దశాబ్దాల కల సాకారం

ABN , First Publish Date - 2022-09-23T05:21:23+05:30 IST

మెదక్‌ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైన్నది. మరికొద్ది గంటల్లోనే మెదక్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కాచిగూడ వరకు రైలులో ప్రయాణం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దశాబ్దాల కల సాకారం
మెదక్‌ రైల్వేస్టేషన్‌

ఎట్టకేలకు మెదక్‌కు రైలు కూత

నేడు మెదక్‌-కాచిగూడ ప్యాసింజర్‌ రైలు షురూ

ప్రారంభించనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు

రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ 


మెదక్‌, సెప్టెంబరు 22 : మెదక్‌ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైన్నది. మరికొద్ది గంటల్లోనే మెదక్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కాచిగూడ వరకు రైలులో ప్రయాణం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధిశాఖ మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు.  ఈ  కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, మెదక్‌ జడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ హాజరుకానున్నారు. అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ మార్గంలో మూడు స్టేషన్లు ఏర్పాటు చేశారు. అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ నుంచి కొత్త రైలు మార్గం ప్రారంభమవుతుంది. రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌, హవేళిఘనపూర్‌ మండలం శమ్నాపూర్‌, మెదక్‌లో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేశారు. 

 మెదక్‌కు రైలు మార్గం కోసం 2003లో రైల్వే సాధన సమితి పేరిట స్థానిక ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు. పార్టీలకతీతంగా తరచూ సమావేశం కావడం ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్‌ను వినిపించారు. ఈ క్రమంలోనే 2012-2013 రైల్వే బడ్జెల్‌లో కాస్ట్‌ శేరింగ్‌ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్‌ పట్టణం వరకు బ్రాడ్‌ గేజ్‌ రైల్వేలైన్‌ మంజూరయ్యింది. 17.2 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటుకు రూ.118 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేశారు. పలు కారణాల వల్ల పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం సుమారు రెండింతలకు చేరింది. రూ.206 కోట్లు వెచ్చించాల్సి రావడంతో అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.103 కోట్లు భరించాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వాల నుంచి నిధులు పూర్తి స్థాయిలో నిధులు మంజూరవ్వకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వాటా మొత్తం మంజూరు కాగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నత్తనడకన సాగాయి. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో రూ.20 కోట్లు మంజూరవ్వగా ఆ మేరకు పనులు జరిగాయి. మరో రూ.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పనులు పూర్తి చేశారు. ఇక కరోనా సమయంలో మెదక్‌ రైల్వే స్టేషన్‌ పనులు నిలిచిపోవడంతో ఆకతాయిలు స్టేషన్‌లో సాంకేతిక సామగ్రిని, సీలింగ్‌, తదితర వస్తువులను ధ్వంసం చేశారు. కరోనా అనంతరం స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇటీవల అక్కన్నపేట స్టేషన్‌ నుంచి పలు మార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 


అన్ని సౌకర్యాలతో మెదక్‌ రైల్వేస్టేషన్‌

ఆధునిక సౌకర్యాలు, హంగులతో మెదక్‌లో రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. పొడవైన ప్లాట్‌ఫాం, టికెట్‌ కౌంటర్‌ గది, ప్రయాణికులు వేచి ఉండటానికి చక్కటి హాలు, చేర్యాల నకాషీ పెయింటింగ్స్‌తో గోడలపై అందంగా చిత్రీకరిస్తున్నారు. పట్టణ శివారులో నిర్మించిన రైల్వేస్టేషన్‌ చూడముచ్చటగా ఉంది. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం ఉచిత వైఫైని అందిస్తున్నారు. స్టేషన్‌ ప్రాంగణంలో పచ్చటి పూల, మొక్కల కుండీలు అందంగా అమర్చారు. మెదక్‌ స్టేషన్‌ నుంచి నిత్యం తెల్లవారుజామున 5 గంటలకు కాచిగూడ ప్యాసింజర్‌ రైలు బయలుదేరుతుంది. తిరిగి రాత్రి 9 గంటలకు కాచిగూడలో మొదలై 11 గంటలకు మెదక్‌ స్టేషన్‌కు చేరుతుందని ఇన్‌చార్జి స్టేషన్‌ మాస్టర్‌ సంపత్‌కు కుమార్‌ తెలిపారు. 


నేడు మెదక్‌లో విజయోత్సవ ర్యాలీ

మెదక్‌ రైల్వేస్టేషన్‌ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఉద్యమంలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రజలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉదయం 11 గంటలకు ర్యాలీలో పాల్గొనాలని రైల్వే సాధన సమితి ప్రకటనలో పిలుపునిచ్చింది. 2003లో సమితి ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రైల్వేలైన్‌ సాధించే వరకు సహకారాన్ని అందించిన మెదక్‌ ప్రాంత ప్రజలు బాజాభజంత్రీలతో రైల్వేస్టేషన్‌ వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 





Updated Date - 2022-09-23T05:21:23+05:30 IST