలు రాస్తే వారిలో 5,00,040 ఉత్తీర్ణులయ్యారు. బాలురు, బాలికల మధ్య వ్యత్యాసం చూస్తే.. ప్రథమ సంవత్సరంలో బాలికలు 60% మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 49% మందే పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 68% మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 54% ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే మొత్తంగా, బాలురు, బాలికలు అన్నిట్లోనూ ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్‌లో ఉంటే, మూడు కేటగిరీల్లో(ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ, వొకేషనల్‌) సీఎం సొంత జిల్లా కడప అట్టడుగున నిలిచింది. కృష్ణా జిల్లా అత్యధిక ఉత్తీర్ణత(72%) సాధించింది. అత్యల్ప ఉత్తీర్ణత కడప(50%) నమోదు చేసింది. అత్యధిక ఉతీర్ణతలో బాలురు, బాలికలు వరుసగా 66శాతం, 72శాతంతో కృష్ణా మొదటి స్థానంలో ఉంది. అత్యల్ప ఉత్తీర్ణతలో బాలురు, బాలికలు వరుసగా కడప 34శాతం, 47శాతంతో ఉంది.


రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌

ఈ నెల 25 నుంచి జూలై 7 వరకు రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనుంది. సప్లిమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా, కడప, విజయనగరం జిల్లాల్లో ఉత్తీర్ణత తక్కువగా ఉండటంపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘‘సీఎం అంటే కడప జిల్లాకే పరిమితం కాదు. నేను విజయనగరం జిల్లాకే విద్యా మంత్రిని కాను. అన్ని జిల్లాలు మెరుగు పడాలని కోరుకుంటాం. వచ్చే ఏడాది ఈ జిల్లాలు కూడా అగ్రస్థానంలోకి వచ్చేలా ప్రయత్నిస్తాం’’ అని చెప్పారు. తక్కువ మంది ఉతీర్ణత సాధించడంపై స్పందిస్తూ మాల్‌ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తే ఉత్తీర్ణత ఎంత శాతం కావాలన్నా వస్తుందని, కానీ అలా చేయలేదని వ్యాఖ్యానించారు. 



Updated Date - 2022-06-23T14:17:28+05:30 IST