బస్సుల్లో తగ్గిపోయిన ఆక్యుపెన్సీ

ABN , First Publish Date - 2021-04-16T07:16:51+05:30 IST

జిల్లాలోని రెండు ఆర్టీసీ బస్సు డిపోలు సెకండ్‌వేవ్‌ కరోనా కారణంగా మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి.

బస్సుల్లో తగ్గిపోయిన ఆక్యుపెన్సీ
తెలంగాణ ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్న మహరాష్ట్ర చెక్‌పోస్టు సిబ్బంది

ప్రయాణానికి వెనకాడుతున్న జనం 

సగానికి పైగా పడిపోయిన ఆదాయం

డిపోకు పరిమితమవుతున్న బస్సులు 

మహారాష్ట్రకు తిరుగుతున్నది జిల్లా నుంచి రెండు బస్సులే 

మళ్లీ తప్పని సంక్షోభం 

ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్తు

నిర్మల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని రెండు ఆర్టీసీ బస్సు డిపోలు సెకండ్‌వేవ్‌ కరోనా కారణంగా మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. ఈ రెండు డిపోల్లో గత పదిరోజుల నుంచి గణనీయంగా ఆదాయం పడిపోతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించేందుకు జనం జంకుతున్నారు. మొన్నటి వరకు రద్దీగా తిరిగిన బస్సులు ప్రస్తుతం జనం లేక వెలవెలబోతున్నాయి. అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఆర్టీసీ ట్రిప్పులను తగ్గించేస్తోంది. కేవలం కొంత మేరకు ఆదాయం ఉన్న రూట్లలో మాత్రమే బస్సులను నడుపుతుండగా ఆదాయం అంతగాలేని రూట్లలో తమ సర్వీసులను తగ్గించేస్తోంది. మొత్తం నిర్మల్‌డిపోలో ఆర్టీసీ సంస్థకు చెందినవి అలాగే ప్రైవేటు బస్సులు 140కి పైగా ఉన్నాయి. ప్రతీరోజూ రూ.19 నుంచి రూ.20 లక్షల వరకు ఈ బస్సుల ద్వారా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం కరోనాతీవ్రత కారణంగా ప్రయాణికులు తగ్గిపోతున్నారు. దీంతో కేవలం రూ.10లక్షల వరకు కూడా ఆదాయం రావడం లేదు. కిలోమీటర్‌కు రూ. 9 వరకు నష్టం వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే భైంసాడిపోలో మొత్తం 87 బస్సులు ఉండగా ఇందులో నుంచి కూడా సగం వరకు బస్సులు తిరగడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్రకు మొన్నటి వరకు నిర్మల్‌ డిపో నుంచి తొమ్మిది బస్సులను నడిపేవారు. మహారాష్ట్రలో పరిస్థితులు తీవ్రమైన కారణంగా ప్రస్తుతం రెండు బస్సులను మాత్రమే నడుపుతున్నారు. అలాగే భైంసా డిపో నుంచి మహారాష్ట్రకు 20కి పైగా బస్సులను నడిపేవారు. ప్రస్తుతం ఒకటి రెండు సర్వీసులు తప్ప సర్వీసులను నడపడం లేదు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా మిగతా చోట్ల కన్నా తీవ్రంగా ఉన్న కారణంగా ఆర్టీసీ అటువైపు తన బస్సులను నిలిపివేసింది. మొదట్లో కరోనా మహారాష్ట్ర అంతా వేగంగా వ్యాపిస్తుండడం, పాజిటివ్‌ కేసుల సంఖ్య విఫరీతంగా పెరిగిపోయినప్పటికీ ఆర్టీసీ అధికారులు ఆదాయం దృష్ట్యా బస్సుల ను యథావిధిగా నడిపారు. దీంతో సరిహద్దుల గుండా జిల్లాలోకి  కరోనా వ్యాపించే అవకాశాలున్నట్లు హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. అయినప్పటికి ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి గట్టెక్కుతున్న ఆర్టీసీని కాపాడేందుకు అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్ర వైపు బస్సులను తిప్పారు. ఈ క్రమంలోనే జిల్లాలో కూడా కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆర్టీసీ తన ఆదాయాన్ని పక్కన పెట్టి రక్షణ మార్గాలను చేపట్టింది. మొత్తానికి మరోసారి కారణంగా ఆర్టీసీ మళ్టీ సంక్షోభంలో చిక్కుకుందంటున్నారు. 

మరోసారి సంక్షోభం దిశగా..

ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలోని రెండు డిపోలు గత ఏడాది క్రితం వరకు మంచి ఆదాయంతో నడిచేవి. ముఖ్యంగా మహారాష్ట్ర వైపే కాకుండా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ లాంటి ప్రాంతాలకు అలాగే పలు గ్రామీ ణ ప్రాంతాలకు బస్సులను నడిపేది. గత మార్చి నెల నుంచి మొదలైన కరోనాసంక్షోభంతో జిల్లాలోని నిర్మల్‌,భైంసా డిపోలు నష్టాలబాట పట్టాయి. అంతకు ముందు జరిగిన సమ్మె కారణంగా నష్టాలతో తిరిగి ప్రస్థానాన్ని ప్రారంభించి లాభాలదిశగా నడుస్తున్న సమయంలో కరోనాసంక్షోభం ఆర్టీసీ అతలాకుతలం చేసింది. ఆ తరువాత తిరిగి కొలుకుంటున్న క్రమంలో మరోసారి సెకండ్‌వేవ్‌ కరోనా ఆర్టీసీని గందరగోళానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆధాయం క్రమంగా తగ్గిపోతుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే కరోనాతీవ్రత మరింత పెరిగిపోతున్న కారణంగా ఈ సంక్షోభం ఎప్పటి వరకు ముగుస్తుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. 

మహారాష్ట్ర వైపు దిగ్బంధం

మహారాష్ట్రలోని అప్పారావుపేట, షివిని, బోకర్‌, నాందేడ్‌, ఔరంగాబాద్‌ తదితర ప్రాంతాలకు జిల్లాలోని రెండు డిపోల నుంచి బస్సులు ఎక్కువగా తిరిగేవి. ముఖ్యంగా భైంసా డిపో నుంచి ప్రతీరోజూ మహారాష్ట్ర వైపు ఎక్కువ గా బస్సులు నడిచేవి. మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రకటిత లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో పా టు మహరాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో అక్కడి ప్రజలు స్వచ్చంద లాక్‌డౌన్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో బస్సుల రాకపోకలను కూడా వారు నిలువరించారు. సరిహద్దుల గుండానే సెకండ్‌వేవ్‌ కరోనావైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నట్లు ప్రచారం మొదలవ్వడంతో జిల్లా వాసులు సైతం మ హారాష్ట్ర వైపు వెళ్ళేందుకు భయపడిపోతున్నారు. గత పదిహేను రో జుల నుంచి జిల్లా నుంచి మహారాష్ట్ర వైపు రాకపోకలు సగానికి పైగా తగ్గిపోయాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయినప్పటికీ అత్యవసరమైన వారు ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగించారు. అయితే యంత్రాంగం సైతం సరిహద్దుల్లో ఎలాంటి చెక్‌పోస్టులను ఏర్పాటు చేయని కారణంగా రాకపోకలకు ఆటంకాలు ఏర్పడలేదు. కాగా మనరాష్ట్రంలోనూ అలాగే జిల్లాలోనూ కరోనా ఒక్కసారి తీవ్రరూపం దాల్చిన కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహారాష్ట్ర వైపు ప్రయాణించేందుకు జనం వెనకాడారు. దీంతో ప్రయాణికులు లేకుండానే కొద్ది రోజుల పాటు బస్సులను నడిపిన అధికారులు ఆ తరువాత తమ సర్వీసులను నిలిపివేశారు. 

జిల్లాలో సగానికి పైగా పడిపోయిన ఆదాయం 

ఆర్టీసీ మరోసారి తన ఆదాయాన్ని భారీగా కోల్పోతోంది. ప్రతిరోజూ రూ. 21 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఇటీవల కరోనా తీవ్రత కారణంగా గత పదిరోజుల నుంచి కేవలం రూ.10 లక్షల రూపాయలకు కూడా ఆదాయం దాటడం లేదు. ఒక కిలోమీటర్‌కు రూ. 33 ఆదా యం సమకూర్చాల్సి ఉండగా కేవలం రూ.25 రూపాయలు కూడా రావడం లేదంటున్నారు. ఒక కిలోమీటర్‌కు రూ.9 నష్టం వస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే భైంసా డిపోలో కూడా ప్రతీరోజూ రూ.10 లక్షల ఆదాయం వచ్చేది. అలాంటిది గత వారం రోజుల నుంచి ఆదాయం రూ. 5లక్షల వరకు కూడా మించడం లేదంటున్నారు. క్రమంగా కరోనా విస్తరిస్తుండడం, జనం ఇళ్లకే ఎక్కువగా పరిమితమవుతూ తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. క్రమంగా నష్టాల నుంచి కొలుకుంటున్న ఆర్టీసీపై కరోనాసెకండ్‌వేవ్‌ మరోసారి పంజా విసురుతోంది.


Updated Date - 2021-04-16T07:16:51+05:30 IST