డిసెంబరులోనే శాసనసభ ఎన్నికలు

ABN , First Publish Date - 2022-07-02T16:13:18+05:30 IST

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు డిసెంబరులోనే జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని, పార్టీ శ్రేణులు ఇందుకు సన్నద్ధం కావాలని జేడీఎస్‌ నేత,

డిసెంబరులోనే శాసనసభ ఎన్నికలు

- మాజీ సీఎం కుమారస్వామి జోస్యం  

- నా సత్తా ఏంటో చూపిస్తా  

- ‘జనతా మిత్ర’లో మాజీ ప్రధాని దేవెగౌడ 


బెంగళూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ ఎన్నికలు డిసెంబరులోనే జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని, పార్టీ శ్రేణులు ఇందుకు సన్నద్ధం కావాలని జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. బెంగళూరులోని జేపీ భవన్‌లో శుక్రవారం ‘జనతా మిత్ర’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. 15 ప్రచార రథాలు నగరమంతటా సంచరించి పార్టీ ఆశయాలు ప్రజలకు వివరిస్తాయన్నారు. బెంగళూరులో కనీసం 15 శాసనసభ నియోజకవర్గాల్లో జేడీఎస్ కు విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. చామరాజపేట, పులకేశినగర్‌, మహాలక్ష్మి లే అవుట్‌లో గతంలో గెలిచామని గుర్తు చేసిన ఆయన, ఈ నియోజకవర్గాలలో మళ్లీ సత్తా చాటుతామన్నారు. బెంగళూరు నగర కార్యకర్తల సమావేశం ఈనెల 17న లక్షన్నర మందితో జరుగుతుందన్నారు. రెండు ప్రధాన జాతీయ పార్టీలు నగరాభిృద్ధిని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ఆగస్టులో పంచరత్న రథయాత్రలకు శ్రీకారం చుడతామన్నారు. గ్రామ గ్రామాన సంచరించి వాటిని బలోపేతం చేస్తామన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడపై చౌకబారు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎన్‌ రాజణ్ణపై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది ఆయన వికృత మనస్తత్వాన్ని చాటుతోందన్నారు. తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కించకుండా మాజీ ప్రధాని దేవేగౌడ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. మరో మూడు నెలల తర్వాత ఎవరిసాయం లేకుండానే దేవేగౌడ ప్రజాక్షేత్రంలో సంచరించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ మాట్లాడుతూ తనను, పార్టీని అపహాస్యం చేస్తున్నవారికి రానున్నరోజుల్లో సత్తాచాటి తగిన గుణపాఠం చెబుతానని శపథం బూనారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షు ఇబ్రహీంతోపాటు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శరవణ, కేరళ రాష్ట్ర జేడీఎస్‌ అధ్యక్షుడు కృష్ణన్‌ కుట్టి, కేరళ జేడీఎస్‌ ఎమ్మెల్యే థామస్‌ మాథ్యూ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T16:13:18+05:30 IST