రైతులను దగా చేశాడు..

ABN , First Publish Date - 2022-06-25T05:42:21+05:30 IST

‘అధికారంలోకకి రాకముందు పాద యాత్ర చేస్తున్న సమయంలో అందరికీ ముద్దులు పెట్టి, అందరి తలల మీద చేతులు పెట్టి, తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని మాయమాటలు చెప్పి అధికారం చేపట్టాక రైతుల గుండల మీద గుద్దుతున్నాడు. తండ్రి వైఎస్‌ఆర్‌ జయంతిని

రైతులను దగా చేశాడు..
బద్వేలులో నిర్వహించిన రైతు పోరుబాట వేదికపైన టీడీపీ నేతలు

మోటర్లకు మీటర్ల ద్వారా రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారు

కేసుల నుంచి బయటపడేందుకే కేంద్ర ప్రభుత్వానికి తల వంచుతున్నాడు

జగన్‌మోసంరెడ్డి రైతులకు సమాధానం చెప్పాలి 

రైతు పోరుబాట సభలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతల ఆగ్రహం

బద్వేలు రూరల్‌, జూన్‌ 24 : ‘‘అధికారంలోకకి రాకముందు పాద యాత్ర చేస్తున్న సమయంలో అందరికీ ముద్దులు పెట్టి, అందరి తలల మీద చేతులు పెట్టి, తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని మాయమాటలు చెప్పి అధికారం చేపట్టాక రైతుల గుండల మీద గుద్దుతున్నాడు. తండ్రి వైఎస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించి తండ్రి సాక్షిగా రైతులను దగా చేస్తున్నాడు. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే కేంద్ర ప్రభుత్వానికి తల ఒంచి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి వారి మెడలకు ఉరితాళ్లు బిగించేందుకు తెగబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రైతులంతా ఏకమై గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మైదుకూరు రోడ్డులోని ఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ సమీపంలో రైతు పోరుబాట ఏర్పాటు చేశారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పాల్గొని రైతుల పక్షాన మాట్లాడారు.


జగన్‌ను గద్దె దించాల్సిన సమయం వచ్చింది

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని రైతులకు రైతు రథచక్రాల పేరిట ట్రాక్టర్లను అందజేశామన్నారు. రాయలసీమలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా ఉద్యాన పంటలను అభివృద్ధి చేశామని, కానీ నేడు మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు వ్యవసాయ పనిముట్లను అయినా అందజేశారా? అని ప్రశ్నించారు. జగన్‌ మోహన్‌రెడ్డి జగన్‌మోసంరెడ్డిగా బిరుదు అందుకున్నారన్నారు. రైతులను నట్టేట ముంచడానికి సిద్ధపడిన జగన్‌మోసంరెడ్డిని గద్దె దింపాల్సిన సమయం అసన్నమైందని అన్నారు.


రైతుల పక్షాన జైలుకైనా వెళతాం

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మాట్లాడుతూ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించాడన్నారు. కానీ ఆనాటి నుంచి నేటి వరకు రైతులకు దగా చేసేందుకే నడుంకట్టారన్నారు. తన సొంత నియోజకవర్గంలో పంట బీమాను అందించారా? ఉద్యాన పంటలైన అరటిని దిబ్బల్లో వేసే పరిస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు. రైతులు ఎవరు కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు ఒప్పుకోవద్దని, రైతుల పక్షాన పోరాడి జైలుకైనా వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని అన్నారు.


రైతుల కడుపు కొడుతున్నారు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో రైతుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలన్నింటిని నేడు జగన్‌ ప్రభుత్వం ఆపేసిందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఆపేసి రైతుల కడుపుగొడుతున్నారని ఆరోపించారు. పంట బీమా వైఎస్‌ఆర్‌ సానుభూతిపరులకే అందుతోందన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల విద్యుత్‌ బిల్లులు వస్తాయని దీనిని అందరూ ఎదిరించాలన్నారు. అందుకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.


రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తామనడం విడ్డూరం

మాజీమంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇజ్రాయిల్‌ టెక్నాలజీ ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌తో ఉద్యాన పంటలను అభివృద్ధి చేశారన్నారు. నాడు దేశమంతా డ్రిప్‌ ఇరిగేషన్‌ వైపు చూసేలా చేసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని, విద్యుత్‌ బిల్లులు రైతులు కడితే ఆ నగదును రైతుల ఖాతాలలో వేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.


రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారు

బీసీ జనార్ధన్‌రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి,  కేఈ ప్రభాకర్‌, టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి,  శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌, అనంతపురం జిల్లాకు చెందిన జై.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌.జగన్‌ అధికారంలోకి రాకముందు రైతులపక్షపాతినని రైతులకు ఆపదవస్తే ముందుంటానని ప్రగల్బాలు పలికి నేడు రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించేందుకు సిద్ధపడ్డారన్నారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ లేదని రైతులకు సబ్సిడీ అందడం లేదని ఆరోపించారు. అందరికీ అన్నం పెట్టే రైతులకు కూడా పార్టీలను అంటగట్టడం దారుణమన్నారు. ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌లో ఉద్యాన పంటకు సబ్సిడీని తొలగించేశారని గత ప్రభుత్వంలో ఉద్యాన పంటలు సబ్సిడీతో అభివృద్ధి చెందాయన్నారు. తండ్రి  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్న 60 నెలల కాలంలో 60 కంపెనీలను అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించిన జగన్మోహన్‌రెడ్డికి రైతు కష్టం తెలుసా అని ప్రశ్నించారు. రైతు భరోసా రూ.13500 ఇస్తాను అని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఎంత ఇస్తున్నాడని అడిగారు. నాడు పట్టుసీమ దండగన్న ముఖ్యమంత్రికి నేడు పట్టు సీమ ద్వారా పులివెందులకు నీరు వస్తున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. రైతు పక్షపాతినని చెప్పి అన్నదాతను వంచన చేసి గద్దెనెక్కి నేడు అన్నదాతనే ఆత్మహత్యలకు పురిగొలుపుతున్నాడన్నారు. ధరల స్థిరీకరణకు నిధులను కేటాయించి ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు.


ఇచ్చిన హామీని మరచిన జగన్‌

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమశిల వెనుక జలాలను లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా బద్వేలు ప్రాంత చెరువులను నింపుతామని జీవో ఇచ్చారన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో సోమశిల వెనక జలాల ద్వారా 5 టీఎంసీల నీటిని ఇస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నిక ముగిసినా ఉప ఎన్నిక ముగిసినా ఇంతవరకు ఊసే లేదన్నారు. రాష్ట్రంటో నకిలీ పురుగుల మందులు అమ్మే వారిపై గట్టి చర్యలు చేపట్టాలన్నారు. తాత బిజివేముల వీరారెడ్డి ఆశయ సాధనలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి అన్ని కాలువలలో నీరు పారి బద్వేలు ప్రాంత రైతులకు మేలు జరిగేంత వరకు కృషి చేస్తామన్నారు. బద్వేలులో వ్యవసాయ కళాశాల స్థాపించామని అనుసంధానంగా మెగా స్టేషన్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  రైతు పోరుబాట బద్వేలు నుంచి మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అందుకు సహకరించిన 35 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు, బద్వేలు ప్రాంత రైతాంగానికి కృజ్ఞతలు తెలియజేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానం ఆపేంత వరకు రైతు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు పుత్తా నరసింహారెడ్డి, కడప పార్లెమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పార్థసారధి, రామగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జులు ఆర్‌.రమేశ్‌కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌, భూపేశ్‌రెడ్డి, ఉక్కుప్రవీణ్‌, అమీర్‌బాబు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ రైతు పోరుబాట సక్సెస్‌

బద్వేలు, జూన్‌ 24: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై  రాష్ట్రంలో మొదటిగా బద్వేలు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువనేత రితేష్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పోరుబాట సక్సెస్‌ అయింది. ఐదు జోన్లనుంచి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సభకు హాజరయ్యారు. టీడీపీ శ్రేణులు, రైతులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఊహించిన దానికంటే వేలాదిమంది ఎక్కువగా తరలివచ్చారు. టీడీపీ అగ్ర నేతల రాకతో బద్వేలు వీధులు పసుపుమయమయ్యాయి. రైతులతో కలిసి టీడీపీ నేతలు భారీ ఎత్తున ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. 



Updated Date - 2022-06-25T05:42:21+05:30 IST